చెన్నూరు, న్యూస్‌లైన్: చెన్నూరు సమీపంలోని గ్రీన్‌కో ఎనర్జీ పవర్‌ప్లాంట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాంట్‌కు సంబంధించిన కార్మికుడు ఒకరు విధి నిర్వహణలో పెన్నానదిలో గల్లంతు కావడంపై బంధువులు, స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్ జీఎం, షిఫ్ట్ ఇంజినీర్ సహా సెక్యూరిటీ సిబ్బందిపైనా వారు దాడి చేశారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారలేదు. జీఎం కారుతో పాటు ప్లాంట్‌కు సంబంధించిన ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఎందుకంటే...
చెన్నూరు మండలం దౌలతాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి పైన పేర్కొన్న ప్లాంట్‌లో టర్బైన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ప్లాంట్‌కు చెందిన రెండు నీటి మోటార ్లకు సంబంధించిన విద్యుత్ తీగలు తెగి రెండు నెలలుగా పని చేయడం లేదు. దీంతో ఆదివారం సాయంత్రం ప్లాంట్ జీఎం హనుమంతరావు ఆదేశం మేరకు మహేశ్వరరెడ్డి సహా సుబ్బారెడ్డి, గంగాప్రసాద్, సుబ్బారెడ్డి అనే నలుగురిని షిఫ్ట్ ఇంజినీర్ సుబ్రమణ్యం వారిని నదిలోకి దింపారు. నది మధ్యలోకి వెళ్లగానే మహేశ్వరరెడ్డి జారి లోపలికి పడిపోయారు. దీంతో భయాందోళనకు గురైన మిగిలిన ముగ్గురూ వెనుదిరిగి వచ్చారు. వంతెన బీమ్ పట్టుకుని కొద్దిసేపు ఆగిన మహేశ్వరరెడ్డి చాలా సేపు పట్టుకోలేక నీటి వేగానికి కొట్టుకెళ్లిపోయారు. ఆ తరువాత అతను గల్లంతయ్యాడు.
జీఎం, షిఫ్ట్ ఇంజినీర్,
సెక్యురిటీపై దాడి
విషయం తెలుసుకొన్న మహేశ్వర్‌రెడ్డి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున పెన్నానది వద్దకు చేరుకున్నారు. ‘మీ నిర్లక్ష్యం వల్లే మా బిడ్డ నీటిలో మునిగిపోయాడంటూ’ వారు రోదించారు. నదిలో గల్లంతైన విషయం తెలిసినా తమకు ఎందుకు సమాచారం అందించలేదని మండిపడ్డారు. ఒక మనిషి నీటిలో మునిగిపోతే కనీసం గాలింపు చర్యలైనా చేపట్టరా అంటూ నిలదీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నదిలోకి ఎలా దింపారంటూ దాడికి దిగారు. ఇందుకు బాధ్యుడైన జీఎం కారును ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డు వేణుగోపాల్‌రెడ్డిపైనా దాడి చేశారు. ఫర్నీచర్‌ను పడేసి పనికి రాకుండా చేసేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు
సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ రాజగోపాల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు వర్గాల వారితోనూ చర్చించి పరిస్థితిని చక్కదిద్దారు.
పెన్నానదిలో కార్మికుడి గల్లంతు
Published Mon, Nov 25 2013 3:23 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement