Regional Comprehensive Economic Partnership
-
ఆర్సీఈపీ, సీపీటీపీపీలో భారత్ చేరాలి
న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)తోపాటు, సమగ్ర, ట్రాన్స్‌పసిఫిక్ పార్టనర్షిప్కు సంబంధించి ప్రగతిశీల అంగీకారం (సీపీటీపీపీ)లో భారత్ కూడా భాగం కావాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. 2019లో ఆర్సీఈపీ నుంచి భారత్ బయటకు రావడం గమనార్హం. ‘‘భారీ వాణిజ్య ఒప్పందాల్లో పాలుపంచుకోని దేశాల్లో భారత్ ఒకటి. ఆర్సీఈపీ, సీపీటీపీపీలో భారత్ పాలుపంచుకోవడంతోపాటు సభ్య దేశం కావాలి. దేశ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థలకు ఇది మేలు చేస్తుంది. దేశ ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్ఎంఈలవే ఉంటున్నాయి. బడా కొర్పొరేట్ సంస్థలు గొప్ప ఎగుమతిదారులుగా లేవు’’అని అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఆర్సీఈపీ అన్నది 10 ఆసియా దేశాల కూటమి. బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిల్యాండ్, ఫిలిప్పీన్స్, లావోస్, వియత్నాం సభ్యదేశాలుగా ఉన్నాయి. సీపీటీపీపీ అన్నది కెనడా, మెక్సికో, పెరూ, చిలే, న్యూజిల్యాండ్, ఆ్రస్టేరలియా, బ్రూనై, సింగపూర్, మలేషియా, వియత్నాం, జపాన్‌తో కూడిన కూటమి.చైనా ప్లస్ వన్‌తో పెద్దగా లబ్ది పొందలేదు..చైనా ప్లస్ వన్ అవకాశాలను భారత్ తగినంత అందిపుచ్చుకోలేదని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత్ కంటే వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, తుర్కియే, మెక్సికో ఎక్కువగా ప్రయోజనం పొందినట్టు చెప్పారు. అంతర్జాతీయ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలో భారత్ బలపడాలంటూ 70 శాతం వాణిజ్యం ఈ రూపంలోనే ఉంటుందన్నారు. ఇతర దేశాల కంటే మన దగ్గర టారిఫ్‌లు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ‘‘మన దగ్గర 2–3 అవరోధాలున్నాయి. టారిఫ్‌లు ఎక్కువగా ఉండడం ఇందులో ఒకటి. టారిఫ్‌లను తగ్గించకపోతే మనం ప్రయోజనం పొందలేం. అలాగే, మనకు కావాల్సిన స్థాయిలో ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు ఉండడం లేదు. సామర్థ్య వినియోగం 70 శాతంగానే ఉంది’’అని సుబ్రమణ్యం వివరించారు. అంతర్జాతీయంగా భారత్ ప్రకాశిస్తున్న కిరణమంటూ, విధానపరమైన స్థిరత్వంతోపాటు సంస్కరణలు వేగవంతమైన వృద్ధి దిశగా నడిపిస్తున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం జీడీపీ వృద్ధిని గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధిలో భారత్ 20 శాతం వాటా సమకూరుస్తోందని, రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతుందన్నారు. -
‘ఆర్సీఈపీ’పై సంతకాలు
సింగపూర్: ప్రపంచంలోనే అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందంపై చైనా సహా 15 ఆసియా పసిఫిక్ దేశాలు ఆదివారం సంతకాలు చేశాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో దాదాపు మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్– ఆర్సీఈపీ)’లో భారత్ భాగస్వామిగా లేదు. ఆర్సీఈపీపై సభ్య దేశాల మధ్య గత ఎనిమిదేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల నేతలు, వారి ప్రాంతీయ భాగస్వాముల మధ్య జరిగిన వార్షిక సదస్సు కోవిడ్–19 ముప్పు కారణంగా ఈ సంవత్సరం వర్చువల్‌గా జరిగింది. సంతకాలు జరిగిన రెండేళ్లలోపు సభ్య దేశాలన్నీ ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాలు అత్యధిక రంగాల్లో వాణిజ్య పన్నులను క్రమంగా తగ్గించాల్సి ఉంటుంది. చైనా ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చల నుంచి భారత్ గత సంవత్సరం వైదొలగింది. వాణిజ్య పన్నుల తగ్గింపు వల్ల భారతీయ మార్కెట్ దిగుమతులతో పోటెత్తుతుందని, అది దేశీయ ఉత్పత్తులకు హానికరమవుతుందన్న ఆందోళనలతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ ఈ ఒప్పందంలో చేరేందుకు ఇంకా అవకాశాలున్నాయని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఆర్సీఈపీకి ప్రతిపాదన మొదట 2012లో వచ్చింది. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కోవిడ్ కారణంగా ఆర్సీఈపీ సభ్య దేశాలే కాకుండా దాదాపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ప్రస్తుత వర్చువల్ సదస్సు ఆతిథ్య దేశం వియత్నాం ప్రధానమంత్రి గ్యుయెన్ జువాన్ పేర్కొన్నారు. బహుముఖ వాణిజ్య విధానానికి ‘ఆసియాన్’ నాయకత్వం వహిస్తోందన్న సందేశాన్ని ఈ ఒప్పందం ఇస్తోందన్నారు. సమీప భవిష్యత్తులో ఈ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామిగా చేరుతుందన్న విశ్వాసం ఉందని సింగపూర్ పీఎం లీ సీన్ లూంగ్ అన్నారు. భారత్ చేరికతో ఆసియాలో ప్రాంతీయ సహకారం, సమగ్రతకు సంపూర్ణ రూపం చేకూరుతుందన్నారు. ఆర్సీఈపీ ప్రయోజనాలను ప్రజలు అర్థం చేసుకుని, ఈ ఒప్పందాన్ని వారు ప్రోత్సహించేలా చూడాలని సభ్యదేశాలను ఆయన కోరారు. ఎనిమిదేళ్ల కఠోర కృషి అనంతరం ఈ ఒప్పందానికి తుది రూపు వచ్చిందని మలేసియా వాణిజ్య మంత్రి మొహ్మద్ అజ్మీన్ అలీ వ్యాఖ్యానించారు. ఈ ఆసియాన్ వర్చువల్ సదస్సు నాలుగు రోజుల పాటు జరిగింది. సౌత్ చైనా సీపై చైనా ఆధిపత్యాన్ని ఆసియాన్‌లోని అత్యధిక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. -
హామీ ఇస్తే ‘ఆర్సెప్’పై ఆలోచిస్తాం
న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సెప్) ఒప్పందంపై భారత్ మరోసారి స్పందించింది. దేశ ప్రయోజనాల విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే ఆర్సెప్ ఒప్పందంలో చేరే విషయమై పునరాలోచిస్తామని విదేశాంగ శాఖ గురువారం పేర్కొంది. ఒప్పందానికి సంబంధించి భారత్ అభ్యంతరాలను పరిశీలిస్తామని, దేశీయ ఉత్పత్తులకు మరింత విస్తృత మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని సభ్య దేశాల నుంచి ప్రతిపాదన వస్తే చర్చల్లో పాల్గొంటామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూశ్ గోయల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్ అభ్యంతరాలేమిటో సభ్య దేశాలకు తెలుసని గురువారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్పష్టమైన రీతిలో వాదనలు వినిపించాం. ప్రయోజనాల విషయంలో హామీ లభిస్తే ఆర్‌సెప్‌లో చేరే నిర్ణయంపై పునరాలోచిస్తాం’ అని అన్నారు. -
భేషైన నిర్ణయం!
చైనా సరుకులు మన మార్కెట్లను వెల్లువలా ముంచెత్తడానికి దోహదపడే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్సీఈపీ–ఆర్సెప్)నుంచి బయటకు రావాలని మన దేశం సోమవారం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది. ఏడేళ్లక్రితం ఆ ఒప్పందంపై జరిగే చర్చల్లో పాలుపంచుకోవడానికి మన దేశం అంగీకరించినప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దేశాల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పం దాలు సమష్టి ప్రయోజనాలకు తోడ్పడాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ ఎదిగేందుకు దోహదపడాలి. ముఖ్యంగా ఒప్పందం కోసం జరిగే చర్చల్లో పారదర్శకత ఉండాలి. అప్పుడు మాత్రమే అన్ని దేశాల పౌరులకూ తమ ప్రభుత్వాలు చేసుకోబోయే ఒప్పందాలు ఎలాంటివో తెలు స్తుంది. దురదృష్టకరమేమంటే ఇలాంటి ఒప్పందాల కోసం జరిగే చర్చలన్నీ రహస్యంగా సాగుతాయి. వాటి అంశాలు లీకై, ఆందోళనలు వెల్లువెత్తినా ప్రభుత్వాలు నోరు మెదపవు. గతంలో విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీ)పై జరిగిన చర్చలూ ఇలాగే రహస్యంగా సాగాయి. తన చొరవతో మొలకెత్తిన ఆ ఒప్పందం ప్రతిపాదనను అమెరికాయే విరమించుకోవడంతో అది నిలిచిపోయింది. ఇందుకు డోనాల్డ్ ట్రంప్‌కు అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వాస్తవానికి తనకు భాగస్వామ్యం దక్కని టీపీపీ వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళనపడిన చైనా 2012లో ఎంతో ముందుచూపుతో ఆర్‌సెప్‌ను రంగం మీదికి తెచ్చింది. టీపీపీలో వచ్చే రాయితీ ఆకర్షణలో పడి అన్ని దేశాలూ ద్వైపాక్షిక ఒప్పందాల నుంచి తప్పు కుని దాని పరిధిలోకి వెళ్లే ప్రమాదమున్నదని చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా వంటివి కూడా భయపడ్డాయి. పర్యవసానంగా ఆర్సెప్పైనా, దాని నిబంధనలపైనా 30 దఫాలు చర్చలు జరి గాయి. ఆ చర్చల్లో మన దేశంతోసహా 16 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో పది ఆసియాన్ సంస్థ భాగస్వామ్య దేశాలు–బ్రూనీ, కంబోడియా, ఇండొనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలి ప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంలతోపాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్, దక్షిణకొరియా, న్యూజిలాండ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు భారత్ మినహా మిగిలిన దేశాలన్నీ కొన సాగాలని నిర్ణయించాయి. ఈ 16 దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 45 శాతం. ఇంత పెద్ద మార్కెట్‌కు వెలుపల ఉండిపోతే మన దేశం తీవ్రంగా నష్టపోతుందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి పాతికేళ్లు దాటుతున్నా వాణిజ్యపరమైన రక్షణలకు ప్రాధాన్యమిచ్చి స్వేచ్ఛా వాణిజ్యం వల్ల కలిగే లాభాలను మన దేశం చేజేతులా వదులుకుంటున్నదని వారు వాపోతున్నారు. మన సరుకులను అమ్ముకోవడానికి లభించే అవకాశాన్ని ఎందుకు కాల దన్నాలన్నది వారి ప్రశ్న. పైపైన చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కానీ ఈ ఒప్పందాల్లో ఉండే సవాలక్ష నిబంధనలు దేశ ప్రయోజనాలను గుల్ల చేస్తాయి. పలు రంగాలను దెబ్బతీస్తాయి. ఆర్సెప్ ఒప్పందంలో మన దేశం భాగస్వామిగా మారితే ఆరోగ్యరంగం, వ్యవసాయం, పాడిపరిశ్రమ, తయారీ రంగం వంటివన్నీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఒప్పందంలో చేరొద్దని రైతు సంఘాలు మాత్రమే కాదు... పారిశ్రామిక రంగ సంస్థలు కూడా కేంద్రాన్ని కోరాయి. వీట న్నిటితోపాటు సంఘ్ పరివార్ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ గత నెలలో పదిరోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఆందోళన కేంద్రాన్ని పునరాలోచనలో పడేసిందని చెప్పాలి. ఆర్సెప్ ఒప్పందంలో చేరితే అవసరం లేకున్నా ఇతర భాగస్వామ్య దేశాల ఉత్పత్తులకు వెసులు బాట్లు కల్పించాలి. ఆ ఉత్పత్తులపై విధించే సుంకాలు నిర్దిష్ట పరిమితికి మించరాదన్న నిబంధన వల్ల అవి దేశీయ మార్కెట్లో ఉత్పత్తయ్యే సరుకులతో పోలిస్తే చవగ్గా లభ్యమవుతాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి పాల ఉత్పత్తులు ఒక్కసారిగా మన మార్కెట్లను ముంచెత్తితే ఇక్కడి పాడి పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. ఆ రెండు దేశాల పాల ఉత్పత్తులు మన ఉత్పత్తులతో పోలిస్తే కిలోకు కనీసం రూ. 10 వరకూ చవగ్గా లభిస్తాయి గనుక జనం అటువైపే మొగ్గుతారు. అంతిమంగా ఇదంతా దేశంలో 15 కోట్లమంది జీవికను దెబ్బతీస్తుంది. ఇదే పరిస్థితి వ్యవసాయం, విద్యుత్ యంత్రాల తయారీ, అల్యూమినియం, ఉక్కు, ఇనుము, ప్లాస్టిక్, ఫర్నీచర్ తదితరాలకు కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యరంగానిది మరో సమస్య. వివిధ ఔషధాలపై ఉండే పేటెంట్ హక్కుల నిడివి గతంతో పోలిస్తే పెరుగుతుంది. వాటి తయారీపై గుత్తాధిపత్యం ఏర్పడి ఆ ఔషధాలను చవగ్గా ఉత్పత్తి చేద్దామనుకున్నా అసాధ్యమవుతుంది. ఉదాహరణకు కొన్ని ఔషధాల తయారీపై ఆర్సెప్ ప్రకారం ఇరవైయ్యేళ్లపాటు పేటెంట్ అమల్లో ఉంటుంది. వేరే సంస్థలు చవగ్గా తయారు చేయగల స్తోమత ఉన్నా అవి నిస్సహాయంగా ఉండిపోవాల్సిందే. నిరుపేద రోగులు భారీ మొత్తం చెల్లించి ఆ ఔషధాలను కొనుక్కోవాలి లేదా చావడానికి సిద్ధపడాలి. ప్రపంచంలోని కేన్సర్ మరణాల్లో 70 శాతం వర్థమాన దేశాల్లోనే సంభవిస్తున్నాయని చాన్నాళ్లక్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఔషధాలు చవగ్గా లభ్యమైతే ఇందులో చాలామంది తమ ఆయుర్దాయాన్ని పెంచుకోగలిగేవారు. కనీసం బతికిన న్నాళ్లూ నొప్పి లేకుండా కాలం వెళ్లదీసేవారు. కానీ బహుళజాతి సంస్థల దుర్మార్గం వల్ల ఔషధాల ధరలు అందుబాటులో లేక, వాటిని వినియోగించుకోలేక కేన్సర్ రోగులు కన్నుమూస్తున్నారు. ఆర్సెప్ ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. మొత్తంగా చైనాతో మన దేశానికి ఇప్పటికే ఉన్న వాణిజ్యపరమైన లోటును మరిన్ని రెట్లు పెంచుతుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో తీసుకున్న చొరవ మన దేశాన్ని ఆర్సెప్ చక్రబంధానికి దాదాపు చేరువ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం మొదట్లో దీనివైపు మొగ్గుచూపినా చివరి నిమిషంలో వైఖరి మార్చుకోవడంతో దేశానికి పెనుముప్పు తప్పిందనే చెప్పాలి. దీంతోపాటు ఇతరేతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సైతం పునఃపరిశీలించడం అవసరం. -
‘ఆర్సెప్’లో చేరడం లేదు!
బ్యాంకాక్: కీలకమైన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ–ఆర్సెప్)’ ఒప్పందంలో భారత్ చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసింది. ఆర్సెప్కు సంబంధించి భారత్ ఆకాంక్షలకు, ఆందోళనలకు చర్చల్లో సరైన సమాధానం లభించలేదని తేల్చి చెప్పింది. పలు ప్రపంచ దేశాల అధినేతలు హాజరైన ఆర్సీఈపీ సదస్సులో ప్రసంగిస్తూ భారత ప్రధాని మోదీ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆర్సీఈపీ చర్చల ప్రారంభంలో అంగీకరించిన మౌలిక స్ఫూర్తి ప్రస్తుత ఒప్పందంలో పూర్తిగా ప్రతిఫలించడం లేదు. భారత్ లేవనెత్తిన వివాదాస్పద అంశాలు, ఆందోళనలకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరడం భారత్‌కు సాధ్యం కాదు’ అని ప్రకటించారు. ‘భారతీయులకు అందే ప్రయోజనాల దృష్టికోణం నుంచి ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తే నాకు సానుకూల సమాధానం లభించడం లేదు’ అని అన్నారు. ఈ ఒప్పందం భారతీయుల జీవితాలు, జీవనాధారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. చైనా ఒత్తిడి అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సదస్సులోనే అది జరగాలని సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం చైనా లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. మరోవైపు, దేశీయ మార్కెట్‌ను సంరక్షించుకోవడం కోసం కొన్ని నిబంధనలు అవసరమని భారత్ వాదిస్తోంది. ముఖ్యంగా చవకైన చైనా వ్యావసాయిక ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదముందనే భయాల నేపథ్యంలో.. దేశీయ ఉత్పత్తుల మార్కెట్‌కు సముచిత రక్షణ కల్పించాలన్నది భారత్ వాదనగా ఉంది. ఒకవేళ ఈ ఆర్సెప్ ఆమోదం పొందితే .. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందంగా నిలిచేది. దాదాపు ప్రపంచ జనాభాలో సగం మందితో పాటు, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40%, ప్రపంచ జీడీపీలో 35% ఈ ఒప్పంద పరిధిలో ఉండేవి. 15 దేశాలు సిద్ధం ఈ ఒప్పందాన్ని భారత్ మినహా మిగతా 15 దేశాలు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఒప్పందంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసిన అనంతరం.. వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా 15 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. తరువాతైనా, ఈ ఒప్పందంలో భారత్ చేరే అవకాశముందా? అన్న ప్రశ్నకు ‘ఈ ఒప్పందంలో భాగం కాకూడదని భారత్ నిర్ణయించుకుంది’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ పేర్కొన్నారు. భారత్ పేర్కొన్న ఏకాభిప్రాయం వ్యక్తం కాని అంశాలపై శనివారం 16 దేశాల వాణిజ్య మంత్రులు జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదు. ‘గత ప్రభుత్వాల హయాంలో అంతర్జాతీయ ఒత్తిడులకు తలొగ్గి ప్రయోజనకరం కాకపోయినా.. పలు వాణిజ్య ఒప్పందాలకు భారత్ అమోదం తెలిపింది. ఇప్పుడలా లేదు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సొంత ప్రయోజనాల విషయంలో స్పష్టంగా ఉంటోంది’ అని వాణిజ్య శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘ఇండో పసిఫిక్’ అభివృద్ధే లక్ష్యం ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, సమృద్ధి, అభివృద్ధిల కోసం కలసి కట్టుగా కృషి చేయాలని భారత్, జపాన్ దేశాలు నిర్ణయించాయి. ఈస్ట్ ఆసియా సదస్సు సందర్భంగా రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షింజొ అబె సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిలటరీపరంగా, వాణిజ్యపరంగా చైనా విస్తరణవాద దూకుడుతో పాటు ఈ ప్రాంత భద్రత, వాణిజ్యం తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు సమీక్ష నిర్వహించారు. 2012 నుంచి.. ఆర్సెప్ చర్చలు 21వ ఆసియాన్ సదస్సు సందర్భంగా నవంబర్, 2012లో ప్రారంభమయ్యాయి. 10 ఆసియాన్ సభ్య దేశాలు(ఇండోనేసియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, మయన్మార్, లావోస్) 6 భాగస్వామ్య దేశాలు(భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఈ చర్చల్లో పాలు పంచుకున్నాయి. ‘ఆధునిక, సమగ్ర, అత్యున్నత ప్రమాణాలతో కూడిన, పరస్పర ప్రయోజనకర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద రూపకల్పన’ లక్ష్యంగా ఆర్సీఈపీ చర్చలు ప్రారంభమయ్యాయి. -
మోదీ సంచలనం.. ఆర్సెప్కు భారత్ దూరం!
బ్యాంకాక్: ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ‘‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’’ (ఆర్సెప్) ఒప్పందంలో చేరేందుకు భారత్ నిరాకరించింది. ఆర్సెప్ ఒప్పంద మూలస్వభావం మారిపోయిందని, అంతేకాకుండా ఈ ఒప్పందం విషయంలో భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సెప్ ఒప్పందంలో చేరరాదని భారత్ నిర్ణయించింది. భారత్ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృఢసంకల్పంతో ఉండటం.. అంతేకాకుండా ఆర్సెప్ ఒప్పందంలో భారత్ లేవనెత్తిన కీలక అంశాలను పట్టించుకోకపోవడంతో ఈ ఒప్పందానికి భారత్ దూరం జరిగింది. దేశంలోకి చైనా దిగుమతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొన్ని కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చింది. వాస్తవానికి బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆర్సెప్ ఒప్పందం ఖరారు కావాలి. కానీ, భారత్ ఒప్పుకోకపోవడంతో ఈ ఒప్పందం 2020కి వాయిదా పడినట్లేనని భావిస్తున్నారు. భారత్‌తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా 16 దేశాల మధ్య ఆర్సెప్ ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రపంచంలోని సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. ఆర్‌సెప్‌పై సంతకం చేయడానికి మిగతా దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయి, కానీ భారత్ మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా చౌక వస్తువుల వెల్లువలో దేశంలో చిరు వ్యాపారుల పరిస్థితి దెబ్బతింటుందంటూ ప్రధాని మోదీ ఇప్పటికే ఆర్సెప్ ఒప్పందంపై పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సీఈపీ) అంతర్జాతీయ సదస్సుకు ఈ సారి హైదరాబాద్ వేదికకానుంది. భారత్, ఆస్ట్రేలియా, చైనా తదితర 16 దేశాలకు చెందిన సుమారు 700 మంది అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. జూలై 24వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో వాణిజ్య, పరరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. ఆర్సీఈపీలో ఉన్న మొత్తం 16 సభ్య దేశాల ప్రతినిధులు తమ మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను పెంచే మార్గాలను చర్చిస్తారు. సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్యం పెంపునకు వస్తువులపై పన్నులను ఎత్తియడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఆర్సీఈపీ ప్రథమ సదస్సు 2012లో కాంబోడియాలో, గత ఏడాది ఫిలిప్పీన్స్‌లో జరిగాయి. ఈ ఏడాది సదస్సుతో చర్చలు ముగింపునకు రావచ్చని భావిస్తున్నారు.