ఆసియాన్ సదస్సులో చైనా ప్రధాని కెకియాంగ్‌తో ప్రధాని మోదీ కరచాలనం
బ్యాంకాక్: కీలకమైన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ–ఆర్‌సెప్)’ ఒప్పందంలో భారత్ చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసింది. ఆర్‌సెప్‌కు సంబంధించి భారత్ ఆకాంక్షలకు, ఆందోళనలకు చర్చల్లో సరైన సమాధానం లభించలేదని తేల్చి చెప్పింది. పలు ప్రపంచ దేశాల అధినేతలు హాజరైన ఆర్‌సీఈపీ సదస్సులో ప్రసంగిస్తూ భారత ప్రధాని మోదీ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆర్‌సీఈపీ చర్చల ప్రారంభంలో అంగీకరించిన మౌలిక స్ఫూర్తి ప్రస్తుత ఒప్పందంలో పూర్తిగా ప్రతిఫలించడం లేదు.
భారత్ లేవనెత్తిన వివాదాస్పద అంశాలు, ఆందోళనలకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్‌సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరడం భారత్‌కు సాధ్యం కాదు’ అని ప్రకటించారు. ‘భారతీయులకు అందే ప్రయోజనాల దృష్టికోణం నుంచి ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తే నాకు సానుకూల సమాధానం లభించడం లేదు’ అని అన్నారు. ఈ ఒప్పందం భారతీయుల జీవితాలు, జీవనాధారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
చైనా ఒత్తిడి
అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సదస్సులోనే అది జరగాలని సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం చైనా లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది.
మరోవైపు, దేశీయ మార్కెట్‌ను సంరక్షించుకోవడం కోసం కొన్ని నిబంధనలు అవసరమని భారత్ వాదిస్తోంది. ముఖ్యంగా చవకైన చైనా వ్యావసాయిక ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదముందనే భయాల నేపథ్యంలో.. దేశీయ ఉత్పత్తుల మార్కెట్‌కు సముచిత రక్షణ కల్పించాలన్నది భారత్ వాదనగా ఉంది. ఒకవేళ ఈ ఆర్‌సెప్ ఆమోదం పొందితే .. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందంగా నిలిచేది. దాదాపు ప్రపంచ జనాభాలో సగం మందితో పాటు, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40%, ప్రపంచ జీడీపీలో 35% ఈ ఒప్పంద పరిధిలో ఉండేవి.
15 దేశాలు సిద్ధం
ఈ ఒప్పందాన్ని భారత్ మినహా మిగతా 15 దేశాలు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఒప్పందంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసిన అనంతరం.. వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా 15 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. తరువాతైనా, ఈ ఒప్పందంలో భారత్ చేరే అవకాశముందా? అన్న ప్రశ్నకు ‘ఈ ఒప్పందంలో భాగం కాకూడదని భారత్ నిర్ణయించుకుంది’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ పేర్కొన్నారు.
భారత్ పేర్కొన్న ఏకాభిప్రాయం వ్యక్తం కాని అంశాలపై శనివారం 16 దేశాల వాణిజ్య మంత్రులు జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదు. ‘గత ప్రభుత్వాల హయాంలో అంతర్జాతీయ ఒత్తిడులకు తలొగ్గి ప్రయోజనకరం కాకపోయినా.. పలు వాణిజ్య ఒప్పందాలకు భారత్ అమోదం తెలిపింది. ఇప్పుడలా లేదు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సొంత ప్రయోజనాల విషయంలో స్పష్టంగా ఉంటోంది’ అని వాణిజ్య శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి.
‘ఇండో పసిఫిక్’ అభివృద్ధే లక్ష్యం
ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, సమృద్ధి, అభివృద్ధిల కోసం కలసి కట్టుగా కృషి చేయాలని భారత్, జపాన్ దేశాలు నిర్ణయించాయి. ఈస్ట్ ఆసియా సదస్సు సందర్భంగా రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షింజొ అబె సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిలటరీపరంగా, వాణిజ్యపరంగా చైనా విస్తరణవాద దూకుడుతో పాటు ఈ ప్రాంత భద్రత, వాణిజ్యం తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు సమీక్ష నిర్వహించారు.
2012 నుంచి..
ఆర్‌సెప్ చర్చలు 21వ ఆసియాన్ సదస్సు సందర్భంగా నవంబర్, 2012లో ప్రారంభమయ్యాయి. 10 ఆసియాన్ సభ్య దేశాలు(ఇండోనేసియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, మయన్మార్, లావోస్) 6 భాగస్వామ్య దేశాలు(భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఈ చర్చల్లో పాలు పంచుకున్నాయి. ‘ఆధునిక, సమగ్ర, అత్యున్నత ప్రమాణాలతో కూడిన, పరస్పర ప్రయోజనకర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద రూపకల్పన’ లక్ష్యంగా ఆర్‌సీఈపీ చర్చలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment