Shuttle Badminton
-
హైదరాబాద్: షటిల్ ఆడుతూ కుప్పకూలి మృతి
హైదరాబాద్: వయసు తేడాలు లేకుండా.. హఠానర్మణాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మరణాలు ప్రజల్లో భయాందోళన కల్గిస్తున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వాళ్లు.. కార్డియాక్ అరెస్ట్ లేదంటే గుండెపోటుతోనో కుప్పకూలి కన్నుమూస్తున్నారు. తాజాగా.. నగరంలోనూ అలాంటి మరణం ఒకటి సంభవించింది. షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు ఓ వ్యక్తి. బుధవారం ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతూ కృష్ణారెడ్డి (46)గా గుండెపోటుతో కుప్పకూలాడు. స్నేహితులు, స్థానికులు ఆయన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్దారించారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: పిల్లలు లేరనే ఆవేదనతో.. -
రోడ్డుపై షటిల్ ఆడిన వెంకీ
-
రోడ్డుపై షటిల్ ఆడిన విక్టరీ వెంకటేశ్
మొన్న క్రికెట్ దేవుడు సచిన్ రోడ్డు పైకి వచ్చి క్రికెట్ ఆడారు. స్టేడియంలో ఆడటం వేరు. బయట రోడ్డుపైకి వచ్చి పిల్లలతో ఆడటం వేరు. స్వయంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆడటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. విక్టరీ వెంకటేశ్ కూడా అదేవిధంగా పిల్లలతో షటిల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సరదాగా కాసేపు పిల్లలతో ఆడిన వెంకటేశ్ ఆటను చూసి ముచ్చట పడ్డారు అక్కడి వారు. వెంటనే వెంకీ ఆటను కెమెరాలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియలేదు. గతేడాది ‘గురు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో వెంకీ నటనకు ప్రశంసలు దక్కాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వెంకీ, వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ తేజతో కూడా వెంకటేశ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. -
రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్‌లో..
చీరాల విద్యార్థుల ప్రతిభ చీరాల రూరల్: రాష్ట్ర స్థాయి జూనియర్ షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీల విభాగంలో చీరాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి మెమెుంటోలు, షీల్డులు అందుకున్నారు. రాష్ట్ర స్థాయి షటిల్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించారు. పోటీల్లో చీరాలకు చెందిన షేక్ న్యుమెర్, నితీష్ భట్లు అండర్–13 డబుల్స్ విభాగంలో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ పున్నయ్య చౌదరి షీల్డులు అందజేశారు. -
షటిల్ బ్యాడ్మింటన్ విజేతలు వీరే..
ముగిసిన ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు రసవత్తరంగా సాగిన ఫైనల్స్ తెనాలి: బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2016 పోటీలు ముగిశాయి. అండర్–13, అండర్–15 కేటగిరీల్లో బాలబాలికలకు ఇక్కడి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలు శుక్రవారం సాయంత్రం జరిగిన రసవత్తరంగా సాగాయి. అండర్–15 ఫైనల్స్ పోటీల్లో బాలుర డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన సాయిచరణ్ కోయ–చరణ్‌నాయక్ జట్టు విన్నర్స్‌గా నిలిచింది. వీరు కర్నూలు క్రీడాకారులు సాయినాథ్‌రెడ్డి–అర్షద్‌పై 21–11, 21–15 స్కోరుతో విజయం సాధించారు. ఇదే కేటగిరీ బాలికల విభాగంలో మేఘ (కర్నూలు)–వెన్నెల (కడప) 21–14, 21–18 స్కోరుతో పశ్చిమ గోదావరి జిల్లా ఎన్.జాహ్నవి–కె.మేఘనపై జట్టుపై గెలుపొందారు. సింగిల్స్ మ్యాచ్ బాలుర విభాగంలో షేక్ అర్షద్ (కర్నూలు) విన్నర్ కాగా, షేక్ ఇమ్రాన్ (అనంతపురం) రన్నర్‌గా నిలిచాడు. బాలికల విభాగంలో కర్నూలు క్రీడాకారిణి పి.మేఘ, చిత్తూరు క్రీడాకారిణి గీతాకృష్ణ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. అండర్–13 కేటగిరీలో... అండర్–13 కేటగిరీ బాలుర డబుల్స్‌లో అనంతపురం ద్వయం బీ విజయ్–పి.రాహుల్ విన్నర్స్, ఎ.నిధిభట్ (కర్నూలు)–షేక్ నుమెయిర్ (ప్రకాశం) జంట రన్నర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో విశాఖ జట్టులోని ఆయేషాసింగ్–కేపీఎస్ ప్రజ్ఞ విన్నర్స్, ఎ.నయనవి రెడ్డి (పశ్చిమగోదావరి)– కె.రిషిక (కృష్ణా) జంట రన్నర్స్ స్థానాలు సాధించారు. ఇదే కేటగిరీ బాలుర సింగిల్స్‌లో బి.విజయ్ (అనంతపురం), ఎ.వంశీకృష్ణ (పశ్చిమగోదావరి), విన్నర్, రన్నర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో విశాఖ క్రీడాకారిణి ఆయేషాసింగ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దోబచర్ల చిరుహాసిని మధ్య పోటాపోటీగా సాగిన మ్యాచ్‌లో 19–21, 21–16, 21–17 ఆయేషాసింగ్ గెలుపొందారు. సీడింగ్ అర్హత కలిగిన క్రీడాకారులే కాకుండా కొత్తగా పాల్గొన్నవారు వందకుపైగా ఉన్నారు. వీరికి సీడింగ్ అర్హత కోసం రోజున్నర పోటీలు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియం, వీఎస్సార్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో పోటీలు సాగాయి.. మొత్తం 8 ఈవెంట్లలో తణుకులోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు ఐదు ఈవెంట్లలో ఫైనల్స్‌కు చేరుకున్నట్టు అకాడమీ కోచ్ సమ్మెట సతీష్‌బాబు చెప్పారు. టోర్నమెంటు రిఫరీగా షేక్ జిలానీబాషా (కడప), డిప్యూటీ రిఫరీగా షేక్ హుమయూన్ కబీర్ (ప్రకాశం) వ్యవహరించారు. -
క్షణక్షణం.. ఉత్కంఠ
సెమీస్‌కు చేరిన బ్యాడ్మింటన్ పోటీలు తెనాలి: స్థానిక చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ –2016 పోటీ లు గురువారం రాత్రికి క్వార్టర్ ఫైనల్స్ పూర్తయ్యాయి. అండర్–13, అండర్–15 కేటగిరీల్లో బాలుర క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. విజేతలు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. అండర్–15 క్వార్టర్ ఫైనల్స్ సింగిల్స్ విజేతలు.. షేక్ ఇమ్రాన్ (అనంతపురం) 21–18, 22–20 స్కోరుతో క్రీడాకారుడు సాయిచరణ్ (గుంటూరు)పై విజయం సాధించాడు. ఆర్ సంజీవరావు (పశ్చిమగోదావరి) 21–13, 21–14 స్కోరుతో ఎం. సాయినాథ్‌రెడ్డి (కర్నూలు)పై గెలుపొందాడు. చరణ్‌నాయక్ (గుంటూరు) 21–15, 21–14తో కార్తికేయ(గుంటూరు)పై, షేక్ అర్షద్ (కర్నూలు) 21–16, 18–21, 21–9 సీహెచ్ రుషి (నెల్లూరు)పై విజయం సాధించారు. అండర్–15 క్వార్టర్ ఫైనల్స్ డబుల్స్ విజేతలు.. కోయ సాయిచరణ్–కె.చరణ్ నాయక్(గుంటూరు) 21–15, 21–7 స్కోరుతో బీ కార్తీక్, కే మినిద్జాషువా(విశాఖపట్నం)పై. కేఎన్‌వీఎస్ సూర్య (పశ్చిమ గోదావరి)–షేక్ ఇమ్రాన్ (అనంతపురం) ద్వయం 21–17, 21–11 స్కోరుతో ఏ వంశీ కష్ణరాజ్, బీ గిరీష్‌నాయుడు (తూర్పు గోదావరి) జిల్లా జట్లపై గెలుపొందాయి. అండర్–13 క్వార్టర్ ఫైనల్స్ సింగిల్స్ విజేతలు.. వంశీకృష్ణ (పశ్చిమ గోదావరి) 21–5, 21–7 షేక్ నుమెయిర్ (ప్రకాశం)పై, సాయికిరణ్ (విశాఖ) 21–17, 22–20 బాబా రాహుల్ (కర్నూలు)పై విజయం సాధించాడు. ఎన్.శివారెడ్డి (కర్నూల్) 21–18, 19–21,21–18 స్కోరుతో హిమదీప్ (ప్రకాశం)పై, విజయ్ (అనంతపురం) 21–9, 21–7 స్కోరుతో మోహిత్‌రెడ్డి (పశ్చిమ గోదావరి)పై గెలిచారు. అండర్13 క్వార్టర్ ఫైనల్స్ డబుల్స్ విజేతలు.. అండర్–13 డబుల్స్ విభాగంలో విజయ్– రాహుల్ (అనంతపురం) 21–14, 21–14 స్కోరుతో తేజ్ప్రణవ్– విష్ణువర్ధన్ (నెల్లూరు)పై గెలుపొందారు. ఏవీఎస్ హిమదీప్– ఎ.మొహిత్రెడ్డి (పశ్చిమగోదావరి) 21–17, 21–17 స్కోరుతో మహీర్ ఆలీఖాన్– ఎన్.శివారెడ్డి (కర్నూలు) విజయం సాధించారు. హర్షన్– వీఎస్ఎస్ సందేశ్ (కృష్ణా) 21–13, 21–14 స్కోరుతో కేఎల్ అభిరామ్– వై.బెన్ని రోహిత్ (విశాఖ)పై గెలిచారు. ఏ నిధి భట్ (కర్నూలు), షేక్ నుమెయిర్ (ప్రకాశం) ద్వయం 21–10, 21–17 స్కోరుతో సాయిమణికంఠ– మొహిత్ (తూర్పుగోదావరి)పై విజయం సాధించారు. -
గెలుపే లక్ష్యంగా ...
సాగిన క్వార్టర్ ఫైనల్స్ సెమీస్‌కు చేరిన రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు కొత్తపేట : రాష్ట్రస్థాయి అండర్–19 షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ –2016 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు జాతీయ పోటీలకు ఎంపిక కానుండడంతో క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా తలపడుతున్నారు. కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు తుది దశకు చేరాయి. శనివారం సెమీఫైనల్, ఫైనల్ పోటీలు జరగనున్నాయి. శుక్రవారం క్వార్టర్ ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన పలువురు సెమీస్‌కు అర్హత సాధించారు. బాలికల సింగిల్స్ విభాగంలో అక్షిత(తూర్పుగోదావరి), సబీనా బేగమ్ (కర్నూలు), ప్రీతికా(విజయనగరం), నిషితా వర్మ (విశాఖపట్నం), బాలుర విభాగంలో జశ్వంత్ (చిత్తూరు), దత్తాత్రేయ రెడ్డి(కడప), ప్రణయ్(వైజాగ్), వేదవ్యాస్ (ప్రకాశం) సెమీ ఫైనల్స్‌కు చేరారు. డబుల్స్ విభాగంలో.. బాలికల డబుల్స్ విభాగంలో అక్షిత(తూర్పుగోదావరి), ప్రీతి (విజయనగరం) జంట, నివేదిత, లక్ష్మి (విశాఖపట్నం) జంట, నవ్యసరూప, శన్విత (తూర్పు గోదావరి), అసియా, షబ్నాబేగం (కర్నూలు)జోడీ సెమీస్‌కు చేరింది. బాలుర డబుల్స్ విభాగంలో డి.నితిన్ (తూర్పు గోదావరి), డి.హరికృష్ణ (పశ్చిమ గోదావరి) జంట, బషీర్, గౌస్ (నెల్లూరు), సాయికిషోర్ (పశ్చిమ గోదావరి), సాయి కిరణ్ (విశాఖపట్నం) జంటలు సెమీస్‌కు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సత్తా.. క్వార్టర్ ఫైనల్స్‌లో పలువురు తమ ప్రతిభ చాటారు. ముఖ్యంగా బాలుర సింగిల్స్ విభాగంలో ఆర్.ప్రణవ్, పి.చంద్రపట్నాయక్ (విశాఖపట్నం)పై విజయం సాధించాడు. బాలుర డబుల్స్ విభాగంలో సాయికిషోర్ (పశ్చిమ గోదావరి), సాయి కిరణ్ (విశాఖపట్నం)జోడీ కేఆర్కే షరీఫ్, ప్రవీణ్ (విశాఖపట్నం)లు 21–16, 25–23 తేడాతో విజయం సాధించారు. ఈ రెండు మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ పోటీలు గ్రామీణ క్రీడాకారులకు స్ఫూర్తి గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్స్ ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించినట్టు ఉం టుంది. ఇక్కడికి వచ్చే స్టేట్, నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభను తిలకించి తామూ వారిలా తయారు కావాలనే కోరిక కలుగుతుం ది. అంతే కాక ఈ ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. – ఎస్ సూరిబాబు, రిఫరీ, ఏపీబీటీఓ ప్రెసిడెంట్, శ్రీకాకుళం జాతీయ స్థాయిలో టోర్నీ ఏర్పాట్లు ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా జాతీయ స్థాయిలో పోటీలకు ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు క్రీడాకారులు, కోచ్‌లను మర్యాద పూర్వకంగా చూసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి ఈ టోర్నమెంట్ వేదిక. దీనిని కొత్తపేటలో నిర్వహించడం ఈ ప్రాంతానికే గర్వకారణం. డాక్టర్ కె రమేష్, రిఫరీ, ఏపీబీటీఓ సెక్రటరీ, ప్రకాశం జిల్లా ఒలింపిక్స్ విన్నర్ కావడమే లక్ష్యం గోపీచంద్ అకాడమీలో మూడున్నరేళ్లుగా శిక్షణ పొందుతూ గత ఏడాది అండర్ 17,19 స్టేట్ విన్నర్‌గా నిలిచాను. షటిల్ బ్యాడ్మిం టన్లో ఇండియా తరఫున అంతర్జాతీయ పోటీ ల్లో పాల్గొన్న మొదటి ఉమెన్, గోపీచంద్ సతీమణి పీవీ లక్ష్మి స్ఫూర్తితో ఆడుతున్నా. ఒలింపిక్స్ విన్నర్ కావాలన్నదే నా లక్ష్యం. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఎ అక్షిత, క్రీడాకారిణి, రాజమహేంద్రవరం ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా.. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతూ రెండు సార్లు నేషనల్స్ విన్నర్‌గా నిలిచాను. షటిల్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారుడు కె శ్రీకాంత్ స్ఫూర్తితో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సా ధిస్తాననే నమ్మకంతో ఆడుతున్నా. నేషనల్ స్థాయి లో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దండు యశ్వంత్, క్రీడాకారుడు, చిత్తూరు జిల్లా -
నేటి నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
సిద్ధమైన కొత్తపేట ఇండోర్ షటిల్ స్టేడియం కొత్తపేట : రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలురు, బాలికల చాంపియన్ షిప్ 2016 పోటీలకు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి శనివారం వరకూ నాలుగు రోజుల పాటు ఈ పోటీల నిర్వహణకు కొత్తపేట కాస్మొపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్ఎస్)–జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. పోటీల వివరాలను మంగళవారం సీఆర్ఎస్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్ఎస్), జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి విలేకర్లకు వివరించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో రావులపాలెం సీఆర్సీ–కొత్తపేట సీఆర్ఎస్ సంయుక్తంగా రెండు ఇండోర్ స్టేడియంలలో జాతీయ షటిల్ పోటీలు నిర్వహిస్తామని ఆర్ఎస్ తెలిపారు. తేతలి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచి సింగిల్– 2, డబుల్ 1 చొప్పున బాలురు, బాలికలు టీమ్‌లు రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఆరు చొప్పున పాల్గొంటాయని, తొలిరోజు క్వాలిఫై టీములు ఆడతాయన్నారు. మలి రోజు నుంచి 20 మ్యాచ్‌లు, ఆఖరి రోజు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. విజేతలు త్వరలో జరిగే సౌత్ జోన్, నేషనల్స్‌కు వెళతారని తెలిపారు. -
స్వర్ణాల సెంచరీ పూర్తి
ఐదో రోజూ భారత్‌దే జోరు ఒకేరోజు 39 స్వర్ణాలుబ్యాడ్మింటన్లో రుత్విక సంచలనంఫైనల్లో సింధుపై విజయంతో స్వర్ణందక్షిణాసియా క్రీడలు గువాహటి/షిల్లాంగ్: బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్న భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో పసిడి పంటను పండిస్తున్నారు. పోటీల ఐదో రోజూ భారత్ ఏకంగా 39 స్వర్ణాలు సాధించి పతకాల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. బుధవారం జరిగిన క్రీడాంశాల్లో బ్యాడ్మింటన్, షూటింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్‌లలో భారత క్రీడాకారులు అందుబాటులో ఉన్న అన్ని స్వర్ణాలు సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్ చేశారు. ప్రస్తుతం భారత్ 117 స్వర్ణాలు, 61 రజతాలు, 16 కాంస్యాలతో 194 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబుల్స్‌లో సిక్కి, జ్వాల, సుమీత్‌లకు స్వర్ణాలు షటిల్ బ్యాడ్మింటన్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు బంగారు పతకాలు లభించాయి. స్వర్ణం నెగ్గిన ప్రతి ఈవెంట్లో తెలంగాణ క్రీడాకారులు (రుత్విక, శ్రీకాంత్, గుత్తా జ్వాల, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి) ఉండటం విశేషం. మహిళల సింగిల్స్‌లో యువతార గద్దె రుత్విక శివాని పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ 12వ ర్యాంకర్, తెలంగాణకే చెందిన పీవీ సింధుతో జరిగిన ఫైనల్లో ప్రపంచ 131వ ర్యాంకర్ రుత్విక 21-11, 22-20తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ‘మ్యాచ్ సంగతి అటుంచితే సింధుపై ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా గెలువలేదు. ఈ విజయం అనూహ్యం, అద్భుతం. నా కెరీర్లో ఇవి మధుర క్షణాలు. నమ్మశక్యంకాని విజయంతో నా కళ్లలోంచి ఆనందబాష్పాలు వస్తున్నాయి’ అని సింధును ఓడించిన తర్వాత రుత్విక వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 11-21, 21-14, 21-6తో హెచ్ఎస్ ప్రణయ్ (భారత్)పై గెలిచి స్వర్ణం సాధించాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21-9, 21-7తో సిక్కి రెడ్డి-మనీషా (భారత్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జోడీ 21-18, 21-17తో అక్షయ్ దేవాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) జంటపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట 30-29, 21-17తో మనూ అత్రి-అశ్విని పొన్నప్ప జోడీని ఓడించింది. టేబుల్ టెన్నిస్‌లోనూ భారత్‌కు ఎదురులేకుండాపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఆంథోనీ అమల్‌రాజ్, మహిళల సింగిల్స్‌లో మౌమా దాస్... మహిళల డబుల్స్‌లో మణిక బాత్రా-పూజా సహస్రబుద్ధే జోడీ... పురుషుల డబుల్స్‌లో సత్యన్-దేవేశ్ కరియా జంట విజేతలుగా నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నాయి.టెన్నిస్‌లో భారత్‌కు మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల డబుల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్-విజయ్ సుందర్ ప్రశాంత్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా (భారత్), మిక్స్డ్ డబుల్స్‌లో అంకిత రైనా-దివిజ్ శరణ్ స్వర్ణాలు సాధించారు. స్క్వాష్‌లో తొలిసారి...దక్షిణాసియా క్రీడల చరిత్రలో తొలిసారి ఏకకాలంలో భారత పురుషుల, మహిళల జట్లు స్క్వాష్ ఈవెంట్లో విజేతగా నిలిచాయి. పురుషుల టీమ్ ఫైనల్లో సౌరవ్ ఘోషాల్, రవి దీక్షిత్, కుష్ కుమార్, హరీందర్ పాల్ సంధూలతో కూడిన భారత బృందం 2-1తో పాకిస్తాన్‌ను బోల్తా కొట్టించగా... జోష్నా చినప్ప, దీపిక, సునయన, ఆకాంక్షలతో కూడిన భారత మహిళల జట్టు 2-0తో పాకిస్తాన్‌ను ఓడించింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒకేరోజు పది పసిడి పతకాలు వచ్చాయి. మహిళల లాంగ్‌జంప్‌లో మయూఖా జానీ, 400 మీటర్ల రేసులో ఎంఆర్ పూవమ్మ, 100 మీటర్ల హర్డిల్స్‌లో గాయత్రి, హైజంప్‌లో సహన కుమారి... పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, 400 మీటర్ల రేసులో అరోక్య రాజీవ్, డిస్కస్ త్రోలో అర్జున్, లాంగ్‌జంప్‌లో అంకిత్ శర్మ, 10 వేల మీటర్ల రేసులో గోపీ స్వర్ణాలు నెగ్గారు.షూటింగ్లో భారత్‌కు మూడు స్వర్ణాలు దక్కాయి. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అపూర్వీ చండీలా విజేతగా నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో, పురుషుల 50 మీటర్ల టీమ్ పిస్టల్ ఈవెంట్లోనూ భారత్‌కు పసిడి పతకాలు లభించాయి.స్విమ్మింగ్‌లో పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో వీర్‌ధవల్ ఖాడే, మహిళల 200 మీటర్ల మెడ్లేలో శ్రద్ధ సుధీర్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో జ్యోత్స్న పన్సారె విజేతలుగా నిలిచారు. 4ఁ100 మీటర్ల పురుషుల, మహిళల రిలే రేసుల్లోనూ భారత్‌కు స్వర్ణాలు లభించాయి. వుషు క్రీడాంశంలో జ్ఞాన్దశ్ సింగ్ (తైజిక్వాన్, తైజియాన్)... సంతోంబి చాను (తైజిక్వాన్, తైజియాన్) పసిడి పతకాలు సాధించారు. ఈ ఇద్దరే కాకుండా పురుషుల సాన్‌షూ ఈవెంట్లో ఉచిత్ శర్మ (52 కేజీలు), రవి పాంచాల్ (56 కేజీలు), సూర్య భానుప్రతాప్ సింగ్ (60 కేజీలు)... మహిళల సాన్‌షూ ఈవెంలో సనతోయ్ సింగ్ (52 కేజీలు), అనుపమా దేవి (60 కేజీలు), పూజా కడియాన్ (70 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. -
కాటేసిన విద్యుత్ తీగలు
అంతవరకు తోటి పిల్లలతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ సరదాగా గడిపిన ఆ బాలుడ్ని మృత్యువు విద్యుత్ తీగల రూపంలో కాటేసింది. అవి తగిలీ తగలడమే పెద్దశబ్దంతో క్షణాల్లో మంటు వ్యాపించాయి. ఆ మంటలో చిక్కుకున్న బాలుడ్ని అతికష్టమ్మీద స్థానికులు బయటకు తెచ్చినా సకాలంలో ఆస్పత్రికి తరలించేందుకు వాహన సౌకర్యం లేకపోవడంతో సుమారు గంటన్నర పాటు మృత్యువుతో పారాడి చివరకు ప్రాణాలు విడిచాడు. చీడికాడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల అగ్రహారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చీడి కాడ: అడవుల అగ్రహారానికి చెందిన దాలిబోయిన రవితేజ (11) గ్రామంలోని యూపీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. నిరుపేదలైన రవితేజ తల్లిదండ్రులు చిలుకు, నాగేశ్వరిలు ఉపాధి కోసం మద్రాస్‌కు వలసవెళ్లారు. దీంతో రవితేజ వృద్ధురాలైన నాయనమ్మ సన్నెమ్మ వద్ద గ్రామంలోనే ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన రవితేజ ఐదు గంటల సమయంలో తోటి పిల్లలతో రామాలయం ఎదుట షటిల్ ఆడుతున్నాడు. షటిల్ కాక్ పక్కనే ఉన్న కమ్యూనిటీ భవనం శ్లాబ్‌పై పడింది. అదే శ్లాబ్‌ను అనుకుని ఎల్టీ లైన్ విద్యుత్ తీగలున్నాయి. కాక్ తెచ్చేందుకు శ్లాబ్ ఎక్కిన రవితేజ వాటిని తాకడంతో ఒక్కసారిగా మంటల చేలరేగాయి. హాహాకారాలు చేస్తున్న అతడిని చూసి వైఎస్సార్ సీపీ నాయకుడు గంటా మత్స్యరాజు పరుగున ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం మంటల్లో చిక్కుకున్న రవితేజను కిందికి దించారు. అప్పటికే ఆ బాలుడి పొత్తికడుపు కాలిపోయి పేగులు మొత్తం బయటకొచ్చాయి. కుడి కాలు ముడుకు నుంచి దిగువకు చర్మం మొత్తం కాలి ఎముకలు మిగిలాయి. మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడ్ని ఆస్పత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేయగా ఏ వాహనమూ అందుబాటులో లేదని సమాధానం చెప్పారని సర్పంచ్ నానాజీ తెలిపారు. ప్రవేటు వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా రవితేజ పరిస్థితిని చూసి వాహన యజమానులెవరూ ముందుకు రాలేదు. దీంతో సాయంత్రం 5.30 నుంచి 7గంటల వరకు రవితేజ తనను ఆస్పత్రికి తీసుకువెళ్లండంటూ రోదించి.. రోదించి చివరకు కన్నుమూశాడు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తన కళ్లల్లో పెట్టుకుని చూసిన మనుమడు మృతి చెందాడాన్ని జీర్ణించుకోలేని నాయనమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.