సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారుల నడ్డి విరిచేలా చార్జీల పెంపునకు ప్రభుత్వం సిద్ధమైంది. బిల్లుల మోత మోగించనుంది. ఇన్నాళ్లూ అంతంతమాత్రంగా విద్యుత్‌ను వినియోగించే పేదలకు మినహాయింపునిచ్చిన ప్రభుత్వం ఈసారి వారినీ విడిచిపెట్టట్లేదు. పెంచిన చార్జీల ప్రతిపాదనల్ని బుధవారం విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఖరారు చేయాల్సి ఉందని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) అధికారులు చెప్తున్నారు. తాజా ప్రతిపాదనలతో జిల్లాపై ఏకంగా నెలకు రూ.25 కోట్ల మేర భారం పడనున్నట్టు సమాచారం.
రూ.25 కోట్లు భారం?
జిల్లాలో సుమారు 12.55 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో 10 లక్షల 84 వేల 932 గృహ వినియోగదారులు, లక్షా 21 వేల 449 వాణిజ్యం, 5,041 పరిశ్రమలు, 974 హెచ్‌టీ, 376 కుటీర పరిశ్రమలు, 23,439 వ్యవసాయ, 10,549 వీధిలైట్లు, 2,068 ప్రజా నీటి సరఫరా పథకాలు, 6,603 సాధారణ(దేవాలయాలు, ప్రార్థనా
మందిరాలు, పాఠశాలలు తదితర) వినియోగ కనెక్షన్లున్నాయి. వీటిద్వారా ప్రస్తుతం సగటున నెలకు రూ.250 కోట్లు వరకు విద్యుత్ బిల్లుల డిమాండ్ ఉంది. తాజా పెంపుతో జిల్లాపై సుమారు 25 కోట్లు వరకు భారం పడనున్నట్టు అంచనా. ఈ భారం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జనాలపై పడనుంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీలతో బెంబేలెత్తుతున్న ప్రజలు, మరింత భారం మోసేందుకు సిద్ధంకాక తప్పనిపరిస్థితి.
కేటగిరీల వారీ భారం
జిల్లాలోని ఎల్‌టీ కేటగిరీ వినియోగదారుల నుంచి సగటున సుమారు రూ.70 కోట్లు విద్యుత్ చార్జీలు వసూలవుతున్నాయి. ఈ డిమాండ్ రూ.83 కోట్లు వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఇందులో గృహ వినియోగం రూ.40 కోట్లు నుంచి రూ.47 కోట్లు, వాణిజ్య కేటగిరీలో రూ.20.5 కోట్లు నుంచి రూ.24.5 కోట్లు, పరిశ్రమలు, ఇతర కేటగిరీలో రూ.కోటి వరకు పెరగొచ్చు. హెచ్‌టీ కేటగిరీలో నెలకు సగటున రూ.180 కోట్లు వరకు విద్యుత్ బిల్లుల డిమాండ్ ఉంది. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ఈ కేటగిరీలో మరో రూ.12 కోట్లు పెరిగి డిమాండ్ రూ.192 కోట్లుకు చేరుకుంటుందని అంచనా. వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో.. దానిపై ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశాల్లేవు. ఇప్పటి వరకు లోయర్ కేటగిరీ గృహ వినియోగదారులపై పెద్దగా భారం మోపలేదు. ప్రస్తుత ప్రతిపాదనలు యూనిట్‌కు 55 పైసలు అమలు చేస్తే గృహ వినియోగ కేటగిరీలో భారం వీరిపైనే అధికంగా ఉండే అవకాశాలుంటాయని అధికారులు చెప్తున్నారు.