బ్యాంకాక్: ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ‘‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’’ (ఆర్‌సెప్) ఒప్పందంలో చేరేందుకు భారత్ నిరాకరించింది. ఆర్‌సెప్ ఒప్పంద మూలస్వభావం మారిపోయిందని, అంతేకాకుండా ఈ ఒప్పందం విషయంలో భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌సెప్ ఒప్పందంలో చేరరాదని భారత్ నిర్ణయించింది.
భారత్ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృఢసంకల్పంతో ఉండటం.. అంతేకాకుండా ఆర్‌సెప్ ఒప్పందంలో భారత్ లేవనెత్తిన కీలక అంశాలను పట్టించుకోకపోవడంతో ఈ ఒప్పందానికి భారత్ దూరం జరిగింది. దేశంలోకి చైనా దిగుమతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొన్ని కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చింది. వాస్తవానికి బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆర్‌సెప్ ఒప్పందం ఖరారు కావాలి. కానీ, భారత్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందం 2020కి వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు.
భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా 16 దేశాల మధ్య ఆర్‌సెప్ ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రపంచంలోని సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. ఆర్‌సెప్‌పై సంతకం చేయడానికి మిగతా దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయి, కానీ భారత్ మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా చౌక వస్తువుల వెల్లువలో దేశంలో చిరు వ్యాపారుల పరిస్థితి దెబ్బతింటుందంటూ ప్రధాని మోదీ ఇప్పటికే ఆర్‌సెప్ ఒప్పందంపై పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment