జహీరాబాద్/జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్: ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మంగళవారం మధ్యాహ్నం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు కూలి పనులకు వెళ్లిన మావూరి అడివన్న(36) తెగిపడిన విద్యుత్ తీగకు తగులుకుని అక్కడికక్కడే దుర్మరణం చెండాడు. ఈ సంఘటన మండలంలోని రంజోల్ గ్రామ పరిధిలోని బాబానగర్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐ నాగయ్య, గ్రామ ప్రజలు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని రంజోల్ గ్రామానికి చెందిన అడివన్న వ్యవసాయ కూలి. పంటలకు పురుగుల మందును పిచికారీ చేసే పనులకు ఎక్కువగా వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే మంగళవారం గ్రామంలోని విఠల్ అనే కౌలురైతు పొలంలో కందిపంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు.
పంటకు మందును పిచికారీ చేస్తున్న క్రమంలో అడివన్న నేలపై పడిఉన్న విద్యుత్ తీగలను గమనించక వాటికి తాకాడు. వెంటనే విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. ఇది గమనించిన కౌలురైతు విఠల్ వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. సంఘటనా స్థలాన్ని ట్రాన్స్‌కో డీఈ అబ్దుల్ కరీం, ఏఈ శ్రీనివాస్, రూరల్ ఎస్‌ఐ నాగయ్యలు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుని బంధువులు, రైతు సంఘం నాయకుడు ఎంజి రాములుయాదవ్ ట్రాన్స్‌కో అధికారులను నిలదీశారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని భార్య అమృతమ్మ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం మూలంగానే అడివన్న మరణించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాన్స్‌కో అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగయ్య పేర్కొన్నారు. డీఈ అబ్దుల్ కరీం, ఏడీఈ తులసీరాం, ఏఈ శ్రీనివాస్, లైన్‌మెన్ మోహన్‌లపై 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
తీగలు తెగిపడి రెండేళ్లయినా సరిచేయలేదు
వ్యవసాయ పొలానికి వెళ్లే విద్యుత్ తీగ రెండు సంవత్సరాల క్రితమే తెగిపోయి నేలపై పడిందని కౌలు రైతు విఠల్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు. మౌలానే అనే రైతుకు చెందిన వ్యవసాయ బావికి కోసం ఈ విద్యుత్ తీగలు అమర్చారని, అయితే ఆ బావి గత రెండు సంవత్సరాల కాలంగా నిరుపయోగంగా మారడంతో విద్యుత్ సరఫరా అవసరం లేకపోయిందన్నారు. అందువల్లే ఇన్నిరోజులైనా కిందపడిపోయిన విద్యుత్ తీగలను సరిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ట్రాన్స్‌కో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణం పోయిందని కౌలు రైతు విఠల్ ఆరోపించారు.
మాకెవరూ చెప్పలేదు
విద్యుత్ తీగ తెగిపడిన విషయమై ఎవరు తమకు ఫిర్యాదు చేయలేదని ఏడీఈ తులసీరాం పేర్కొన్నారు. ఎక్కడైనా తీగలు తెగిపడినట్లు ఫిర్యాదు వస్తే వెంటనే సరిచేయించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదు అంది ఉంటే వెంటనే సరిచేయించే వారమన్నారు. తీగలు తెగిపడిన విషయమై ఫిర్యాదు వస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
విద్యుత్‌షాక్‌కు గురై మరణించిన అడివన్న కుటుంబాన్ని తమ శాఖ తరఫున ఆదుకుంటామని ట్రాన్స్‌కో డీఈ కరీం పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులకు ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. రూ. లక్ష పరిహారాన్ని అందిస్తామని, కుటుంబంలో ఒకరికి గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం ఇస్తామని తెలిపారు.
కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయి
మృతుడు అడివన్నకు భార్య అమృతమ్మ, కుమార్తెలు మమత, విజయలక్ష్మి, కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్‌లు ఉన్నారు. పెద్ద కుమార్తె మమత వివాహం కాగా, మిగతా వారు చదువుకుంటున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన వారు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడికి భూమి లేక పోవడంతో కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి కష్టంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యులకు ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
Published Wed, Dec 4 2013 12:42 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement