నేటి నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
-
సిద్ధమైన కొత్తపేట ఇండోర్ షటిల్ స్టేడియం
కొత్తపేట :
రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలురు, బాలికల చాంపియన్ షిప్ 2016 పోటీలకు కొత్తపేట రెడ్డి అనసూయమ్మ మెమోరియల్ ఇండోర్ షటిల్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి శనివారం వరకూ నాలుగు రోజుల పాటు ఈ పోటీల నిర్వహణకు కొత్తపేట కాస్మొపాలిటన్ రిక్రియేషన్ సొసైటీ (సీఆర్‌ఎస్)–జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియన్ సంయుక్తంగా ఏర్పాట్లు చేసింది. పోటీల వివరాలను మంగళవారం సీఆర్‌ఎస్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం(ఆర్‌ఎస్), జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు తేతలి నారాయణరెడ్డి విలేకర్లకు వివరించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో రావులపాలెం సీఆర్‌సీ–కొత్తపేట సీఆర్‌ఎస్ సంయుక్తంగా రెండు ఇండోర్ స్టేడియంలలో జాతీయ షటిల్ పోటీలు నిర్వహిస్తామని ఆర్‌ఎస్ తెలిపారు. తేతలి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచి సింగిల్– 2, డబుల్ 1 చొప్పున బాలురు, బాలికలు టీమ్‌లు రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఆరు చొప్పున పాల్గొంటాయని, తొలిరోజు క్వాలిఫై టీములు ఆడతాయన్నారు. మలి రోజు నుంచి 20 మ్యాచ్‌లు, ఆఖరి రోజు సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయన్నారు. విజేతలు త్వరలో జరిగే సౌత్ జోన్, నేషనల్స్‌కు వెళతారని తెలిపారు.