'నేను బరిలో ఉంటే.. ట్రంప్‌కు నో ఛాన్స్'
వాషింగ్టన్: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి స్పందించారు. తనకు మూడోసారి పోటీచేసే అవకాశం ఉంటే కనుక కచ్చితంగా తానే ఈ ఎన్నికల్లో విజయం సాధించేవాడినని ఒబామా అభిప్రాయపడ్డారు. ఓ టీవీ కార్యక్రమంలో సోమవారం పాల్గొన్న సందర్భంగా తన మనసులో భావాలను ఆయన పంచుకున్నారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై తనకు పోటీ చేసే లేకపోవడంతో మూడోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేక పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ట్రంప్ కూడా ఘాటుగా ట్వీట్ చేశారు. ఒబామా అలాగే చెబుతారు కానీ, ఆయన మరోసారి గెలిచే ఛాన్సే లేదని.. ఒబాబా వ్యాఖ్యలను కొట్టిపారేశారు. అందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం, నిరుద్యోగం సమస్యలు కారణాలుగా ట్రంప్ ఎత్తిచూపారు.
అధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాలు, మార్పులపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఒబాబా చెప్పారు. 2008లో గెలిపించడమే తనపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని, ఎన్నికల సమయంలో ఎఫ్‌బీఐ స్టేట్‌మెంట్ వెల్లడికావడమే హిల్లరీకి ప్రతికూల ఫలితాలను ఇచ్చిందన్నారు. ఎంతో ఒత్తిడిలో కూడా హిల్లరీ చాలా బాగా బరిలో కొనసాగారని ప్రశంసించారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో భిన్న కోణాల్లో విడిపోయిన అమెరికా ప్రజలంతా నేటి నుంచి సహోదర భావంతో మెలగాలని ఒబామా ఆకాంక్షించారు. క్రిస్మస్ సందేశం సందర్భంగా మాట్లాతూ.. గత ఎనిమిదేళ్లుగా అమెరికా ప్రజలకు సేవ చేయడమన్నది మిచెల్లీ, తాను పొందిన గొప్ప గిఫ్ట్ అని ఒబామా పేర్కొన్న విషయం తెలిసిందే.