భారీ వాణిజ్య ఒప్పందాల్లో భాగం కావాలి
ఎగుమతి అవకాశాలు పెంచుకోవాలి
దేశ ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం
నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం
న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ)తోపాటు, సమగ్ర, ట్రాన్స్‌పసిఫిక్ పార్టనర్‌షిప్‌కు సంబంధించి ప్రగతిశీల అంగీకారం (సీపీటీపీపీ)లో భారత్ కూడా భాగం కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. 2019లో ఆర్‌సీఈపీ నుంచి భారత్ బయటకు రావడం గమనార్హం. ‘‘భారీ వాణిజ్య ఒప్పందాల్లో పాలుపంచుకోని దేశాల్లో భారత్ ఒకటి. ఆర్‌సీఈపీ, సీపీటీపీపీలో భారత్ పాలుపంచుకోవడంతోపాటు సభ్య దేశం కావాలి.
దేశ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) సంస్థలకు ఇది మేలు చేస్తుంది. దేశ ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్‌ఎంఈలవే ఉంటున్నాయి. బడా కొర్పొరేట్ సంస్థలు గొప్ప ఎగుమతిదారులుగా లేవు’’అని అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆర్‌సీఈపీ అన్నది 10 ఆసియా దేశాల కూటమి. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిల్యాండ్, ఫిలిప్పీన్స్, లావోస్, వియత్నాం సభ్యదేశాలుగా ఉన్నాయి. సీపీటీపీపీ అన్నది కెనడా, మెక్సికో, పెరూ, చిలే, న్యూజిల్యాండ్, ఆ్రస్టేరలియా, బ్రూనై, సింగపూర్, మలేషియా, వియత్నాం, జపాన్‌తో కూడిన కూటమి.
చైనా ప్లస్ వన్‌తో పెద్దగా లబ్ది పొందలేదు..
చైనా ప్లస్ వన్ అవకాశాలను భారత్ తగినంత అందిపుచ్చుకోలేదని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత్ కంటే వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, తుర్కియే, మెక్సికో ఎక్కువగా ప్రయోజనం పొందినట్టు చెప్పారు. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్ బలపడాలంటూ 70 శాతం వాణిజ్యం ఈ రూపంలోనే ఉంటుందన్నారు. ఇతర దేశాల కంటే మన దగ్గర టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మన దగ్గర 2–3 అవరోధాలున్నాయి.
టారిఫ్‌లు ఎక్కువగా ఉండడం ఇందులో ఒకటి. టారిఫ్‌లను తగ్గించకపోతే మనం ప్రయోజనం పొందలేం. అలాగే, మనకు కావాల్సిన స్థాయిలో ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు ఉండడం లేదు. సామర్థ్య వినియోగం 70 శాతంగానే ఉంది’’అని సుబ్రమణ్యం వివరించారు. అంతర్జాతీయంగా భారత్ ప్రకాశిస్తున్న కిరణమంటూ, విధానపరమైన స్థిరత్వంతోపాటు సంస్కరణలు వేగవంతమైన వృద్ధి దిశగా నడిపిస్తున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం జీడీపీ వృద్ధిని గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధిలో భారత్ 20 శాతం వాటా సమకూరుస్తోందని, రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment