
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని ఎంతో తాపత్రయంతో సంపాదిస్తుంటారు. కోట్లకొద్దీ ఆస్తులను కూడబెడుతుంటారు. ఒకవేళ పిల్లలకు చదువు అబ్బకపోయినా..ఏ చీకు చింతా లేకుండా దర్జాగా కూర్చుని తినాలనుకుంటారు. చాలామటుకు ధనవంతులైన తల్లిదండ్రులు ఇలానే ఆలోచిస్తుంటారు. కూర్చొని తింటే కొండలైనా కరిపోతాయనే పెద్దల నానుడిలా వారసత్వ సంపద, ఆస్తులు ఏరోజుకైనా కరిగిపోక మానవు. అవేమి వారికి బతికే స్థైర్యానివ్వవు. కేవలం వాళ్ల కాళ్లమీద నిలబడి బతకగలిగే సామర్థ్యమే..పిల్లలకు శ్రీరామ రక్ష అనేది జగమెరిగిన సత్యం. ఆ సిద్ధాంతాన్నే విశ్వసిస్తానంటున్నారు ప్రపంచ కుభేరులలో ఒకరైన, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. అంతేగాదు ఇదేం రాజులనాటి కాలం కాదు..ప్రతిదీ వారసత్వంగా తీసుకోవడానికి అని ప్రశ్నిస్తున్నారాయన. పిల్లల్ని ప్రయోజకులుగా చేయండి చాలు అంటున్నారు బిల్‌గేట్స్. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల 'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ' పాడ్‌కాస్ట్‌లో పిల్లల పెంపకం, వారి అభ్యున్నతికి సంబంధించి అమూల్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులు సృష్టించిన సంపదను వారసత్వంగా పొందడం కంటే స్వయంగా సక్సెస్ అవ్వడానికి మొగ్గు చూపేలా చేయాలి. అదే వారి అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు.
పిల్లలు ఉన్నత స్థానంలో ఉంచడటం కాదు..ఉన్నతంగా ఆలోచించేలా పెంచాలి. తాతలు, తండ్రుల ఆస్తులు వారసత్వంగా పొందడం కాదు..వాళ్ల ఐడెంటిటీతో బతికి.. స్వయంగా సంపాదించేలా ఎదగనివ్వాలంటున్నారు. పిల్లలను ప్రయోజకులగా తీర్చిదిద్దడం అంటే ఇదేనని నొక్కి చెప్పారు.
అంతేగాదు బిల్‌గేట్స్ తన ముగ్గురు పిల్లలు కూడా తన సంపదలో కేవలం ఒక్క శాతం ఆస్తికి మాత్రమే అర్హులని అన్నారు. సంపన్న కుటుంబాలు తమ పిల్లల ఎదుగుదల కోసం స్వయంకృషికే పెద్దపీటవేయాలన్నారు. వారికి మంచి చదువు, వసతులను అందిస్తే చాలు..పైకి రావాల్సిన బాధ్యత వారిదేనని చెప్పారు.
అలా చేస్తేనే డబ్బు విలువ, కష్టం గొప్పదనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులుగా మన పిల్లలపై మనకు అపారమైన ప్రేమ ఉంటుదనేది కాదనలేని సత్యం. కానీ ఆ ప్రేమ వారి ఎదుగుదలను కుంటుపడేలా చేయకూడదు. తమ పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యి..సమున్నత స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. వారు ఎదిగేందుకు అవకాశాలివ్వండే తప్ప ప్రతీది మనమే అమర్చిపెట్టేయకూడదని హితవు పలకారు.
అలాగే వాళ్లకు ఇది తమతల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి.. తమది కాదనే భావన ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆశించడం అనే రోగం బారినపడకుండా పెంచాలని చెప్పారు. ఇక బిల్గేట్సకి తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్‌తో రోరీ గేట్స్, జెన్నిఫర్ గేట్స్ నాసర్, ఫోబ్ గేట్స్ అనే ముగ్గురు పిల్లలున్నారు.
ఆయన రూ. 13 లక్షల కోట్ల సంపాదనలో కేవలం ఒక్కశాతం మాత్రమే తన పిలల్లకు వాటా ఉంటుందని అన్నారు. తన పిల్లలు తండ్రికి ఉన్నంత సంపదను కలిగి ఉండకపోయినా.. ప్రపంచ జనాభాలో ఒక శాతం మంది ధనవంతుల సరసన ఉంటారన్నారు. తన మిగతా సంపాదనంతా ఫౌండేషన్‌కి వెళ్లిపోతుందని, అర్హులైన వాళ్లకు దక్కుతుందన్నారు.
ఇలా బిల్‌గేట్స్‌లా వారసత్వ సంపదను అందించకూడదన్న జాబితాలో ఆపిల్ కంపెనీకి చెందిన దివంగత స్టీవ్ జాబ్స్, అమెజాన్ కంపెనీకి చెందిన జెఫ్ బెజోస్ వంటి అనేక మంది ప్రముఖ టెక్ దిగ్గజాలు ఉన్నారు. వారంతా కూడా వారసత్వ సంపదను సృష్టించడం పట్ల మక్కువ చూపలేదు..తమ పిల్లలు తమ ఐడెంటిటీతో ఎదగాలని భావించారు. నిజంగా ఇది ప్రతి తల్లదండ్రులు తెలుసుకోవాల్సిన గొప్ప పేరెంటింగ్ పాఠం కదూ..!
(చదవండి: Weight loss Surgery: బరువు తగ్గాలని సర్జరీ చేయించుకుంది..పాపం ఆ మహిళ..!)