ప్రతి అడుగులో ఉంటా: ఒబామా
అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేముందు బరాక్ ఒబామా అమెరికా ప్రజలకు అధ్యక్ష స్థానంలో చివరిసారిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీడ్కోలు సందేశమిచ్చారు. అమెరికా ప్రజల ప్రతి అడుగులోనూ తానుంటానని ఉద్ఘాటించారు. అమెరికా ప్రజలు తనను మంచి మనిషిగా, మంచి అధ్యక్షునిగా తయారు చేశారని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలకు ఆయన శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తనకు మంచి తోడ్పాటునందించారం టూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ట్రంప్ కోసం వైట్‌హౌస్ సిద్ధం
వాషింగ్టన్: కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిరుచులకు తగ్గట్లు శ్వేతసౌధంలో మార్పుచేసే పని మొదలైంది. అధ్యక్షుడు తినే అల్పాహారం నుంచి సౌందర్య సాధనాలు, అలంకరణ సామగ్రి, శరీర సంరక్షణకు ఉపయోగించే వస్తువుల వరకు అన్నింటినీ కొత్త వాటితో నింపేశారు. శ్వేతసౌధాన్ని ఖాళీ చేసిన పాత అధ్యక్షుడు ఒబామా, అక్కడికి రెండు మైళ్ల దూరంలో ఉన్న ఇంటిలోకి మారిపోయారు. తన చిన్న కూతురు పాఠశాల చదువు పూర్తయ్యే వరకు ఒబామా కుటుంబం వాషింగ్టన్‌లోనే ఉండనుంది.
వేడుకల్లో తొలి ప్రదర్శన భారతీయ–అమెరికన్‌దే
ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకలను భారత సంతతి డీజే/డ్రమ్మర్ రవి జఖోటియా తన ప్రదర్శనతో ప్రారంభించారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్‌లో వేలాది మంది ముందు ఆయన ప్రదర్శన ఇచ్చారు. బాలీవుడ్ నటి మనస్వి మంగై నేషనల్ మాల్‌లో ప్రదర్శన ఇచ్చారు. జయహో సహా పలు బాలీవుడ్ పాటలకు ఆమె నాట్యం చేశారు.
ట్రంప్ ప్రార్థనల్లో హిందూ పూజారి
అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం జరిగే జాతీయ ప్రార్థనల్లో ఓ హిందూ పూజారి పాల్గొననున్నారు. వివిధ మతాల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రార్థనల్లో పూజారి నారాయణాచార్ హిందూమతానికి ప్రాతినిధ్యం వహిస్తారని అధ్యక్ష వేడుకల నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది.