మళ్లీ కోతలు! | time for power cuts | Sakshi
Sakshi News home page

మళ్లీ కోతలు!

Published Sat, Mar 22 2014 11:05 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

time for power cuts

రాష్ట్రానికి మళ్లీ విద్యుత్ గండం వచ్చి పడింది. రోజుకు రెండు వేల మెగావాట్ల కొరత ఏర్పడడంతో గ్రామాల్లో కోతలకు పని పెట్టారు. నగరాల్లో రెండు గంటలు, గ్రామాల్లో 8 గంటల మేరకు కోతల వాత పెట్టే పనిలో విద్యుత్ బోర్డు పడింది. ప్లస్ టూ, పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఈ కోతలు ఆటంకంగా మారాయి.
 ఎన్నికల వేళ ఈ కోతలు ఎక్కడ తమ ఓట్లకు గండి కొడతాయేమోనన్న బెంగ అధికార పక్షంలో నెలకొంది.
 
 సాక్షి, చెన్నై:
రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రజలు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని,  ఎదుర్కొంటూ వచ్చారు. విద్యుత్ గండం నుంచి బయట పడేందుకు అధికార యంత్రాంగం నానా తంటాలు పడింది. ఎట్టకేలకు గత ఏడాది చివర్లో రాష్ట్ర ప్రభుతానికి ఊరట కలిగించే రీతిలో కొత్త ప్రాజెక్టులు చేయూతనిచ్చాయి.
 
దీంతో క్రమంగా విద్యుత్ కోతల సమయం తగ్గుముఖం పట్టింది. చెన్నై, మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, తిరునల్వేలి తదితర నగరాల్లో పూర్తిగా కోతలు ఎత్తి వేశారు. గ్రామాల్లో ఏదో ఒక సమయంలో రోజుకు గంటో, అరగంటో విద్యుత్ సరఫరా ఆగేది. రాష్ట్ర వ్యాప్తంగా నెలలో ఒక రోజు  ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తూ వచ్చారు. దీంతో విద్యుత్ కోతలకు రాష్ట్రంలో మంగళం పాడినట్టేనన్న ధీమా అటు అధికారుల్లో, ఇటు పాలకుల్లో పెరిగింది. అయితే, మూడు రోజులుగా ఉన్నట్టుండి రాష్ట్రంలో మళ్లీ కోతలు అమల్లోకి వచ్చాయి.
 
 గండం:  ఇది వరకు రోజుకు రాష్ట్రంలో 12 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండేది. ఉత్పత్తి ఆ దరిదాపుల్లోకి చేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రస్తుతం విద్యుత్ వాడకం ఉన్నట్టుండి పెరిగింది. ఇందుకు కారణం వేసవి సమీపించడమే. అగ్ని నక్షత్రానికి ముందే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఏసీలు, ఫ్యాన్ల, ఎరుుర్ కూలర్ల వాడకం పెరిగింది. అలాగే, శీతల పానీయాల తయారీ నిమిత్తం అందుకు తగ్గ ఉపకరణాల వాడకం పెరిగింది. ఇవన్నీ వెరసి విద్యుత్ బోర్డు నెత్తి మీద గండాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అదే సమయంలో కొన్ని ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, పవన విద్యుత్ చతికిల బడటం వెరసి రాష్ట్ర ప్రజల నెత్తిన కోతల గుది బండను మోపారు.
 
 మళ్లీ కోతలు : వారం రోజులుగా రాష్ట్రంలో రోజుకు 13 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడింది. అయితే, ఉత్పత్తి మాత్రం 11 వేలు మాత్రమే ఉండటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. రోజుకు రెండు వేల మెగావాట్లకు పైగా కొరత నెలకొనడంతో కోతలకు పని పెట్టారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరా నిలుపుదల చేసే పనిలో పడ్డారు. చెన్నై, మదురై తదితర నగరాల్లో గంట వరకు, గ్రామాల్లో 8 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో కోతలు తమను ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చెన్నై నగరంలో గంట, శివారుల్లో నాలుగు గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్లస్‌టూ పరీక్షలు ముగింపు దశకు చేరాయి. మరి కొద్ది రోజుల్లో పదోతరగతి పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో కోతలు అమలు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాత్రుల్లో విద్యుత్ సరఫరా లేకపోవడం ఓ వైపు, దోమల మోత మరో వైపు వెరసి విద్యార్థులను, ప్రజలు అష్టకష్టాలకు గురి చేస్తున్నాయి.
 
 గుబులు : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ర్టంలో విద్యుత్ గండం నెలకొనడంతో అధికార పక్షంలో గుబులు పట్టుకుంటోంది. అన్ని స్థానాల కైవశం లక్ష్యంగా ముందుకెళుతున్న వేళ విద్యుత్ కోతల రూపంలో ఎక్కడ ఓట్లకు గండి పడుతుందోనన్న ఆందోళన నెలకొంది. రాష్ర్టంలో హఠాత్తుగా అమల్లోకి వచ్చిన కోతలను డీఎంకే ప్రధాన అస్త్రంగా చేసుకుంది. రెండు రోజులుగా తన ప్రచార ప్రసంగం అంతా విద్యుత్ కోతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించే పనిలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పడ్డారు.
 
 అదే సమయంలో ప్రచారాలకు వెళ్లే అధికార పక్షం అభ్యర్థులకు పలు చోట్ల కోతల రూపంలో నిరసనలు ఎదురవుతున్నారుు. దీంతో ఈ గండం నుంచి గట్టెక్కే రీతిలో అధికారులకు అధికార పక్షం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై విద్యుత్ బోర్డు అధికారి ఒకరు పేర్కొంటూ, తాత్కాలికంగానే విద్యుత్ సంక్షోభం నెలకొందన్నారు. ఉత్తర చెన్నై, మెట్టూరు, తూత్తుకుడి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని, మరి కొద్ది రోజుల్లో ఉత్పత్తి మళ్లీ యథాస్థితికి చేరుకుంటుందన్నారు. చతికిల బడిన పవన విద్యుత్ మరో వారంలో పుంజుకోవడం ఖాయం అని, అంత వరకు కోతలు భరించాల్సిందేనని పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement