మనం పై పైన చూసే ఎన్నో విషయాలు మూలాల్లో ఉన్న అస్తిత్వానికి గొడ్డలిపెట్టుగా ఉండవచ్చు. అది మొక్కలకు సంబంధించినవైనా సరే...ప్రపంచంలో తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన వృక్ష జాతుల శాస్త్రీయనామాల మూలాలను శోధించి తిరిగి వాటికి పూర్వపు పేర్లు ఉండేలా కృషి చేస్తోంది భాను సుబ్రమణ్యం. అమెరికాలోని వెల్లెస్లీ కాలేజీలో ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్ ప్రోఫెసర్‌గా ఉన్న భారతీయురాలు.
తెల్లజాతీయుల ఆధిపత్య వలసవాదులు పెట్టిన 126 వృక్ష జాతుల మూలాలను శోధించి, తిరిగి వాటి పూర్వపు పేర్లతోనే పిలిచేలా కృషి చేశారు.దీంతో ఆ వృక్షజాతుల పేర్ల గురించి ఎవరు చర్చించినా భాను సుబ్రమణ్యాన్ని గుర్తుంచు కుంటారు. ‘దీనిని అత్యంత క్లిష్టమైన సమస్యగా ఎవరూ గుర్తించరు. అధికారంలో ఉన్నవారు దీనికి అనేక కారణాలు చూపుతారు’ అంటారామె.
మొక్కల పేర్ల నుండి స్థానిక జాతుల వరకు ప్రంచంలోని అనేక అంశాలు వలస సామ్రాజ్యాల ద్వారా రూపొందించబడ్డాయి. మనం ఈ వలసరాజ్యాల ఆధిపత్యాన్ని తొలగించాలి’ అంటారు వృక్షశాస్త్రంలో ఎంపరర్‌గా పేరొందిన భాను సుబ్రమణ్యం. తన కొత్త పుస్తకమైన ‘బోటనీ ఆఫ్ ఎంపైర్’లో వలసవాదం సృష్టించే సమస్యలు ఎప్పటికీ అంతం కావని, దాని వెనక తీవ్రమైన ప్రయత్నం ఎలా ఉండాలో తను రాసిన పుస్తకం ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చింది. జాతుల వర్గీకరణ, మొక్కల పునరుత్పత్తి, దండయాత్రల ద్వారా ప్రవేశపెట్టబడిన జాతుల వ్యాప్తికి సంబంధించిన శాస్త్రంగా ఈ పుస్తకం మనకు వివరిస్తుంది.
‘నేను పరిణామాత్మక జీవశాస్త్రవేత్త, మొక్కల శాస్త్రవేత్తగా పేరొందాను. స్త్రీవాద, సాంకేతిక రంగాలలో మానవీయ, సామాజిక శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాను. జెండర్, జాతి, కులానికి సంబంధించిన శాస్త్రాలు, వైద్యం, తత్వశాస్త్రం, చరిత్ర, సంస్కృతులను అన్వేషిస్తాను. నా ఇటీవల పరిశోధన వలసవాదం, జీనోఫోబియా చరిత్రలకు సంబంధించిన వృక్షశాస్త్రం వీటన్నింటినీ పునరాలోచింపజేస్తుంది. వలస, ఆక్రమణ జాతులకు సంబంధించి శాస్త్రీయ సిద్ధాంతాలు, ఆలోచనలు, విస్తృత ప్రయాణాలను అన్వేషిస్తుంది.
భారతదేశంలో సైన్స్, హిందూ జాతీయవాదం సంబంధంపై కూడా పని చేస్తున్నాను. ఇప్పటివరకు మూడు పుస్తకాలను తీసుకువచ్చాను. వీటిలో ΄్లాంట్ వరల్డ్స్ అండ్ ది సైంటిఫిక్ లెగసీస్ ఆఫ్ కలోనియలిజం ఈ యేడాది తీసుకువచ్చాను. ది బయోపాలిటిక్స్ ఆఫ్ హిందూ నేషనలిజం సొసైటీ ఫర్ లిటరేచర్ బుక్ ప్రైజ్‌ను గెలుచుకుంది. ఈ పుస్తకం భారతదేశంలో పుట్టుకువస్తున్న జాతీయవాద రాజకీయాలు, ఆధునికత, సైన్స్, మతం ఒకదానికి ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో తెలియజేస్తుంది’ అని వివరిస్తుంది.
భాను సుబ్రమణ్యం స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో పెరిగారు. దీంతో బ్రిటిషర్లు దేశంలో మూలాంశాలను ఎలా మార్చేశారో తెలుసుకున్నారు. ఫెమినిస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనాల కోసం అమెరికాలో పరిణామాత్మక జీవశాస్త్రంలో పీహెచ్‌డి చేశారు. తన రచనల ద్వారా జీవశాస్త్ర పండితురాలిగా పేరొందారు. ఈ ఏడాది జూలైలో జరిగే అంతర్జాతీయ బొటానికల్ కాంగ్రెస్‌లో పాల్గొని, అనేక సవరణలపై చర్చించబోతున్నారు.
మొక్కల శాస్త్రీయ నామకరణాన్ని నియంత్రించే అంతర్జాతీయ కోడ్‌కు బాధ్యత వహించే నామకరణ విభాగం, వర్గీకరణ, శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన అనేక సవరణలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఈ ప్రోఫెసర్ సమావేశంలో ΄ాల్గొన బోతున్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన సమావేశంలో తీసుకున్న కోడ్ మెకానిజంలో అనుచితమైనవిగా పరిగణించబడే మరెన్నో మొక్కల పేర్లను ఈ సమావేశం తిరస్కరించవచ్చు. దీని వెనకాల ఈ సీనియర్ ప్రోఫెసర్ చేస్తున్న కృషి మనల్ని ఆలోచింపజేస్తుంది.
వలసవాదం సుసంపన్నమైన వృక్ష ప్రపంచాలను జీవశాస్త్ర జ్ఞానంగా ఎలా మార్చింది అనే క్లిష్టమైన చరిత్రను అన్వేషించడానికి బాను సుబ్రమణ్యం దేశీయ అధ్యయనాలను శోధించారు. లాటిన్-ఆధారిత నామకరణ వ్యవస్థ, మొక్కల లైంగికతను వివరించడానికి యూరోపియన్ ఉన్నత వర్గాల ఊహాజనిత విధానాలను ‘బాటనీ ఆఫ్ ఎంపైర్’ పుస్తకం ద్వారా వివరించారు. వలసవాదులు మొక్కల కాలపు లోతైన చరిత్రను ఎలా నిర్మూలించారో మనం ఇందులో చూస్తాం. జాత్యాహంకారం, బానిసత్వం, వలసవాద చరిత్రలలోని దాని మూలల నుండి కేంద్రీకృతమైన వృక్షశాస్త్రానికి సంబంధించిన మరింత సమగ్రమైన, సామర్థ్యం గల రంగాన్ని ఊహించడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment