కాటేసిన విద్యుత్ తీగలు
అంతవరకు తోటి పిల్లలతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ సరదాగా గడిపిన ఆ బాలుడ్ని మృత్యువు విద్యుత్ తీగల రూపంలో కాటేసింది. అవి తగిలీ తగలడమే పెద్దశబ్దంతో క్షణాల్లో మంటు వ్యాపించాయి. ఆ మంటలో చిక్కుకున్న బాలుడ్ని అతికష్టమ్మీద స్థానికులు బయటకు తెచ్చినా సకాలంలో ఆస్పత్రికి తరలించేందుకు వాహన సౌకర్యం లేకపోవడంతో సుమారు గంటన్నర పాటు మృత్యువుతో పారాడి చివరకు ప్రాణాలు విడిచాడు. చీడికాడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల అగ్రహారంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చీడి కాడ: అడవుల అగ్రహారానికి చెందిన దాలిబోయిన రవితేజ (11) గ్రామంలోని యూపీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. నిరుపేదలైన రవితేజ తల్లిదండ్రులు చిలుకు, నాగేశ్వరిలు ఉపాధి కోసం మద్రాస్‌కు వలసవెళ్లారు. దీంతో రవితేజ వృద్ధురాలైన నాయనమ్మ సన్నెమ్మ వద్ద గ్రామంలోనే ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన రవితేజ ఐదు గంటల సమయంలో తోటి పిల్లలతో రామాలయం ఎదుట షటిల్ ఆడుతున్నాడు.
షటిల్ కాక్ పక్కనే ఉన్న కమ్యూనిటీ భవనం శ్లాబ్‌పై పడింది. అదే శ్లాబ్‌ను అనుకుని ఎల్‌టీ లైన్ విద్యుత్ తీగలున్నాయి. కాక్ తెచ్చేందుకు శ్లాబ్ ఎక్కిన రవితేజ వాటిని తాకడంతో ఒక్కసారిగా మంటల చేలరేగాయి. హాహాకారాలు చేస్తున్న అతడిని చూసి వైఎస్సార్ సీపీ నాయకుడు గంటా మత్స్యరాజు పరుగున ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
అనంతరం మంటల్లో చిక్కుకున్న రవితేజను కిందికి దించారు. అప్పటికే ఆ బాలుడి పొత్తికడుపు కాలిపోయి పేగులు మొత్తం బయటకొచ్చాయి. కుడి కాలు ముడుకు నుంచి దిగువకు చర్మం మొత్తం కాలి ఎముకలు మిగిలాయి. మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేయగా ఏ వాహనమూ అందుబాటులో లేదని సమాధానం చెప్పారని సర్పంచ్ నానాజీ తెలిపారు.
ప్రవేటు వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా రవితేజ పరిస్థితిని చూసి వాహన యజమానులెవరూ ముందుకు రాలేదు. దీంతో సాయంత్రం 5.30 నుంచి 7గంటల వరకు రవితేజ తనను ఆస్పత్రికి తీసుకువెళ్లండంటూ రోదించి.. రోదించి చివరకు కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తన కళ్లల్లో పెట్టుకుని చూసిన మనుమడు మృతి చెందాడాన్ని జీర్ణించుకోలేని నాయనమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.