కరెంటు పోతే.. ఇక అంతే!
Published Wed, Sep 11 2013 1:37 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
సాక్షి, రాజమండ్రి : కరెంట్ పోయిందా? అయితే రావడం కష్టమే.. ఇంటి సర్వీసు వైరు ఊడిపోయిందా? ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌ను వెతుక్కోవలసిందే.. ఎందుకంటే బుధవారం అర్థరాత్రి నుంచి విద్యుత్తు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పటివరకూ వర్క్‌టు రూల్ ద్వారా నిరసన తెలిపిన ఉద్యోగులు ఇప్పుడిక ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు. బుధవారం అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్తు ఉద్యోగులు నిర్ణయించారు.
మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగుల జేఏసీ సమావేశమై రాష్ట్రనాయకులతో సమాలోచన జరిపింది. సమ్మెకు అన్ని విభాగాల సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ అత్యవసర సేవలు నిలిచిపోతే ప్రజలు ఇబ్బంది పడతారనే అంశంపై చర్చించింది. అధిక శాతం ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్లడంద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సమావేశం సూచించినట్టు తెలుస్తోంది. దీంతో సమ్మెకు సిద్ధమని ఉద్యోగ సంఘాల జేఏసీ రాత్రి తన నిర్ణయాన్ని ప్రకటించింది. జిల్లాలో వివిధ విభాగాలకు చెందిన 3000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2200 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా 800 మంది కాంట్రాక్టు సిబ్బంది. ప్రస్తుతానికి రెగ్యులర్ సిబ్బంది అందరూ సమ్మె బాట పట్టనున్నారు.
ప్రజలకు కష్టకాలం
విద్యుత్తు ఉద్యోగుల సమ్మెతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలున్నా యి. విద్యుత్తు సరఫరాలో సమస్యలు వస్తే పునరుద్ధరణ కష్టమవుతుంది. తాగునీటి సరఫరా కూడా ఇబ్బందుల్లో పడుతుంది. పురపాలక సిబ్బంది కూడా సమ్మెలో ఉండడం తో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకూ అవ కాశం లేదు. గృహ విద్యుత్ కనెక్షన్లు పాడైతే బాగుచేసే వారే ఉండరు. సాంకేతిక లోపాలను పరిష్కరించే సిబ్బంది కూడా సమ్మెలో ఉంటారు. ఆస్పత్రుల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోతే మందుల శీతలీకరణ సమస్యలో పడుతుంది. జనరేటర్‌నే నమ్ముకోవలసి ఉంటుంది. 80 శాతం ఆస్పత్రుల్లో జనరేటర్ నిర్వహణకు నిధులు లేని పరిస్థితులు ఉన్నా యి. కాగా బుధవారం తమ డిపార్‌టమెంట్ సిమ్ కార్డులను హ్యాండోవర్ చేయాలని విద్యుత్ సిబ్బంది నిర్ణయంచారు.
Advertisement