వేలాడుతున్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో షార్ట్‌సర్క్యూట్ ...
గండేడ్: వేలాడుతున్న విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి ఐదెకరాల చెరుకుతోట దగ్ధమైంది. రూ. 5 లక్షల ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన మం డల పరిధిలోని రెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జి. బాల్‌రెడ్డి ఐదెకరాల పొలంలో చెరుకు పంట సాగుచేస్తున్నాడు. చెరుకు తోట పైనుంచి విద్యుత్ తీగలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా గురువారం ఉదయం ఈదురుగాలులకు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్‌సర్క్యూట్ ఏర్పడింది. నిప్పురవ్వలు కిందపడడంతో కోసేందుకు సిద్ధంగా ఉన్న చెరుకుపంటకు మంటలు వ్యాపించాయి. విషయం గమనించిన పొరుగు రైతు లు బాల్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మహబూబ్‌నగర్ నుంచి వచ్చేసరికి ఆలస్యం జరిగింది. అప్పటికే గ్రామానికి చెందిన యువకులు, మహ్మదాబాద్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
అప్పటికే పంట 80 శాతం పూర్తిగా కాలిపోయింది. చేతికి అందివచ్చిన పంట బుగ్గిపాలైందని రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యా దు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ప్రమాదంలో రూ. 5 లక్షల ఆస్తినష్టం జరిగిందని రైతు బాల్‌రెడ్డి తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.