స్వర్ణాల సెంచరీ పూర్తి | Gold medal Century over | Sakshi
Sakshi News home page

స్వర్ణాల సెంచరీ పూర్తి

Published Thu, Feb 11 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

స్వర్ణాల సెంచరీ పూర్తి

స్వర్ణాల సెంచరీ పూర్తి

ఐదో రోజూ భారత్‌దే జోరు ఒకేరోజు 39 స్వర్ణాలుబ్యాడ్మింటన్‌లో రుత్విక సంచలనంఫైనల్లో సింధుపై విజయంతో స్వర్ణందక్షిణాసియా క్రీడలు
 
గువాహటి/షిల్లాంగ్: బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్‌లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్న భారత క్రీడాకారులు దక్షిణాసియా క్రీడల్లో పసిడి పంటను పండిస్తున్నారు. పోటీల ఐదో రోజూ భారత్ ఏకంగా 39 స్వర్ణాలు సాధించి పతకాల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది. బుధవారం జరిగిన క్రీడాంశాల్లో బ్యాడ్మింటన్, షూటింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్‌లలో భారత క్రీడాకారులు అందుబాటులో ఉన్న అన్ని స్వర్ణాలు సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్ చేశారు. ప్రస్తుతం భారత్ 117 స్వర్ణాలు, 61 రజతాలు, 16 కాంస్యాలతో 194  పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

 డబుల్స్‌లో సిక్కి, జ్వాల, సుమీత్‌లకు స్వర్ణాలు
షటిల్ బ్యాడ్మింటన్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో భారత్‌కు బంగారు పతకాలు లభించాయి. స్వర్ణం నెగ్గిన ప్రతి ఈవెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు (రుత్విక, శ్రీకాంత్, గుత్తా జ్వాల, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి) ఉండటం విశేషం. మహిళల సింగిల్స్‌లో యువతార గద్దె రుత్విక శివాని పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ 12వ ర్యాంకర్, తెలంగాణకే చెందిన పీవీ సింధుతో జరిగిన ఫైనల్లో ప్రపంచ 131వ ర్యాంకర్ రుత్విక 21-11, 22-20తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ‘మ్యాచ్ సంగతి అటుంచితే సింధుపై ఇప్పటివరకు ఒక్క గేమ్ కూడా గెలువలేదు.


ఈ విజయం అనూహ్యం, అద్భుతం. నా కెరీర్‌లో ఇవి మధుర క్షణాలు. నమ్మశక్యంకాని విజయంతో నా కళ్లలోంచి ఆనందబాష్పాలు వస్తున్నాయి’ అని సింధును ఓడించిన తర్వాత రుత్విక వ్యాఖ్యానించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 11-21, 21-14, 21-6తో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్)పై గెలిచి స్వర్ణం సాధించాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21-9, 21-7తో సిక్కి రెడ్డి-మనీషా (భారత్) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జోడీ 21-18, 21-17తో అక్షయ్ దేవాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) జంటపై నెగ్గింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా (భారత్) జంట 30-29, 21-17తో మనూ అత్రి-అశ్విని పొన్నప్ప జోడీని ఓడించింది.


 టేబుల్ టెన్నిస్‌లోనూ భారత్‌కు ఎదురులేకుండాపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఆంథోనీ అమల్‌రాజ్, మహిళల సింగిల్స్‌లో మౌమా దాస్... మహిళల డబుల్స్‌లో మణిక బాత్రా-పూజా సహస్రబుద్ధే జోడీ... పురుషుల డబుల్స్‌లో సత్యన్-దేవేశ్ కరియా జంట విజేతలుగా నిలిచి పసిడి పతకాలు కైవసం చేసుకున్నాయి.టెన్నిస్‌లో భారత్‌కు మూడు బంగారు పతకాలు లభించాయి. పురుషుల డబుల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్-విజయ్ సుందర్ ప్రశాంత్, మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా (భారత్), మిక్స్‌డ్ డబుల్స్‌లో అంకిత రైనా-దివిజ్ శరణ్ స్వర్ణాలు సాధించారు.  స్క్వాష్‌లో తొలిసారి...దక్షిణాసియా క్రీడల చరిత్రలో తొలిసారి ఏకకాలంలో భారత పురుషుల, మహిళల జట్లు స్క్వాష్ ఈవెంట్‌లో విజేతగా నిలిచాయి. పురుషుల టీమ్ ఫైనల్లో సౌరవ్ ఘోషాల్, రవి దీక్షిత్, కుష్ కుమార్, హరీందర్ పాల్ సంధూలతో కూడిన భారత బృందం 2-1తో పాకిస్తాన్‌ను బోల్తా కొట్టించగా... జోష్నా చినప్ప, దీపిక, సునయన, ఆకాంక్షలతో కూడిన భారత మహిళల జట్టు 2-0తో పాకిస్తాన్‌ను ఓడించింది.


 అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒకేరోజు పది పసిడి పతకాలు వచ్చాయి. మహిళల లాంగ్‌జంప్‌లో మయూఖా జానీ, 400 మీటర్ల రేసులో ఎంఆర్ పూవమ్మ, 100 మీటర్ల హర్డిల్స్‌లో గాయత్రి, హైజంప్‌లో సహన కుమారి... పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, 400 మీటర్ల రేసులో అరోక్య రాజీవ్, డిస్కస్ త్రోలో అర్జున్, లాంగ్‌జంప్‌లో అంకిత్ శర్మ, 10 వేల మీటర్ల రేసులో గోపీ స్వర్ణాలు నెగ్గారు.షూటింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు దక్కాయి. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అపూర్వీ చండీలా విజేతగా నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో, పురుషుల 50 మీటర్ల టీమ్ పిస్టల్ ఈవెంట్‌లోనూ భారత్‌కు పసిడి పతకాలు లభించాయి.స్విమ్మింగ్‌లో పురుషుల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో వీర్‌ధవల్ ఖాడే, మహిళల 200 మీటర్ల మెడ్లేలో శ్రద్ధ సుధీర్, 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో జ్యోత్స్న పన్సారె విజేతలుగా నిలిచారు. 4ఁ100 మీటర్ల పురుషుల, మహిళల రిలే రేసుల్లోనూ భారత్‌కు స్వర్ణాలు లభించాయి.


వుషు క్రీడాంశంలో జ్ఞాన్‌దశ్ సింగ్ (తైజిక్వాన్, తైజియాన్)... సంతోంబి చాను (తైజిక్వాన్, తైజియాన్) పసిడి పతకాలు సాధించారు. ఈ ఇద్దరే కాకుండా పురుషుల సాన్‌షూ ఈవెంట్‌లో ఉచిత్ శర్మ (52 కేజీలు), రవి పాంచాల్ (56 కేజీలు), సూర్య భానుప్రతాప్ సింగ్ (60 కేజీలు)... మహిళల సాన్‌షూ ఈవెంలో సనతోయ్ సింగ్ (52 కేజీలు), అనుపమా దేవి (60 కేజీలు), పూజా కడియాన్ (70 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement