ఓట్లేసిన తారలకు పాట్లు | EC Serious On Ajith Srikanth Sivakarthikeyan | Sakshi
Sakshi News home page

ఓట్లేసిన తారలకు పాట్లు

Published Fri, Apr 26 2019 10:19 AM | Last Updated on Fri, Apr 26 2019 10:19 AM

EC Serious On Ajith Srikanth Sivakarthikeyan - Sakshi

పెరంబూరు: ఓట్లేసిన తారలు కొందరు ఇప్పుడు పాట్లకు గురవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు దాదాపుగా ప్రశాంతంగా జరిగాయనుకుంటున్న సమయంలో కొందరు ఓట్లేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో నటుడు శివకార్తికేయన్, అజిత్, శ్రీకాంత్‌ వంటి వారి ఓటు హక్కును వినియోగించుకున్న విధానం విమర్శలకు తావిచ్చింది. దీంతో కొందరు పోలింగ్‌ అధికారులకు వేటు పడే అవకాశం ఏర్పడనుంది. నటుడు శివకార్తికేయన్‌ పేరు ఓటరు పట్టికలో లేకపోయినా ఆయన్ని ఓటు వేయడానికి అధికారులు అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా మరో నటుడు శ్రీకాంత్‌ ఓటు వేయడంపైనా ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రతసాహూ అధికారులను వివరణ కోరారు. వారిపై ఎన్నికల శాఖ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.

ఇక ప్రముఖ నటుడు అజిత్‌ వరుసలో నిలబడ కుండా నేరుగా బూత్‌ వద్దకు వెళ్లి ఓటు వేయడం పైనా విమర్శలు వస్తున్నాయి. దీనిపైనా విచారణ జరుపుతామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.అంతే కాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో జయాపజయాలను ఒక్క ఓటు నిర్ణయంచే పరిస్ధితి సంభవిస్తే వీరి ఓట్లను పరిగణలోకి తీసుకోవడం జరగదని పేర్కొన్నారు. కాగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం గురించి నటుడు శ్రీకాంత్‌ వివరణ ఇస్తూ ఎన్నికల నిర్వాహకులు ఆక్షేపణ లేదని చెప్పడంతోనే  స్థానిక సాలిగ్రామంలోని కావేరి పోలీంగ్‌ బూత్‌లో తాను ఓటు వేసినట్లు తెలిపారు. తన ఆధార్‌ కార్డులో నూతన ఇంటి చిరునామా ఉండటం వల్లే తన పేరు లేక్‌ ఏరియా ఓటరు పట్టికలోకి మారిందని, ఈ విషయం గురించి నిర్వాహకులెవరూ వివరించలేదని అన్నారు. ఇలాంటి విషయాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా నటుడు అజిత్,తన భార్య  శాలినితో కలిసి  పోలింగ్‌ బూత్‌కు కారులో వచ్చారు. దీంతో వారు వచ్చిన విషయం తెలిసి అక్కడ ఉన్న జనం కారును చుట్టు ముట్టారు.అందువల్ల అజిత్‌ శాలిని దంపతులు కిందకు దిగకుండా కారులోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు వచ్చి అజిత్,శాలినిలను పోలీంగ్‌ బూత్‌ వద్దకు తీసుకెళ్లారు. ఇది విమర్శలకు దారి తీసింది. నటులకో విధానం, సామాన్య ప్రజలకు మరో విధానమా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపైనా ఎన్నికల ప్రధాన అధికారి వివరణ కోరినట్లు తెలిపారు.ఈ వ్యహారం చూస్తుంటే ఎంకి పెళ్లి సుబ్బు చావు కొచ్చినట్లు, ఎన్నికల నిర్వాహకులు చర్యలకు గురైయ్యే పరిస్థితి నెలకొంది. ఇక నటులు ఇవేం పాట్లురా బాబూ అని తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement