సిద్దిపేట రూరల్: విద్యుత్ వృథాను అరికట్టేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతోంది పొన్నాల గ్రామ పంచాయతీ. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల చొరవతో వీధి దీపాలకు ఆటోమేటిక్ సిస్టం ఏర్పాటు చేసి కరెంటును ఆదా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ కొరత ఉంది.. విద్యుత్ వృథా చేయకండి.. మరో మూడేళ్ల వరకు కరెంటు కష్టాలు తప్పవని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు నిత్యం ఏదో ఒక చోట ప్రకటనలు చేస్తున్నారు.
దీంతో గృహావసరాల్లో విద్యుత్ వృథా తగ్గినా పంచాయతీల్లోని వీధి దీపాలు మాత్రం ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. మండలంలోని ఏ గ్రామంలో చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. రాత్రంతా వెలిగిన లైట్లను బంద్ చే యాల్సి ఉన్నా పలు చోట్ల సిబ్బంది నిర్లక్ష్యం అది సాధ్యపడటం లేదు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని కంకణం కట్టుకుంది పొన్నాల గ్రామపంచాయతీ.
ఈ సమయంలో గ్రామ సర్పంచ్ మదిలో ఓ ఆలోచన మెరిసింది. తెల్లారగానే వీధి దీపాలు వాటంతట అవే ఆరిపోయేలా ఏదైనా ఏర్పాటు చేయాలనుకుంది. పొన్నాలతో పాటు మదిర గ్రామాలైన బట్రామ్‌పల్లి, కిష్టాసాగర్, గాంధీనగర్‌లలో కలిపి పంచాయతీ పరిధిలో 150 వీధి దీపాలు వెలుగుతాయి. వీటిలో పది నుంచి పన్నెండు వీధి దీపాలకు ఒక టైమర్ మిషన్‌తో అనుసంధానం చేశారు. రాత్రి 6నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా అందుతుంది.
ఉదయం 6 దాటగానే కంప్యూటర్‌తో అనుసంధానం చేసిన టైమర్ మిషన్ ద్వారా వీధి దీపాలు ఆటోమేటిక్‌గా ఆరిపోతాయి. వీధి దీపాల నియంత్రణ పూర్తిగా కంప్యూటర్ ద్వారా ఏర్పాటు చేయడం వల్ల కరెంటు వృథా తప్పిందని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు చెబుతున్నారు. అన్ని పంచాయతీల వారు ఇదే పద్ధతిని అవలంబిస్తే విద్యుత్ వృథాను అరికట్టవచ్చని సూచిస్తున్నారు.
విద్యుత్ ఆదా చేయడమే లక్ష్యం
పెరుగుతున్న విద్యుత్ బిల్లులను నియంత్రించడంతో పాటు విద్యుత్ వృథాను అరికట్టడానికి ఈ ప్రయోగాన్ని ప్రారంభించాం. గతంలో గ్రామ పంచాయతీ విద్యుత్ సిబ్బంది వీధి దీపాలను సంపూర్ణంగా నియంత్రించలేక పోయారు. దీని వల్ల అప్పుడప్పుడు పగటి పూట కూడా వీధి దీపాలు వెలిగిన సందర్భాలు ఉన్నాయి. - తుపాలకుల ఎల్లమ్మబాల్‌రంగం, సర్పంచ్
ఐడియా.. అదిరిందయా!
Published Wed, Nov 5 2014 12:58 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement