మార్చిలో రూ.40లక్షలతో అభివృద్ధి పనులు
రూ.కోటితో ప్లానిటోరియానికి మరమ్మతులు
ఎలక్ట్రికల్ వైరింగ్‌కు మరో రూ.40 లక్షలు
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో పనులు
గాంధీహిల్ అభివృద్ధి పనులు వచ్చేనెల మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. రూ.40లక్షలతో జరిగే సివిల్ వర్క్స్ టెండర్‌ను గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. సివిల్ వర్క్‌లో భాగం కొండపైన ఉన్న రైల్‌ట్రాక్, ప్లానిటోరియానికి మరమ్మతులు, పక్కనే రిటైనింగ్ వాల్ నిర్మాణం, పెయింటింగ్స్ చేపడతారు.
- సాక్షి, విజయవాడ
రూ.3 కోట్లు కేటాయింపు
సెంట్రల్ టూరిజం డెవలప్‌మెంట్ స్కీమ్ కింద గాంధీహిల్ అభివృద్ధికి గత యూపీఏ ప్రభుత్వాన్ని రూ.5 కోట్లు కోరగా, రూ.3 కోట్లు కేటాయించింది. ఇందులో తొలివిడతగా రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. వీటి లో రూ.40 లక్షలు సివిల్ వర్కులకు, మరో రూ.40లక్షలు ఎలక్ట్రికల్ వర్కులకు, రూ.కోటి ప్లానిటోరియంకు కేటాయించారు.
రూ.40లక్షలతో విద్యుత్ పనులు
సివిల్ వర్క్స్‌తో పాటే రూ.40లక్షలతో విద్యుత్ పనులకు టెండర్లు పిలిచారు. నాలుగైదు రోజుల్లో టెండర్లు ఖరారుచేసి వచ్చే నెలలో పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్లానిటోరియానికి ఆధునిక విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు కొండపైకి వెళ్లే మార్గంలోనూ, కొండ పై భాగంలోనూ విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచనున్నారు. ఇందుకోసం కొత్త వైరింగ్ వేయనున్నారు.
రూ.1.20 కోట్లతో అభివృద్ధి
ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.1.20 కోట్లు మంజూరు కాగానే, గాంధీహిల్‌పై పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు, ఫుడ్‌కోర్టు, ల్యాడ్ స్కేపింగ్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే, కొండపై గ్రీనరీని పెంచేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సహాయం తీసుకోనున్నారు.
ప్లానిటోరియానికి అత్యాధునిక పరికరాలు
గాంధీహిల్‌పై ఉన్న ప్లానిటోరియం పరికరాలు మూడు దశాబ్దాల కిందట ఏర్పాటుచేసినవి. వాటిని మార్పుచేసి హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో ఉపయోగిస్తున్న యంత్రాలు, పరికరాలను తెప్పించాలని ఏపీటీడీసీ అధికారులు నిర్ణయించారు. రూ.కోటి విలువచేసే ఈ పరికరాలు ఏర్పాటుచేసే బాధ్యతను బిర్లా పానిటోరియానికే అప్పగించినట్లు తెలిసింది. రెండు నెలల్లో ఈ పరికరాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈలోగా ప్లానిటోరియ మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. ఈ పరికరాలు కూడా వస్తే సరికొత్త ప్లానిటోరియం సాక్షాత్కరిస్తుంది.
గాంధీహిల్‌కు మహర్దశ
Published Thu, Feb 26 2015 12:56 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement
Advertisement