
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్టే.. ప్రస్తుత జీవన శైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాట పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటమే దీని ముఖ్యఉద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరకు పరిగెట్టడం కంటే ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎన్‌సీడీ–3.0
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు గత ఏడాది నవంబరులో ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0) కార్యక్రమం పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌తోపాటు, పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
8,75,977 మందికి స్క్రీనింగ్ పరీక్షలు
గుంటూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన జనాభా 17,50,399 మంది ఉన్నారు. వీరిలో 8,75,977 మందికి వైద్యసిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో మధుమేహం అనుమానితులు 23,103 మంది ఉండగా, 4,438 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే షుగర్‌తో 1,17,609 మంది చికిత్స పొందుతున్నారు.
బీపీ అనుమానిత బాధితులు 23,294 మంది ఉండగా, 4,635 మందికి బీపీ ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే బీపీతో 1,33,419 మంది చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ అనుమానిత కేసులు 94 ఉండగా, క్యాన్సర్ ఉన్నట్టు ఆరుగురికి నిర్ధారౖణెంది. క్యాన్సర్ రోగులను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.
గుండె ప్రధానం
శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. లబ్‌డబ్‌మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండెకోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి.
నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్‌లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి.
–డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు.
బీపీ, షుగర్‌లను అదుపులో పెట్టుకోవాలి...
శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి.
–డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్‌ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.
ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం
కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్‌లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు
(చదవండి: రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్! బిల్‌గేట్స్ బెస్ట్ పేరెంటింగ్ పాఠం)