ఆసియా పసిఫిక్ దేశాలకు ఒబామా ప్రశ్న
బ్రిస్బేన్: ఉత్తర కొరియా, చైనాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘ఆసియా పసిఫిక్ దేశాలు సంఘర్షణను కోరుకుంటున్నాయా? లేక సహకారాన్నా?’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సూటిగా ప్రశ్నించారు. బ్రిస్బేన్‌లోని ఒక యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా.. ‘ఉత్తర కొరియా దుష్ట అణుకార్యక్రమం, పొరుగుదేశాలతో చైనా సరిహద్దు వివాదాలు వంటివి ఈ ప్రాంత(ఆసియా పసిఫిక్) అభివృద్ధి వేగాన్ని కుంటుపడేలా చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా నాయకత్వం అనేది తన విదేశాంగ విధానంలో అత్యంత కీలకమైన అంశమన్నారు. ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించేందుకు అనేక యుద్ధాల్లో తరతరాలుగా అమెరికన్లు ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. జపాన్, దక్షిణ కొరియా తదితర పొరుగుదేశాలతో చైనా దుందుడుకు వైఖరిపై చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో జరిపిన ఇటీవలి భేటీలోనూ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు.