మేత కోసం వస్తే.. కాటేసిన తీగలు | cattle group die on current shock | Sakshi
Sakshi News home page

మేత కోసం వస్తే.. కాటేసిన తీగలు

Published Tue, May 10 2016 2:18 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM

మేత కోసం వస్తే.. కాటేసిన తీగలు - Sakshi

మేత కోసం వస్తే.. కాటేసిన తీగలు

29 ఆవులు మృత్యువాత వైర్లు తెగిపడటంతో విద్యుదాఘాతం
కరువు వేళ బతికించుకుందామని వస్తే.. బలైన వైనం
అంతర్‌గాం, ఇబ్రహీంపూర్‌లో ఘటనలు పిడుగుపాటుకు
మరో రెండు ఎడ్లు మృతి దుఃఖసాగరంలో బాధిత రైతులు
ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు పరిహారమిస్తామన్న ట్రాన్స్‌కో ఎస్‌ఈ

ఘోరం జరిగిపోయింది... పూడ్చలేని నష్టం ఏర్పడింది... యమపాశాలుగా మారిన విద్యుత్ తీగలకు అభం శుభం తెలియని 29మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. అస్తవ్యస్త తీగలు తెగిపడుతున్నాయి. ఫలితంగా విలువైన పశుసంపదకు తీవ్రనష్టం చేకూరుతుంది. తాజాగా జిల్లాలో రెండు చోట్ల విద్యుత్ తీగలు తెగి పడడంతో 29 ఆవులు, పిడుగు పడడంతో మరోచోట రెండు పశువులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలతో రైతాంగం దుఃఖసాగరంలో మునిగింది. కరువుతో పశువులను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతుంటే విద్యుత్ తీగలు వాటిని వెంటాడుతున్నాయి.

కల్హేర్/న్యాల్‌కల్: కరెంటు కాటుకు వేర్వేరు చోట్ల 29 మూగజీవాలు నేలకొరిగాయి. పిడుగుపాటుకు ఇంకోచోట రెండు పశువులు ప్రాణా లు విడిచాయి. అకాల వర్షాల కారణంగా వీచిన ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడడంతో పాడి పశువులు మృత్యువాత పడ్డాయి. రెండేళ్లుగా కరువు కాటకాలతో అష్టకష్టా లు పడుతున్న రైతన్నను తాజా ఘటనలు కోలుకోలేని దెబ్బతీశాయి. గ్రాసం, నీటికోసం కల్హేర్ మండలం అంతర్ గాంకు వలస వచ్చిన పశువులను విద్యుత్ వైరు రూపంలో మృత్యువు కబళించింది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న పశువుల మందపై 11కేవీ విద్యుత్ వైరు తెగిపడడంతో 23 మూగజీవాలు అక్కడికక్కడే ప్రాణాలు వది లాయి.

కంగ్టి మండలానికి చెందిన ధూంసింగ్, గోవిం ద్, రమేష్ అనే రైతులు తమ కుటుంబాలతో కలిసి దాదాపు 300 పశువులను తీసుకుని వలస వచ్చారు. పగలంతా పశువులను మేపి రాత్రి పూట ఓ పొలం వద్ద పశువులను కట్టి ఉంచగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా సోమవారం మధ్యాహ్నం న్యాల్‌కల్ మండలం ఇబ్రహీంపూర్‌లోనూ విద్యుత్ వైరు తెగిపడడంతో ఆరు ఆవులు మరణించాయి. ఇక్కడా 11కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో తీగ లు తెగి పశువులపై పడడంతో విద్యుదాఘాతం తో కన్నుమూశాయి.

హత్నూర మండలం చింతల్‌చెరువు శివారులో ఆదివారం రాత్రి పిడుగుపడడంతో రెండు ఎడ్లు మరణించాయి. ఇలా పెద్ద సంఖ్యలో పశువులు మృతి చెందడం తో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈనెల ఒకటిన పెళ్లిబృందం లారీని విద్యుత్ తీగలు తగల డంతో విద్యుదాఘాతానికి గురై ఏడుగురు మరణించిన విషయం తెల్సిందే. ఈ ఘటనను మరచిపోకముందే 31 పశువులు మృత్యువాత పడడం అందరిని కలిచివేసింది.

 బోరున విలపించిన రైతులు...
పశువులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడడం తో కల్హేర్ మండలం అంతర్‌గాం, న్యాల్‌కల్ మండలం ఇబ్రహీంపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కంగ్టి మండలానికి చెందిన ధూంసింగ్, గోవింద్, రమేష్, ఇబ్రహీంపూర్‌కు చెందిన రైతులు నాగమ్మ, దేవేందర్, మానిక్, పి.దేవేందర్ కన్నీరుమున్నీరయ్యారు. ఓవైపు కరువు కాటేస్తే మరోవైపు పశువులను పోగొట్టుకున్నామంటూ తల్లడిల్లిపోయారు.

 అంతర్‌గాంలోనే ఖననం...
మరణించిన పశువులకు అంతర్‌గాంలోనే వెట ర్నరీ వైద్యులు సయ్యద్ ముస్తాక్, నేతాజీ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అక్కడే జేసీబీతో పెద్ద గోతి తవ్వి వాటిని ఒకేచోట ఖననం చేశారు. ఖననం సందర్భంగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతులే కాకుండా స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోరున విలపించారు.

 బతికించుకుందామని వస్తే...
కరువు కారణంగా పశువులను బతికించుకునేందుకు కల్హేర్ వైపు వస్తే ఇలా జరిగిందంటూ కంగ్టి మండలం ముకుంద్‌నాయక్ తండాకు చెందిన ధూంసింగ్, సాధు తండాకు చెందిన గోవింద్, గాజుల్‌పాడుకు చెందిన రమేష్ కుటుంబీకులు వాపోయారు. నీటి జాడలున్నాయని పశువులను తీసుకుని వారం రోజుల క్రితం ఇటువైపు వస్తే ఈ దుర్ఘటన జరిగిందంటూ బోరుమన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు.

 గిరిజనులకు తప్పిన ప్రమాదం
అంతర్గాం ఘటనలో గిరిజన రైతులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. రైతులు ధూంసింగ్, గోవింద్ కుటుంబీకులు రామారావు, అశోక్, సుభాష్, కాలు, రమేష్, శివ, రాహుల్ తమ పశువుల మంద పక్కనే నిద్రించారు. వైరు తెగి పశువుల మీద పడిన సమయంలో వీరంతా పక్కనే నిద్రలో ఉన్నారు. పశువుల అరుపులకు వీరు లేచేసరికి ఘోరం జరిగిపోయింది. మరణించిన పశువుల విలువ దాదాపు రూ.10 లక్షలకుపైగా ఉంటుందని అంచన.

ట్రాన్స్‌కో అధికారుల నిలదీత
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే 23 పశువులు మృతి చెందాయని అంతర్‌గాం వాసులు ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ సదాశివరెడ్డి ఘటనా స్థలాన్ని  సందర్శించారు. ఒక్కో పశువుకు రూ.40వేల చొప్పు న వారం రోజుల్లో పరిహారాన్ని అందజేస్తామని ఎస్‌ఈ ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పశుసంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, ఖేడ్ సీఐ సైదానాయక్, ఆర్‌ఐ ఎండీ ఖాలీద్, వీఆర్‌ఓ సాయిలు, నాయకులు కృష్ణమూర్తి, రాంసింగ్, గుండు మోహన్, మహిపాల్‌రెడ్డి తదితరులు సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు.

 పరిహారమిస్తామన్న తహసీల్దార్...
న్యాల్‌కల్ మండలం ఇబ్రహీంపూర్ ఘటనలో బాధిత రైతులకు పరిహారమిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్‌సింగ్, హద్నూర్ ఎస్‌ఐ సుభాష్, పశువైద్యాధికారి అజింక్య, ట్రాన్స్‌కో ఏఈ రవీందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో ఆవుకు రూ.40 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షల మేర పరిహారం వచ్చేలా కలెక్టర్‌కు నివేదిక పంపుతామని తహసీల్దార్ బాధిత రైతులకు హామీ ఇచ్చారు.

 విద్యుత్ అధికారులపై కేసు
కల్హేర్: అంతర్‌గాం ఘటన నేపథ్యంలో ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు చేశామని సిర్గాపూర్ ఎస్‌హెచ్‌ఓ రవీందర్ సోమవారం తెలిపారు. నారాయణఖేడ్ సీఐ సైదానాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ వైరు తెగిపడడంతో 22 ఆవులు, ఓ గేదె మరణించిందని ఎస్‌హెచ్‌ఓ రవీందర్ వెల్లడించారు. ట్రాన్స్‌కో అధికారులను బాధ్యులు చేస్తూ కేసు నమోదు చేశామన్నారు. ట్రాన్స్‌కో అధికారులు, లైన్‌మన్‌పై విచారణ జరుపుతామన్నారు.

పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి
హత్నూర: చింతల్‌చెరువు శివారులో ఆదివా రం రాత్రి పిడుగుపాటుకు రెండు ఎడ్లు మృతి చెందాయి. ఫత్త్తే హైమద్ అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు గ్రామ శివారులోని పొలం వద్ద ఆదివారం రాత్రి కట్టేశాడు. ఉరుములతో కూ డిన వర్షంతోపాటు పిడుగుపడడంతో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతుతు పరిస్థితిని చూసి బోరున విలపిం చారు. లక్ష రూపాయల విలువల గల రెండు ఎడ్లు మృతిచెందడంతో తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.

మేపడానికి తోలుకొస్తే..
తీవ్ర కరువుతో కంగ్టి మండలంలో గ్రాసం, నీరు దొరుకుతలేదు. పశువుల తిప్పలు చూడలేక నీళ్లు, గ్రాసం కోసం కల్హేర్ మండలం అంతర్గాం వైపు వచ్చాం. గ్రాసం ఎక్కడ దొరికితే అక్కడికి పశువుల మందతో వలస పోతుంటాం. కరెంట్ షాక్ తగిలి 23 పశువులు చనిపోయినయి. పశువులు లేకపోతే మేం రోడ్డున పడినట్టే.  - ధూంసింగ్, బాధిత రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement