సంగారెడ్డి క్రైం : విద్యుత్ పనులు సకాలంలో చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ట్రాన్స్‌కోకు జిల్లా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన కూస వీరారెడ్డి కుటుంబంతో సిద్దిపేటలో నివాసముంటున్నాడు. తన పొలంలో కరెంట్ తీగలు ప్రమాదకరంగా మారిందని, వాటికి మరమ్మతులు చేపట్టాలని సిద్దిపేటలోని ట్రాన్స్‌కో శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించారు. అయినా వారు పట్టించుకోలేదు.
ఈ క్రమంలో 2011 జూన్ 18న పొలంలో బోరు మోటారు స్విచ్ ఆన్ చేయబోయిన వీరారెడ్డి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తన భర్తకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, తనకు నష్టపరిహారం చెల్లించాలని మృతుడి భార్య కూస పద్మ ట్రాన్స్‌కో శాఖపై వినియోగదారుల ఫోరాన్ని 2013 ఫిబ్రవరి 8వ తేదీన ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం బాధితురాలికి రూ. 5 లక్షల నగదుతో పాటు రూ. 2వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు పాటిల్ విఠల్‌రావు ఆదేశాలు జారీ చేశారు.
ఇన్సూరెన్స్ కంపెనీపై.....
ఇన్సూరెన్స్ కిస్తీలు చెల్లించినప్పటికీ పాలసీని రద్దు చేసిన బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ కంపెనీపై జిల్లా వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. జహీరాబాద్ మండలం బూచినెల్లి గ్రామానికి చెందిన బ్యాగరి మల్లమ్మ సంగారెడ్డిలోని బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సంగారెడ్డిలో 2009 అక్టోబర్ 10న సంవత్సరానికి రూ. 10 వేలు చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం రూ. 20 వేలు చెల్లించి ఇన్సూరెన్స్ తీసుకుంది.
మూడో ప్రీమియం రూ. 10 వేలు ఏజెంట్‌కు చెల్లించింది. కాగా 2013 అక్టోబర్ 12వ తేదీన పాలసీ రద్దు అయినట్లు కంపెనీ నుంచి ఆమెకు లేఖ ద్వారా సమాచారం అందించారు. తాను ఏజెంట్ ద్వారా రూ. 10 వేలు చెల్లించినప్పటికీ పాలసీ ఎలా రద్దు చేస్తారని ఆమె జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం బాధితురాలికి రూ. 30 వేలు నష్టపరిహారంతో పాటు 9 శాతం వడ్డీ, రూ. 5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు పాటిల్ విఠల్‌రావు ఆదేశాలు జారీ చేశారు.
ట్రాన్స్‌కోకు ‘ఫోరం’ షాక్
Published Fri, Nov 7 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement
Advertisement