‘ఆర్‌సీఈపీ’పై సంతకాలు | Asia-Pacific countries sign one of the largest free trade deals in history | Sakshi
Sakshi News home page

‘ఆర్‌సీఈపీ’పై సంతకాలు

Published Mon, Nov 16 2020 2:28 AM | Last Updated on Mon, Nov 16 2020 2:28 AM

Asia-Pacific countries sign one of the largest free trade deals in history - Sakshi

ఒప్పంద పత్రాన్ని చూపిస్తున్న చైనా వాణిజ్య మంత్రి ఝాంగ్‌ షాన్, ప్రధాని కెకియాంగ్‌

సింగపూర్‌: ప్రపంచంలోనే అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందంపై చైనా సహా 15 ఆసియా పసిఫిక్‌ దేశాలు ఆదివారం సంతకాలు చేశాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో దాదాపు మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(రీజనల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనమిక్‌ పార్ట్‌నర్‌షిప్‌– ఆర్‌సీఈపీ)’లో భారత్‌ భాగస్వామిగా లేదు. ఆర్‌సీఈపీపై సభ్య దేశాల మధ్య గత ఎనిమిదేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల నేతలు, వారి ప్రాంతీయ భాగస్వాముల మధ్య జరిగిన వార్షిక సదస్సు కోవిడ్‌–19 ముప్పు కారణంగా ఈ సంవత్సరం వర్చువల్‌గా జరిగింది.

సంతకాలు జరిగిన రెండేళ్లలోపు సభ్య దేశాలన్నీ ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత  ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాలు అత్యధిక రంగాల్లో వాణిజ్య పన్నులను క్రమంగా తగ్గించాల్సి ఉంటుంది. చైనా ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చల నుంచి భారత్‌ గత సంవత్సరం వైదొలగింది. వాణిజ్య పన్నుల తగ్గింపు వల్ల భారతీయ మార్కెట్‌ దిగుమతులతో పోటెత్తుతుందని, అది దేశీయ ఉత్పత్తులకు హానికరమవుతుందన్న ఆందోళనలతో భారత్‌ ఆ నిర్ణయం తీసుకుంది.

అయితే, భారత్‌ ఈ ఒప్పందంలో చేరేందుకు ఇంకా అవకాశాలున్నాయని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఆర్‌సీఈపీకి ప్రతిపాదన మొదట 2012లో వచ్చింది. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కోవిడ్‌ కారణంగా ఆర్‌సీఈపీ సభ్య దేశాలే కాకుండా దాదాపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ప్రస్తుత వర్చువల్‌ సదస్సు ఆతిథ్య దేశం వియత్నాం ప్రధానమంత్రి గ్యుయెన్‌ జువాన్‌ పేర్కొన్నారు.

బహుముఖ వాణిజ్య విధానానికి ‘ఆసియాన్‌’ నాయకత్వం వహిస్తోందన్న సందేశాన్ని ఈ ఒప్పందం ఇస్తోందన్నారు. సమీప భవిష్యత్తులో ఈ ఒప్పందంలో భారత్‌ కూడా భాగస్వామిగా చేరుతుందన్న విశ్వాసం ఉందని సింగపూర్‌ పీఎం లీ సీన్‌ లూంగ్‌ అన్నారు. భారత్‌ చేరికతో ఆసియాలో ప్రాంతీయ సహకారం, సమగ్రతకు సంపూర్ణ రూపం చేకూరుతుందన్నారు.  ఆర్‌సీఈపీ ప్రయోజనాలను ప్రజలు అర్థం చేసుకుని, ఈ ఒప్పందాన్ని వారు ప్రోత్సహించేలా చూడాలని సభ్యదేశాలను ఆయన కోరారు.  ఎనిమిదేళ్ల కఠోర కృషి అనంతరం ఈ ఒప్పందానికి తుది రూపు వచ్చిందని మలేసియా వాణిజ్య మంత్రి మొహ్మద్‌ అజ్మీన్‌ అలీ వ్యాఖ్యానించారు. ఈ ఆసియాన్‌ వర్చువల్‌ సదస్సు నాలుగు రోజుల పాటు జరిగింది. సౌత్‌ చైనా సీపై చైనా ఆధిపత్యాన్ని ఆసియాన్‌లోని అత్యధిక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement