కేంద్ర మంత్రి గోయల్ ప్రకటన
2 బిలియన్ డాలర్ల పెట్టుబడి
దేశ రైతులకు మెరుగైన ఆదాయానికి వెసులుబాటు
ఉపాధి అవకాశాలకూ బూస్ట్
ముంబై: భారత్–యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫుడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ క్యారిడార్ యూఏఈ ఆహార అవసరాలను తీర్చడంతోపాటు, అంతకుమించి భారతీయ రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి, దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తెలిపారు.
పెట్టుబడులపై భారత్–యూఏఈ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ 12వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో గోయల్ ఈ విషయాలు చెప్పారు. ఈ సమావేశానికి గోయల్‌తో పాటు అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నాహ్యాన్ కో–చెయిర్‌గా వ్యవహరించారు. స్థానిక కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు వర్చువల్ ట్రేడ్ కారిడార్ పనులు, అహ్మదాబాద్‌లో ఫుడ్ పార్క్ ఏర్పాటు మొదలైన అంశాలపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గోయల్ ఏమి చెప్పారంటే...
→ రెండు దేశాల మధ్య ఫుడ్ కారిడార్ స్థాపనను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు– యూఏఈతో కూడిన చిన్న వర్కింగ్ గ్రూప్ కూడా ఇప్పటికే ఏర్పాటయ్యింది.
→ భారతదేశంలో ఫుడ్ పార్కుల ఏర్పాటు గురించి చర్చించిన అంశాల్లో మరొకటి. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి జరిగింది. రైతులకు అధిక ఆదాయంతోపాటు లక్షలాది మందికి ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉద్యోగాలు కల్పించడానికి సహాయపడే అంశమిది. అలాగే యూఏఈ ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది.
→ ఫుడ్ క్యారిడార్ పెట్టుబడి వచ్చే రెండున్నరేళ్ల కాలంలో జరుగుతుందని అంచనా.
→ యూఏఈకి అనువైన అధిక నాణ్యతా ఉత్పత్తుల లభ్యత కోసం దేశంలో యూఏఈ భారీ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలను మెరుగుపరచాలన్నది గత ఎంతోకాలంగా చర్చిస్తున్న అంశం. ఇది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది.
→ తాజా పరిణామంతో దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో ఇతర గల్ప్ మార్కెట్లూ అనుసంధానమయ్యే అవకాశం ఉంది.
దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయం
భారత్‌లో పెట్టుబడులు చేయదల్చుకునే మదుపర్లకు సహాయకరంగా ఉండేలా దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పియుష్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కి (ఐఐఎఫ్‌టీ) సంబంధించి విదేశాల్లో తొలి క్యాంపస్‌ను కూడా దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) నివసించే 35 లక్షల మంది భారతీయులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment