చక్కనిఆలోచన.. ప్రజలకు ఉపయోగపడే సేవలతో ఇపుడు స్టార్టప్‌లు అదరగొట్టేస్తున్నాయి. అందుకే వీటికి వినియోగదారుల ఆదరణతో పాటు ఇన్వెస్టర్ల విశ్వాసమూ పెరుగుతోంది. ఇలాంటి స్టార్టప్‌లను వెతికి... పాఠకులకు పరిచయం చేస్తోంది ‘సాక్షి స్టార్టప్స్ డైరీ’. దీనికి స్పందిస్తూ... ‘‘మేమూ స్టార్టప్స్ సేవలందిస్తున్నాం’’ అంటూ స్టార్టప్స్‌ఎట్‌దిరేట్‌సాక్షి.కామ్‌కు పెద్ద సంఖ్యలో ఈ-మెయిల్స్ వస్తున్నాయి. వాటిలో ఎంపిక చేసిన కొన్ని స్టార్టప్స్ ఈ వారం మీకోసం...
- బిజినెస్ బ్యూరో, హైదరాబాద్
ఆన్‌లైన్లో కరెంట్!
ఆన్‌లైన్లో షాపింగ్ చేయడం.. సినిమా టికెట్లు కొనడం... ఇంతేనా! అదే అన్‌లైన్లో విద్యుత్ ఉపకరణాలనూ కొనుగోలు చేసే సేవలు ఆరంభించాలనుకున్నారు ఇద్దరు మిత్రులు. రూ.3 కోట్ల పెట్టుబడులతో దేశంలో తొలిసారిగా ఎలక్ట్రికల్ వస్తువుల సమాచారం, కొనుగోళ్లు, రాయితీల కోసం ఎలక్ట్రికల్స్.కామ్ సంస్థను ప్రారంభించారు చిన్ననాటి మిత్రులైన అజయ్, విజయ్... దీన్లో స్విచ్చుల నుంచి సబ్ స్టేషన్ల వరకు ఇండస్ట్రియల్, డొమెస్టిక్ రెండు విభాగాలకు అవసరమైన దాదాపు లక్షకు పైగా విద్యుత్ ఉపకరణాలను అందుబాటులో ఉంచారు.
ప్రస్తుతం ఎలక్ట్రికల్స్.కామ్.. హావెల్స్, యాంకర్, సఫారియా, రాకో, సూర్య, స్నైడర్, రిచెమ్ వంటి సుమారు 256 జాతీయ, అంతర్జాతీయ ఎంఎన్‌సీ కంపెనీలకు చానల్ పార్టనర్‌గా కొనసాగుతోంది. అల్ట్రాటెక్, బీహెచ్‌ఈఎల్, హానెస్టీ ట్రేడర్, ఐటీడీ, అక్యురేట్ ఇంజనీర్స్, భారత్ పెట్రోలియం, గోద్రెజ్, షాపూర్‌జీ పల్లోంజీ వంటి సుమారు 40 వరకు కంపెనీలు దీనికి కస్టమర్లు. అయితే ఈ విద్యుత్ ఉపకరణాలు బయటి మార్కెట్లోనూ దొరుకుతాయి కదా... అలాంటప్పుడు ఎలక్ట్రికల్స్.కామ్‌తో ఉపయోగమేంటనే సందేహం రావచ్చు.
కానీ పారిశ్రామిక రంగాలు పెద్ద మొత్తంలో విద్యుత్ ఉపకరణాలను కొనుగోలు చేయాలంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరో, డీలర్ల దగ్గరో కొనాలి. దీనికి సమయం, డబ్బు రెండూ ఎక్కువే. ఎలక్ట్రికల్స్.కామ్‌తో అయితే ఒక్క రోజులోనే వస్తువులను కొనడంతో పాటు మార్కెట్ రేటు కంటే 20-30% తక్కువకే పొందవచ్చు. ‘వస్తువుల డెలివరీ కోసం ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాం. రూ.500 కంటే ఎక్కువ.. 500 కిలోల బరువుండే వస్తువుల వరకు డెలివరీ చార్జీలను కంపెనీనే భరిస్తుంది. పెట్టుబడులొస్తున్నాయి కానీ ఈక్విటీ రూపంలో వస్తేనే తీసుకుంటాం’ అని వ్యవస్థాపకులు చెప్పారు.
ఇంట్లో ల్యాప్‌టాప్ మర్చిపోయారా?
పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఆర్డరిస్తే ఇంటికి తెచ్చే సంస్థలున్నాయని మనకు తెలుసు. కానీ, ఇంట్లో మర్చిపోయిన ల్యాప్‌ట్యాప్‌ను, ఆఫీసు ఫైళ్లనూ చెప్పిన చోటుకు తీసుకొచ్చే సంస్థ ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. రూ.20 లక్షల పెట్టుబడితో వీడెలివరీ.ఇన్ పేరుతో శ్రీనివాస్, కృష్ణ చైతన్య రెడ్డి కల సి ఇలాంటి సేవలనే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సేవలు హైదరాబాద్, చెన్నై నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే విశాఖపట్నంలో కూడా ప్రారంభించనున్నారు.
ఎన్నారైలు తమ కుటుంబ సభ్యులకు మందులు, బహుమతులు వంటివి పంపించేందుకు వీడెలివరీని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇందులో వాటిని ఎక్కడ కొనాలో.. ఎక్కడ డెలివరీ చేయాలో కూడా కస్టమరే చెబుతారు. కంపెనీ కేవలం మధ్యవర్తి మాత్రమే. ప్రస్తుతం రోజుకు 60-80 వరకు ఆర్డర్లొస్తున్నాయి. మొదటి 5 కి.మీ.లకు రూ.75.. ఆ తర్వాత ప్రతి కి.మీ.కు రూ.10 చొప్పున చార్జీ ఉంటుంది.
‘‘ఫ్లిప్‌కార్ట్ సంస్థ రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. కానీ, రూ.6 కోట్ల నిధుల కోసం చూస్తున్నాం. వెంచర్స్ కేపలిస్ట్‌లతో మాట్లాడుతున్నాం. త్వరలోనే నిధులు సమీకరించి కంపెనీ సేవలను మరింత విస్తరిస్తాం’’ అని వివరించారు శ్రీనివాస్.
దహన సంస్కారాలకూ వెబ్‌సైట్..
షాపింగ్‌కో.. సినిమాలకో కాదు దహన సంస్కారాలకూ ఆన్‌లైన్ సేవలున్నాయండోయ్. అది కూడా హైదరాబాద్‌లో. రూ.50 వేల పెట్టుబడితో నగరంలో ఠీఠీఠీ.్చట్టఛ్చీడట్ఛటఠిజీఠ్ఛిట.ఛిౌఝ ను ప్రారంభించాడు ఖమ్మంకు చెందిన సుధాకర్. చనిపోయిన వ్యక్తి కుటుంబంలో అందరూ బాధల్లో ఉంటారు. ఇలాంటి సమయంలో దహన సంస్కారాలకు కావాల్సినవి(శవ పేటిక, డప్పుళ్లు, వాహనం, ఫ్రీజర్ బాక్స్, పూజ సామగ్రి.. వంటివి) ఎక్కడ దొరుకుతాయో తెలియవు.
ఒకవేళ తెలిసినా అవసరం మనది కాబట్టి ఎంత అడిగినా ఇవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి చిక్కుల్లేకుండా అన్ని మతాలకు చెందిన దహన కార్యక్రమాలకు సంబంధించిన సామగ్రిని ఉచితంగానే ఆర్డర్ చేయవచ్చిక్కడ. ఇందుకోసం నగరంలోని సుమారు 20 మంది సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ. కంపెనీకి ఫోన్ చేసిన గంటలోపు ఆర్డరిచ్చిన వస్తువులను ఇంటికి తెచ్చిస్తారు. ఇతర మెట్రో నగరాలకు ఈ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని, నిధుల సమీకరణకు హైదరాబాద్ ఏంజిల్స్‌తో చర్చించామని, త్వరలోనే కొత్త మొత్తాన్ని సేకరించి సంస్థ సేవలను ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకూ విస్తరిస్తామని చెప్పారు సుధాకర్.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...
ఉద్యోగాలడగం.. ఇస్తాం!
Published Sat, Apr 25 2015 8:43 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement