అమెరికాను మళ్లీ కలవరపెడుతోన్న హింస!
శ్వేతజాతీయవాదుల హింస అమెరికాను మళ్లీ కలవరపెడుతోంది. కిందటి శనివారం వర్జీనియా రాష్ట్రంలోని షార్లట్స్విల్ నగరంలో తెల్లజాతి అమెరికన్ల దాడుల్లో ప్రాణనష్టం జరగడంతోపాటు వారి నిరసన ప్రదర్శనలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో అన్ని రంగుల జాతుల ప్రజలకు ‘అవకాశాల స్వర్గధామం’గా పరిగణించే దేశంలో జాతుల సహజీవనం ప్రమాదంలో పడిందనే అభిప్రాయం నెలకొంది. షార్లట్స్విల్ హింసలో ముగ్గురు మరణించారు. 34 మంది గాయపడ్డారు.
శ్వేతజాత్యహంకారుల దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించకుండా హింసకు అన్ని వర్గాలదీ బాధ్యత అన్నట్టు మాట్లాడడం కూడా అమెరికా ఉదారవాదాన్ని నమ్మే ప్రజాస్వామ్యవాదులకు మింగుడుపడడంలేదు. 2008 నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతికి చెందిన బరాక్ ఒబామా విజయంతో దేశంలో జాతివివక్ష అంతమైందనే వాదనను తెల్లజాతి మేధావులు ముందుకు తెచ్చారు. వాస్తవానికి రంగు, జాతి వంటి అంశాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు అందించే ప్రక్రియ ముందుకుసాగడం వారికి ఇష్టంలేదు. అనేక రంగాల్లో శ్వేతజాతేతరులు రాణించడం, పరిమిత సంఖ్యలోనైనా కీలక పదవులు చేపట్టడం, ఆసియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలోకి వలసలు పెరగడం-వీటన్నిటికి తోడు ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో తమ దేశంలో తమకే అన్యాయం జరుగుతోందన్న భావన తెల్లజాతి అమెరికన్లలో బలపడింది.
ఒబామా గెలుపుతో పెరిగిన హింస!
2009 జనవరిలో తొలి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షునిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ నల్లజాతివారిపై దాడులు పెరిగాయి. అన్నిటికన్నా పెద్ద హత్యాకాండ 2015 జూన్లో సౌత్కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్లో జరిగింది. ఇక్కడ ఆఫ్రికన్ అమెరికన్లు అధికంగా ఉండే చర్చిపై డిలన్ స్టామ్ రూఫ్ అనే యువకుడు విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 9 మంది నల్లజాతివారు మరణించారు. ఏడాదిన్నర విచారణ తర్వాత శ్వేతజాత్యహంకార గ్రూపునకు చెందిన తీవ్రవాదిగా భావిస్తున్న రూఫ్కు కోర్టు మరణశిక్ష విధించింది. 2044 నాటికి అమెరికాలో తెల్లజాతి అల్పసంఖ్యాకవర్గంగా (జనాభాలో ఇప్పుడున్న69 శాతం నుంచి 50 శాతం దిగువకు) మారిపోతుందనే అంచనాలతోపాటు, 21వ శతాబ్దంలో పెరిగిన శ్వేతజాతేతర ప్రజల వలసలు తెల్లజాతి అమెరికన్లను 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు పలికేలా చేశాయి.
ట్రంప్ అధికారంలోకి వచ్చినాగాని తెల్లజాతివారంతా కలిసి లేరనే భావనతో వారందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో శ్వేతజాతీయవాదులు షార్లట్స్విల్ వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు. 19వ శతాబ్దంలో జరిగిన అమెరికా అంతర్యుద్ధంలో బానిస వ్యవస్థ రద్దును వ్యతిరేకించిన కాన్ఫడరేట్ శక్తుల నేతలే... ఇప్పటి క్లూక్లక్స్ క్లాన్, నయా నాజీలు వంటి శ్వేతజాత్యాంహకార గ్రూపులకు ఆరాధ్య దైవాలుగా మరారు. సమానత్వానికి, మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులైన ఈ కాన్ఫెడరేట్ సేనల నేతల విగ్రహాలు, స్మారకచిహ్నాలు తొలగించడాన్ని ఈ శ్వేతజాత్యాంహకారులు పెద్ద పాపంగా పరిగణించి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే షార్లట్స్విల్ ఘటన జరిగింది.
శ్వేతజాత్యహంకారవాదులు ఎంత మంది?
అమెరికా తెల్లజాతివారిదనే వాదనకు శతాబ్దాల చరిత్ర ఉన్నా ఈ సిద్ధాంతాన్ని బలపరిచే గ్రూపుల సంఖ్యను ఖచ్చితంగా అంచనావేయడం కష్టం. దేశంలో ఇలాంటి అతివాద, జాత్యాహంకార సంస్థలు 1600 వరకు ఉన్నాయని అమెరికా పౌరహక్కుల సంస్థ సదరన్ పోవర్టీ లా సెంటర్ అంచనావేసింది. 1865 అంతర్యుద్ధంలో బానిసత్వం రద్దుకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల కాన్ఫెడరేట్ సైన్యంలో పనిచేసిన శ్వేతజాతి మాజీ సైనికాధికారులు క్లూక్లక్స్క్లాన్(కేకేకే) పేరుతో తొలి రహస్య సంస్థను స్థాపించారు. తర్వాత ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. దీని నుంచే అనేక శ్వేతజాత్యహంకార గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఈ గ్రూపుల్లో మొత్తం సభ్యులు ఐదు వేల నుంచి 8 వేల మధ్య ఉంటారని అంచనా.
కాన్ఫెడరేట్ వైట్ నైట్స్, ట్రెడిషనలిస్ట్ అమెరికన్ నైట్స్, నేషనల్ సోషలిస్ట్ మూవ్మెంట్, అమెరికన్ఫ్రీడం పార్టీ -ఇలా అనేక పేర్లతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఆర్థిక జాతీయవాదం, స్థానిక అమెరికన్ల ప్రయోజనాలకు మద్దతుగా మాట్లాడే ట్రంప్ విజయం సాధించాక తమ సంస్థలో సభ్యులుగా చేరేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని కేకేకే 2016లో ప్రకటించింది. షార్లట్స్విల్లో కాన్ఫెడరేట్ సేనాని రాబర్ట్ లీ విగ్రహం తొలగింపునకు నిరసనగా శ్వేతజాతివారందరినీ ఏకం చేయడానికి ఈ నెల 12న జరిగిన ర్యాలీ, దానికి పోటీగా జరిపిన ప్రదర్శన (విగ్రహం తొలగింపును సమర్థిస్తూ)తో హింస చెలరేగింది. ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించటం కలవరపాటుకు గురిచేస్తోంది. విద్వేషపూరిత దాడులు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది.
తెల్లజాతివారి ఆధిపత్యానికి చిహ్నంగా భావించే కాన్ఫెడరేట్ శక్తులకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల, సంస్థల విగ్రహాలు, స్మారకచిహ్నాలు బహిరంగ ప్రదేశాల్లో దేశవ్యాప్తంగా 1500కు పైగా ఉన్నాయి. వీటి తొలగింపునకు లిబరల్స్ పట్టుబడుతుంటే శ్వేతజాతీయవాదులు వారిని ప్రతిఘటిస్తున్నారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్