సాక్షి, గుంటూరు: తెనాలికి చెందిన మోహనరావు 150 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తున్నాడు. నెలవారీకరెంటు బిల్లు రూ.382.50 వస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సర్కారు పెంచుతున్న కరెంటు చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకు రూ.611.50 బిల్లు చెల్లించాలి. పొరపాటున ఒక్క యూనిట్ అదనంగా వాడుకున్నాడనుకుందాం అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ.927 రానుంది. ఒక్క యూనిట్ పెరిగినందున అదనంగా రూ.316 బిల్లు వస్తుందన్న మాట. మోహనరావుకు ఇప్పుడొస్తున్న బిల్లుకు మూడు రెట్లు పెరగనుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధికి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి ముక్కు పిండి వసూలు చేయనున్నారు.
ప్రస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ.1.45, 2.60, 3.60 వంతున లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్ ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ.3.10, 3.75, రూ.5.38 వంతున పెంచనున్నారు. 150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ.6.32 వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తారు. వినియోగదారుడి కళ్లు బైర్లు కమ్మేలా వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లు వసూలు చేయనున్నారు. ఈమేరకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలనకు అనుమతి వస్తే వినియోగదారుల గుండె గు‘బిల్లు’ మనాల్సిందే.
సేవలు హీనం... బాదుడు ఘనం..
వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని చెబుతున్న డిస్కంలు ఆ దిశగా కనీస ప్రయత్నాలు చేయడం లేదు. నాలుగేళ్ల నుంచి ఏ యేటికాయేడు విద్యుత్ చార్జీల బాదుడు మాత్రం ఘనంగా ఉంది. గృహ వినియోగదారులకు వంద యూనిట్లకు ఉన్న శ్లాబును 50 యూనిట్లకు కుదించి మరీ బిల్లు మోత మోగించనున్నారు. ఈఆర్‌సీ నిర్వహించే బహిరంగ విచారణలో వినియోగదారులు, రాజకీయపార్టీలు ఆందోళనలు ఉధృతం చేస్తే తప్ప ఈ బాదుడు నుంచి ఉపశమనం కలగదు.
బాదుడు అమలైతే..
ఏడాదికి రూ.360 కోట్లు భారంఈ బాదుడు అమలైతే ఎస్పీడీసీఎల్ పరిధిలోని గుంటూరు సర్కిల్‌లో ఏటా వినియోగదారులపై రూ.360 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం గుంటూరు సర్కిల్ నుంచి విద్యుత్ బిల్లుల డిమాండ్ ఏటా రూ.1,980 కోట్లు వరకు ఉంది. చార్జీల పెంపుతో ఈ డిమాండ్ రూ.2,340 కోట్లు కానుంది.
కరెంటు పిడుగు
Published Mon, Dec 16 2013 1:42 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement
Advertisement