చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రప్రభుత్వం విద్యుత్ కోతలకు సన్నద్ధం అవుతోంది. గృహావసరాలకు రోజుకు గంట చొప్పున విద్యుత్ కోత విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కోతలు త్వరలో అమలు కానున్నాయి. రాష్ట్రంలో 2008లో విపరీతంగా విద్యుత్ లోటు ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు విద్యుత్ కోతను అమలు చేశారు. వల్లూరు, ఉత్తర చెన్నై, మేట్టూరు తదితర థర్మల్ కేంద్రాల నుంచి అదనంగా 2,500 మెగావాట్ల విద్యుత్ అందుతున్నా లోటు భర్తీ కావడం లేదు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుకోలేక గత ఏడాది సెప్టెంబర్ నుంచి పారిశ్రామిక రంగంలో 20 శాతం కోత అమలు చేస్తోంది. వేసవి కావడంతో రాష్ట్రంలో రోజురోజుకూ విద్యుత్‌సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసం పెరిగిపోతోంది. జూన్, జూలైలో విద్యుత్ డిమాండ్ తీవ్రస్థాయికి చేరుతుందని అధికారులు అంచనావేశారు. 2014 మార్చిలో సగటున 12 వేల మెగావాట్ల వాడకం జూన్, జూలై నాటికి 13,775 మెగావాట్లకు చేరుకుంది.
విద్యుత్ వాడకంలో రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రికార్డుగా నమోదైంది. ప్రస్తుతం విద్యుత్ అవసరం 13వేల మెగావాట్ల దాటిపోగా 15వేల మెగావాట్లకు చేరుకున్నా అశ్చర్యం లేదని అంటున్నారు. ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన మదురై పవర్ 106, సమల్‌పట్టి 105.66, పీబీఎన్ 330.5, జీఎంఆర్ 196 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేలా తమిళనాడు విద్యుత్ బోర్డు ఒప్పందం చేసుకుంది. ప్రయివేటు విద్యుత్ కొనుగోలు కారణంగా ఏడాదికి *5వేల కోట్ల నుంచి *6 వేల కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడనుంది. అయితే జీఎంఆర్‌తో చేసుకున్న ఒప్పందానికి ఫిబ్రవరితో గడువు ముగిసినందున వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం లేదు. విద్యుత్ సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని నివారించేందుకు మదురై పవర్, పీబీఎన్, సమల్‌పట్టి తదితర సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలును నిలిపివేశారు.
దీంతో 738 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. డిమాండ్‌కు తగినంతగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం విద్యుత్ బోర్డులో కొరవడింది. దీనివల్ల రోజుకు 800 నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ పరిస్థితిల్లో పరిశ్రమల్లో విద్యుత్ కోతను 20 నుంచి 40 శాతానికి పెంచాలని నిర్ణయించారు. అయితే, మే 23, 24 తేదీల్లో చెన్నైలో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా పరిశ్రమల్లో విద్యుత్ కోత పెంపునకు ప్రభుత్వం అనుమతించలేదు. ఈ కారణంగా విద్యుత్ అధికారుల కన్ను గృహ వినియోగదారులపై పడింది. ఇళ్లకు రోజుకు గంటసేపు విద్యుత్ కోతను విధించాలని నిర్ణయించారు.
దీనిపై ఒక విద్యుత్ అధికారి మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పక్కదారిపట్టించి, వాస్తవాలను కప్పిపుచ్చి ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారని ఉన్నతాధికారులను ఆక్షేపించారు. ప్రయివేటు సంస్థల నుంచి కొనుగోలు చేసినా మండువేసవిలో విద్యుత్ డిమాండ్‌ను చేరుకోలేమని బోర్డు భావిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇక గత్యంతరం లేని పరిస్థితిలో ఈనెల 20 వ తేదీ నుంచి జూలై చివరి వరకు గృహ వినియోగదారులకు కోత విధించడానికి సిద్ధం అవుతున్నామని చెప్పారు. చెన్నైలోని ఇళ్లకు 30 నిమిషాలు, ఇతర ప్రాంతాల్లో గంటపాటు కోత విధించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. విద్యుత్ కోతలకు అవసరమైన ఆదేశాలు సచివాలయంలో సిద్ధం అవుతున్నాయని, ఆ ఉత్తర్వులు అందగానే కోత అమలులోకి వస్తుందని చెప్పారు.
త్వరలో కోతలు
Published Sun, Apr 5 2015 2:57 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement