ఈ రెండు నెలల్లో ట్రంప్‌కు ముప్పుందా?
ట్రంప్ విషయంలో ఏమీ జరుగకపోవచ్చు!
Published Thu, Nov 10 2016 6:05 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
న్యూయార్క్: అమెరికా అంతర్జాతీయ ట్రేడ్ సెంటర్‌పై లోహ విహంగాలు దాడి చేస్తాయని, ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు పెరుగుతారని, సునామీ వచ్చి వేలాది మంది చనిపోతారని కచ్చితంగా జోస్యం చెప్పిన బల్గేరియా ప్రవక్త బాబా వాంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వర్గీయుల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.
అమెరికా 44వ అధ్యక్షుడిగా ఆఫ్రికన్–అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని మరో నాస్ట్రాడామస్‌గా పేరుపొందిన బాబా వాంగా వినిపించిన భవిష్యవాణి అంతరార్థం ఎమిటన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆమె చెప్పినట్లుగానే బరాక్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరీ ఆయన ఆఖరి అధ్యక్షుడవుతారంటే ఏమిటి? 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటికీ ఆయన వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారనే విషయం తెల్సిందే. అప్పటి వరకు బరాక్ ఒబామే దేశాధ్యక్షుడు.
అప్పటివరకు దేశంలో ఏమైనా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా? ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినందున ఇస్లామిక్ టెర్రరిస్టులు ఆయనపై దాడులు చేసే అవకాశం ఉందా? లేక ఆయనే దేశాధ్యక్ష వ్యవస్థను మార్చేసి మరో వ్యవస్థను తీసుకొస్తారా, అందుకు అమెరికా పార్లమెంట్ రాజ్యాంగ వ్యవస్థ అనుమతిస్తుందా ? రష్యాలో కొన్ని వర్గాలు భావిస్తున్నట్లుగా మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా? అందులో అమెరికా అధ్యక్ష వ్యవస్థ కుప్పకూలి పోతుందా? ఇంకేమీ అనూహ్య పరిణామాలు జరగవచ్చనే సందేహాలు అమెరికన్లతోపాటు పలు దేశాల ప్రజల్లో కలుగుతున్నాయి.
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు బాబా వాంగా ఇప్పుడు బతికి లేరు. గుడ్డి బాబాగా కూడా గుర్తింపు పొందిన ఆమె 1996లోనే తన 85వ ఏటా మరణించారు. ప్రపంచ పరిణామాల గురించి 1950 నుంచి ఆమె వినిపించిన భవిష్య వాణిలో 85 శాతం నిజం అయ్యాయి. దాంతో ఆమె వ్యాఖ్యలపై ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం కుదిరింది. భూగోళంపైనా శీతల ప్రాంతాలు వేడెక్కుతాయి. అగ్ని పర్వతాలు మేల్కొంటాయని, సముద్ర తీరాన అతి పెద్ద వలలొచ్చి ఇళ్లను, ఊళ్లను ముంచేస్తుందని, ప్రతిదీ నీట మునిగి పోతుందని 1950వ దశకంలో వాంగా జోస్యం చెప్పారు.
ఆమె జోస్యం ప్రకారమే 2004, డిసెంబర్ 26నాడు సుమత్రా దీవుల్లో (ఇండోనేషియా) సునామీ వచ్చిందని అంటారు. అప్పుడు 9.3 తీవ్రతతో భూకంపం రావడం వల్ల సముద్రపు అలలు దాదాపు వంద అడుగుల వరకు విరుచుకుపడడంతో 14 దేశాల తీర ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 2,30,000 మంది మరణించారు. ఇప్పటి వరకు చరిత్రలోనే అదే అత్యంత ప్రళయంగా చరిత్రకారులు కూడా చెబుతున్నారు. ‘అమెరికా సోదరులపై లోహ విహంగాలు దాడి చేస్తాయి. పొదల్లో నుంచి తోడేళ్ల అరుపులు వినిపిస్తాయి. అమాయకుల రక్తపాతం జరుగుతుంది’ అని వాంగా 1989లో జోస్యం చెప్పారు. అమెరికా ట్రేడ్ సెంటర్‌పై జరిగిన 9–11 దాడుల గురించే ఆమె ప్రస్తావించారని అంటారు. 2016లో యూరప్ దేశాలపై ముస్లింలు దాడులు చేస్తారని కూడా ఆమె చెప్పారు.
‘దశాబ్దం అంతంలో రష్యా జలాంతర్గామిలోకి నీళ్లు జొరబడుతాయి. ప్రపంచ ప్రజలంతా తల్లడిల్లుతారు’ అని వాంగా 1980 దశకంలో జోస్యం చెప్పారు. 2000 సంవత్సరంలో కుర్స్క్ అనే రష్యా అణు జలాంతర్గామిలోకి అన్ని వైపుల నుంచి నీళ్లు జొరబడి మునిగిపోతుండగా, దాన్ని మునగకుండా రక్షించేందుకు అంతర్జాతీయ రిస్క్ టీమ్ తీవ్రంగా కృషి చేసింది. ఈ విషయంలో కూడా ఆమె జోస్యం అక్షరాల నిజమైందని అన్వయించి చెప్పేవాళ్లు, నమ్మే వాళ్లు ప్రపంచంలో ఎక్కువగానే ఉన్నారు.
అమెరికా భవిష్యత్ గురించి వాంగా ఒక్కరే కాదు, ‘స్ట్రాట్‌ఫర్’ అనే ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ కూడా భవిష్య వాణిని వినిపించింది. ఇదివరకటిలా అమెరికా ప్రపంచ పరిణామాలపై అంతగా దృష్టిని పెట్టదని దేశ ఆర్థిక, సైనిక అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆ సంస్థ తెలిపింది. ఈ రెండు అంశాలకు తాను ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెప్పడం ఇక్కడ గమనార్హం. వాంగా చెప్పినట్లు ట్రంప్ విషయంలో ఏమీ జరుగకపోవచ్చు! ఎందుకంటే ఆమె చెప్పిన వాటిలో 15 శాతం నిజం కాలేదుకదా!
Advertisement
Advertisement