తమిళనాడులో ఎన్నికలు అలా ముగిశాయో, లేదో.. విద్యుత్ కోతలు మొదలైపోయాయి. ఈ కోతలు ఏకంగా 41 ఏళ్ల పాత్రికేయుడి ప్రాణాలు బలిగొన్నాయి. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఓ తమిళ పత్రిక సంపాదకుడు పొన్ మురుగన్.. సోమవారం తెల్లవారుజామున మరణించారు. తెల్లవారుజామునే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, వెంటిలేటర్ ఆగిపోవడం వల్లే ఆయన పల్స్ పడిపోయి.. మరణించారని ఆయన తండ్రి రామస్వామి ఆరోపించారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగి కూడా విద్యుత్ కోత వల్లే మరణించారని ఆయన కుటుంబం కూడా వాపోయింది.
తమిళనాడుకు ప్రస్తుతం 1500 మెగావాట్ల విద్యుత్ లోటు ఉంది. గత కొన్నేళ్లలో ఇది ఏకంగా 3000 మెగావాట్ల వరకు కూడా వెళ్లడంతో గ్రామాలకు 14 గంటల వరకు కోతలు విధించారు. పారిశ్రామిక రాజధాని అయిన కోంబత్తూరులో వందలాది యూనిట్లు విద్యుత్ సంక్షోభంతో మూతపడ్డాయి. ఈ ఎన్నికల్లో విద్యుత్ కోతలను డీఎంకే ప్రధానాస్త్రంగా వాడుకుంది. కానీ, ఈ సంక్షోభానికి డీఎంకేయే కారణమని సీఎం జయలలిత అంటున్నారు. గత కొన్ని నెలలుగా ఎన్నికల పుణ్యమాని కోతలు కొంతవరకు తగ్గినా, లోక్సభ ఎన్నికలు ముగియగానే మళ్లీ కోతలు మొదలయ్యాయి. రాష్ట్ర రాజధానిలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు మరణిస్తున్నారు.
డీఎంకే, అన్నా డీఎంకే రెండు పార్టీలూ ఉచిత బహుమతులు ఇవ్వడానికే డబ్బు మొత్తం ఖర్చుపెడుతున్నాయని, వాటితో కరెంటు కొంటే ఈ సమస్య ఉండేది కాదని చెన్నై వాసులు ఆరోపిస్తున్నారు. నడివేసవి కావడంతో తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు.
పోలింగ్ ముగిసింది.. కోత మొదలైంది!!
Published Tue, May 6 2014 12:24 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement
Advertisement