సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలను నిజంచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌తో కలిసి 750 ఎకరాల్లో ఈ యూనిట్ ఏర్పాటుకు అంకురార్పణ చేయగా ఆయన మరణానంతరం అది అటకెక్కింది. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కార్ మన్నవరంలో సోలార్ వంటి పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేస్తోంది.
అలాగే, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పునరుత్పాదక ఇంధన ఉపకరణాల దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు మాన్యుఫాక్చరింగ్ జోన్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు ఇష్టమైన రాష్ట్రాలు, భాగస్వామ్య కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది. వీటిలో.. ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాలను (బ్రౌన్‌ఫీల్డ్) సోలార్ ఉపకరణాల యూనిట్లుగా మార్చడంతోపాటు వీటికి అదనంగా మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో.. బ్రౌన్‌ఫీల్డ్ విభాగంలో మన్నవరాన్ని అభివృద్ధిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఒక్కొక్కటి రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్లలో రూ.400 కోట్లు కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ (సీఐఎఫ్), కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ (సీటీఎఫ్)లకు గ్రాంట్ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కానీ, భాగస్వామ్య కంపెనీలుగానీ ముందుకు రావచ్చని, ఆసక్తి కలిగిన సంస్థలు మే 4లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరింది.
అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ..
ఇక మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రం కోసం నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భూములను కేటాయించారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్టీపీసీ–బీహెచ్‌ఈఎల్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. కానీ, ఒక్కసారిగా థర్మల్ విద్యుత్‌కు డిమాండ్ తగ్గడంతో ఈ కేంద్రం నామమాత్రంగా ఉండిపోయింది. అనంతరం.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి మన్నవరంలో భారీ ఉపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసే నిమిత్తం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపారు. అలాగే, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నవంబర్ 11, 2021లో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌ను కలిసి పీఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీం కింద మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఈ ఏడాది జనవరిలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ప్రతిపాదిత మూడు విద్యుత్ ఉపకరణ తయారీ కేంద్రాల్లో ఒకటిగా మన్నవరాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం మూడు పునరుత్పాదక విద్యుత్ పరికరాల యూనిట్లను ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుందని ఏపీఐఐసీ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి ఎన్టీపీసీ–బీహెచ్‌ఈఎల్‌కు కేటాయించారని.. దీన్ని ఏ విధంగా భాగస్వామ్య కంపెనీగా ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలించి బిడ్డింగ్‌లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment