న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్) ఒప్పందంపై భారత్ మరోసారి స్పందించింది. దేశ ప్రయోజనాల విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే ఆర్‌సెప్ ఒప్పందంలో చేరే విషయమై పునరాలోచిస్తామని విదేశాంగ శాఖ గురువారం పేర్కొంది. ఒప్పందానికి సంబంధించి భారత్ అభ్యంతరాలను పరిశీలిస్తామని, దేశీయ ఉత్పత్తులకు మరింత విస్తృత మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని సభ్య దేశాల నుంచి ప్రతిపాదన వస్తే చర్చల్లో పాల్గొంటామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూశ్ గోయల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్ అభ్యంతరాలేమిటో సభ్య దేశాలకు తెలుసని గురువారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్పష్టమైన రీతిలో వాదనలు వినిపించాం. ప్రయోజనాల విషయంలో హామీ లభిస్తే ఆర్‌సెప్‌లో చేరే నిర్ణయంపై పునరాలోచిస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment