Asia Pacific
-
ఏపీఏబీసీ ప్రెసిడెంట్‌గా హొర్మూజ్ మసానీ
న్యూఢిల్లీ: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ–ఇండియా) జనరల్ సెక్రెటరీ హొర్మూజ్ మసానీ వరుసగా ఐదోసారి ఏషియా పసిఫిక్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సరి్టఫికేషన్ (ఏపీఏబీసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సరి్టఫికేషన్ (ఐఎఫ్ఏబీసీ) సర్వసభ్య సమావేశంలో ఆయనను ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఆనరరీ ట్రెజరర్ హోదాలో ఐఎఫ్ఏబీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్‌గా కూడా మసానీ వరుసగా తొమ్మిదోసారి ఎన్నికయ్యారు. ఆయన 1998 నుంచి ఏబీసీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. 2008 నుంచి ఐఎఫ్ఏబీసీలో ఏబీసీ–ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్: టాప్-5లో హైదరాబాద్ ఉందా?
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఐదు అత్యుత్తమ పనితీరు చూపించిన నివాసిత ప్రాపర్టీ మార్కెట్లలో ముంబై, బెంగళూరు చోటు సంపాదించాయి. వార్షికంగా నివాస ధరల వృద్ధి ఈ రెండు పట్టణాల్లోనూ 7 శాతం మేర ఉంది. ‘ఆసియా పసిఫిక్ రెసిడెన్షియల్ రివ్యూ ఇండెక్స్’ వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. 2022 ద్వితీయ ఆరు నెలల కాలంలో వార్షిక ధరల వృద్ధి పరంగా టాప్-5లో బెంగళూరు, ముంబై ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం 23 పట్టణాలకు గాను 14 పట్టణాల్లో వార్షికంగా ధరలు పెరిగాయి. ఈ జాబితాలో వార్షికంగా 24 శాతం ధరల వృద్ధితో మెట్రో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. 9.3 శాతం ధరల వృద్ధితో సింగపూర్, 9 శాతం వృద్ధితో టోక్యో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగళూరు నాలుగో స్థానంలో నిలిచాయి. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 6.8 శాతం పెరగ్గా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టాప్–10లో చోటు సంపాదించుకుంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ మార్కెట్లలో వచ్చే 12 నెలల్లో ఇళ్ల ధరలు మోస్తరుగా ఉండొచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా వేస్తోంది. బెంగళూరులో ఇళ్ల ధరలు 3–5 శాతం మధ్య, ముంబై, ఢిల్లీలో 3–4 శాతం మధ్య పెరగొచ్చని పేర్కొంది. (ఇదీ చదవండి: పెంట్ హౌస్ రూ.240 కోట్లా.. ఎక్కడో తెలుసా?) -
దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్లీ గురూ!
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఖరీదైన ఆఫీస్ మార్కెట్లలో ఢిల్లీ–ఎన్సీఆర్ పదో స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. 2022 ఏప్రిల్–జూన్ కాలానికి సంబంధించి ప్రైమ్ ఆఫీస్ రెంటల్ ఇండెక్స్ గణాంకాలను విడుదల చేసింది. ఢిల్లీలో వాణిజ్య స్థలం చదరపు అడుగు లీజు రేటు ఏడాదికి 51.6 డాలర్లుగా (రూ.4,128) ఉన్నట్టు తెలిపింది. హాంగ్‌కాంగ్ అత్యంత ఖరీదైన ఆఫీస్ స్పేస్ మార్కెట్‌గా ఉంది. ఇక్కడ ఏడాదికి చదరపు అడుగు అద్దె 175.4 డాలర్లుగా ఉంది. ముంబై 11వ స్థానంలో నిలిచింది. ముంబైలో చదరపు అడుగు వాణిజ్య స్థలానికి లీజు రేటు 45.8 డాలర్లుగా (రూ.3,664) ఉంది. బెంగళూరులో చదరపు అడుగు లీజు రేటు ఏడాదికి 20.5 డాలర్లుగా (రూ.1,640) ఉండగా, ఇండెక్స్‌లో 22వ స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాదిలో బెంగళూరులో వాణిజ్య స్థలం లీజు రేటు 12 శాతం పెరిగినట్ట నైట్‌ఫ్రాంక్ తెలిపింది. కరోనా షాక్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడంతో, ఎన్నో రంగాల నుంచి కొత్త స్థలాల లీజుకు డిమాండ్ పెరిగినట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. ఈ ఇండెక్స్‌లో అత్యంత ఖరీదైన మార్కెట్లుగా సిడ్నీ, సింగపూర్, టోక్యో, హోచిమిన్ సిటీ, బీజింగ్, మెల్బోర్న్, పెర్త్, బ్రిస్బేన్ వరుసగా రెండు నుంచి తొమ్మిదో స్థానం వరకు ఉన్నాయి. -
‘ఆర్సీఈపీ’పై సంతకాలు
సింగపూర్: ప్రపంచంలోనే అతిపెద్దదైన వాణిజ్య ఒప్పందంపై చైనా సహా 15 ఆసియా పసిఫిక్ దేశాలు ఆదివారం సంతకాలు చేశాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో దాదాపు మూడో వంతుకు ప్రాతినిధ్యం వహించే ఈ ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్– ఆర్సీఈపీ)’లో భారత్ భాగస్వామిగా లేదు. ఆర్సీఈపీపై సభ్య దేశాల మధ్య గత ఎనిమిదేళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల నేతలు, వారి ప్రాంతీయ భాగస్వాముల మధ్య జరిగిన వార్షిక సదస్సు కోవిడ్–19 ముప్పు కారణంగా ఈ సంవత్సరం వర్చువల్‌గా జరిగింది. సంతకాలు జరిగిన రెండేళ్లలోపు సభ్య దేశాలన్నీ ఈ ఒప్పందాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాలు అత్యధిక రంగాల్లో వాణిజ్య పన్నులను క్రమంగా తగ్గించాల్సి ఉంటుంది. చైనా ప్రాబల్యం అధికంగా ఉండే ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చల నుంచి భారత్ గత సంవత్సరం వైదొలగింది. వాణిజ్య పన్నుల తగ్గింపు వల్ల భారతీయ మార్కెట్ దిగుమతులతో పోటెత్తుతుందని, అది దేశీయ ఉత్పత్తులకు హానికరమవుతుందన్న ఆందోళనలతో భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ ఈ ఒప్పందంలో చేరేందుకు ఇంకా అవకాశాలున్నాయని సభ్య దేశాలు పేర్కొన్నాయి. ఆర్సీఈపీకి ప్రతిపాదన మొదట 2012లో వచ్చింది. ప్రస్తుతం చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కోవిడ్ కారణంగా ఆర్సీఈపీ సభ్య దేశాలే కాకుండా దాదాపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ప్రస్తుత వర్చువల్ సదస్సు ఆతిథ్య దేశం వియత్నాం ప్రధానమంత్రి గ్యుయెన్ జువాన్ పేర్కొన్నారు. బహుముఖ వాణిజ్య విధానానికి ‘ఆసియాన్’ నాయకత్వం వహిస్తోందన్న సందేశాన్ని ఈ ఒప్పందం ఇస్తోందన్నారు. సమీప భవిష్యత్తులో ఈ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామిగా చేరుతుందన్న విశ్వాసం ఉందని సింగపూర్ పీఎం లీ సీన్ లూంగ్ అన్నారు. భారత్ చేరికతో ఆసియాలో ప్రాంతీయ సహకారం, సమగ్రతకు సంపూర్ణ రూపం చేకూరుతుందన్నారు. ఆర్సీఈపీ ప్రయోజనాలను ప్రజలు అర్థం చేసుకుని, ఈ ఒప్పందాన్ని వారు ప్రోత్సహించేలా చూడాలని సభ్యదేశాలను ఆయన కోరారు. ఎనిమిదేళ్ల కఠోర కృషి అనంతరం ఈ ఒప్పందానికి తుది రూపు వచ్చిందని మలేసియా వాణిజ్య మంత్రి మొహ్మద్ అజ్మీన్ అలీ వ్యాఖ్యానించారు. ఈ ఆసియాన్ వర్చువల్ సదస్సు నాలుగు రోజుల పాటు జరిగింది. సౌత్ చైనా సీపై చైనా ఆధిపత్యాన్ని ఆసియాన్‌లోని అత్యధిక దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. -
సింగపూర్‌ను దాటేసిన హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు సింగపూర్, హాంగ్‌కాంగ్‌లను దాటేశాయి. జులై – సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో ఈ మూడు నగరాల్లో 23 శాతం వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఆసియా పసిఫిక్ క్యూ3–2019 ఆఫీస్ రెంటల్ ఇండెక్స్ నివేదిక తెలిపింది బెంగళూరు తర్వాతే మెల్బోర్న్, బ్యాంకాక్.. 2019 క్యూ3లో ఆఫీస్ రెంట్స్ వృద్ధిలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో మెల్బోర్న్, మూడో స్థానంలో బ్యాంకాక్ నగరాలు నిలిచాయి. గతేడాదితో పోలిస్తే బెంగళూరులో అద్దెలు 17.6 శాతం వృద్ధి చెందగా.. మెల్బోర్న్లో 15.5 శాతం, బ్యాంకాక్‌లో 9.4 శాతం వృద్ధి నమోదైంది. నెల వారీ అద్దెలు చూస్తే.. ఖరీదైన అద్దెలున్న నగరాల్లో హాంగ్‌కాంగ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ నెల అద్దె చ.మీ.కు రూ.206.6 డాలర్లు. టోక్యోలో 11.9 డాలర్లు, సింగపూర్‌లో 80.5 డాలర్లుగా ఉంది. మన దేశంలో ఖరీదైన ఆఫీస్ అద్దె నగరాల్లో ప్రథమ స్థానంలో ఎన్సీఆర్ (ఆసియా పసిఫిక్ రీజియన్‌లో 5వ స్థానం), ముంబై (7వ స్థానం) నిలిచాయి. ఎన్సీఆర్లో నెలకు రూ.51.8 డాలర్లు, ముంబైలో 46.2 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 20.5 డాలర్లుగా ఉంది. 2020లో 50 మిలియన్ చ.అ. ఈ ఏడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 46.5 మిలియన్ చ.అ. నికర ఆఫీసు స్థల లావాదేవీలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, బెంగళూరు వాటా 70 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే ఐటీ, ఐటీఈఎస్ రంగాల వాటా 42 శాతంగా ఉంది. 2020లో 50 మిలియన్ చ.అ.ల ఆఫీసు స్థల లావాదేవీలు జరుగుతాయని నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది మన దేశంలో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు అత్యధికంగా జరిగిన నగరం బెంగళూరే. ఇక్కడ 2019లో 15 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి. ఐటీ, ఐటీఈఎస్ రంగాల వాటా 39 శాతంగా ఉంది. ఇంజనీరింగ్, తయారీ రంగాల వాటా 16 శాతంగా ఉంది. 2019లో కొత్తగా 10.9 మిలియన్ చ.అ. స్పేస్ జత అయింది. హైదరాబాద్‌లో 10.5 మిలియన్ చ.అ. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ లావాదేవీల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తుంది. మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీల వంటి కారణాలతో పాటూ అందుబాటులో స్థలాలు, తక్కువ అద్దెలు, నైపుణ్యమున్న ఉద్యోగులు తదితర కారణాలతో ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఆఫీస్ అద్దెలు వృద్ధి చెందుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది నగరంలో 10.5 మిలియన్ చ.అ. నికర ఆఫీసు స్థల లావాదేవీలు జరిగాయి. ఇందులో టెక్నాలజీ కంపెనీల వాటా 51 శాతం ఉంది. ఫ్లెక్సిబుల్ వర్క్‌ప్లేస్ వాటా నాలుగింతలు వృద్ధి చెంది 32 శాతం వద్ధ స్థిరపడింది. 2020లో హైదరాబాద్‌లో 13 మిలియన్ చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. -
ఇంతింత కాదయా...ఇంటి కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో, పనిచేసే చోట ఘాటైన వాసనలను పీల్చడం.. పెంపుడు జంతువుల వెంట్రుకలు.. దుప్పట్లు, దిండ్లపై ఉండే దుమ్ము.. మస్కిటో కాయిల్స్, సువాసన కోసం వాడే పెర్ఫ్యూమ్లు, పుప్పొడి రేణువులు, ధూమపానం.. అంతర్గత కాలుష్యానికి ఇవే ప్రధాన కారణాలట. ఆస్ప్రిన్, బీటాబ్లాకర్స్ వంటి మందులు వాడటం.. బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే రసాయనాలు కూడా అంతర్గత కాలుష్యానికి కారణమవుతున్నాయట. పారిశ్రామిక, వాహన కాలుష్యంతో పోలిస్తే.. ఇంట్లో వెలువడే కాలుష్యమే శ్వాసనాళాలపై ఎక్కువ ప్రభావం చూపుతోందని ఆసియా పసిఫిక్ ఆస్తమా ఇన్సైట్ అండ్ మేనేజ్మెంట్ (ఇండియా) సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఈ సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, నాగపూర్, ముంబై, చండీఘర్, సిమ్లా, గువాహటి, కోల్‌కతా, మైసూర్, తిరువనంతపురం, చెన్నై, సికింద్రాబాద్ తదితర నగరాల్లో శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగులపై సర్వే నిర్వహించింది. 85 వేల మంది పురుషులు, 85 వేల మంది మహిళలపై ఈ సర్వే చేసింది. ఇతర నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లోనే శ్వాస సంబంధ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. నగరంలో ఇప్పటికే పెద్దల్లో 5–8 శాతం మంది శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుంటే.. చిన్నారుల్లో 10–12 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. అంతర్గత కాలుష్యానికి ప్రస్తుతం వీస్తున్న చలిగాలులు తోడవడంతో ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తెలిపింది. వీటితోనూ ముక్కుకు ముప్పే.. గ్రేటర్లో 15 ఏళ్ల క్రితం 11 లక్షల వాహనాలు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 50 లక్షలకు చేరింది. ఇందులో పదిహేనేళ్ల సర్వీసు దాటిన వాహనాలు ఐదు నుంచి పది లక్షలు ఉన్నాయి. వీటికి తోడు మరో 40 వేల పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ఓజోన్ లెవల్స్ ఫర్ క్యూబిక్ మీటర్ గాలిలో 130–150 మైక్రో గ్రాములకుపైగా నమోదవుతోంది. సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు సైతం శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తున్నాయి. ఒక కాయిల్.. 90 సిగరెట్లతో సమానం.. దోమల నుంచి రక్షణ కోసం చాలామంది మస్కిటో కాయిల్స్ వాడుతున్నారు. ఒక మస్కిటో కాయిల్ 90 సిగరెట్లు వెదజల్లే పొల్యూషన్‌తో సమానం. ఈ గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు మందగిస్తుంది. ఊపిరితిత్తుల జీవితకాలం కూడా తగ్గుతుంది. మస్కిటో కాయిల్స్‌కు బదులు ఫ్యాన్ వాడటం ఉత్తమం. – డాక్టర్ పి.సుదర్శన్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి.. సువాసన కోసం వాడే కొన్ని రకాల పెర్ఫ్యూమ్లు, మస్కిటో కాయిల్స్ ఘాటైన వాసన వెదజల్లుతాయి. ఇవి శ్వాస నాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సాధ్యమైనంత వరకు తక్కువ ఘాటు ఉన్న పెర్ఫ్యూమ్లనే వాడాలి. కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువులను ఇంటి బయటే ఉండేలా చూసుకోవాలి. కార్పెట్లు, పరుపులు, దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్ల నుంచి వెలువడే వాసనలకు దూరంగా ఉండటం వల్ల శ్వాస సంబంధ సమస్యల నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ విజయ్‌కుమార్, శ్వాసకోశ వైద్యనిపుణుడు -
డ్రాగన్ దూకుడు అతిపెద్ద సవాల్..
వాషింగ్టన్: ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి డ్రాగన్ దూకుడు దీర్ఘకాలంలో అతిపెద్ద సవాల్ అని, ప్రస్తుతం ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా వ్యాఖ్యానించింది. ఇక అమెరికా సహా ఆసియా ఫసిఫిక్ దేశాలన్నింటినీ చైనా, ఉత్తర కొరియాల తర్వాత ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థల కార్యాకలాపాలు కలవరపరుస్తాయని అమెరికన్ కమాండర్ అడ్మిరల్ హ్యారీ హారిస్ అన్నారు. ఉత్తర కొరియా దుందుడుకు వైఖరి ఆందోళనకరమని, ఆసియాలో ఐసిస్ ఉనికి పెంచుకోవడం కలవరపరిచే అంశమని హ్యారీ వ్యాఖ్యానించారు. మరోవైపు చైనా తూర్పు, దక్షిణ సముద్ర ప్రాంతంలో చేపడుతున్న చర్యలు ఆక్షేపణీయమని అన్నారు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యూఎస్ కమాండర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
సంఘర్షణా.. సహకారమా?
ఆసియా పసిఫిక్ దేశాలకు ఒబామా ప్రశ్న బ్రిస్బేన్: ఉత్తర కొరియా, చైనాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘ఆసియా పసిఫిక్ దేశాలు సంఘర్షణను కోరుకుంటున్నాయా? లేక సహకారాన్నా?’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సూటిగా ప్రశ్నించారు. బ్రిస్బేన్‌లోని ఒక యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా.. ‘ఉత్తర కొరియా దుష్ట అణుకార్యక్రమం, పొరుగుదేశాలతో చైనా సరిహద్దు వివాదాలు వంటివి ఈ ప్రాంత(ఆసియా పసిఫిక్) అభివృద్ధి వేగాన్ని కుంటుపడేలా చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా నాయకత్వం అనేది తన విదేశాంగ విధానంలో అత్యంత కీలకమైన అంశమన్నారు. ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించేందుకు అనేక యుద్ధాల్లో తరతరాలుగా అమెరికన్లు ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. జపాన్, దక్షిణ కొరియా తదితర పొరుగుదేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో జరిపిన ఇటీవలి భేటీలోనూ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. -
కొత్త కొలువులకూ రూపాయి దెబ్బ
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యంగా భారత్‌లో కొత్త ఉద్యోగవకాశాలు ఏమంత ఆశావహంగా లేవని నిపుణులంటున్నారు. రూపాయి పతనమే దీనికి ప్రధాన కారణమని వారంటున్నారు. అయితే ముందు ముందు పరిస్థితులు మరింత అద్వానం అవుతాయని వారు హెచ్చరిస్తున్నారు. అంతకంతకూ బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి పతనం వంటి అంశాలు కంపెనీల లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో కంపెనీల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమై, ఆ ప్రభావం ఉద్యోగ నియామకాలపై పడుతోంది. ఉద్యోగులను తగ్గించుకోవాలనుకునే ఆలోచన్లేవీ కంపెనీలకు లేవని, అయితే కొత్త ఉద్యోగులను చేర్చుకోవడంపైననే కంపెనీలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని టవర్స్ వాట్సన్ ఇండియా టాలెంట్ అండ్ రివార్డ్స్ డెరైక్టర్ సుబీర్ బక్షి చెప్పారు. క్యాంపస్ హైరింగ్‌ల జోరు కూడా తగ్గవచ్చని వివరించారు. సాధారణంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆగస్ట్-నవంబర్ కాలం కీలకమైనదని, కానీ ఈ ఏడాది అలాంటిదేమీ లేదని ఆయన పేర్కొన్నారు. రూపాయి పతనం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని, హైరింగ్ తగ్గుతుం దని జెనిసిస్ సీఈవో ప్రశాంత్ లోహియా చెప్పారు.