Hate crimes
-
జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కెనడాలోని భారతీయులు, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్రం శుక్రవారం కీలక సూచనలు చేసింది. కెనడాలో విద్వేష దాడులు, భారతీయులను లక్ష్యంగా చేసుకుని నేరాలు, హింస పెరుగుతోందని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశంలో ఉన్న భారతీయులు, భవిష్యత్తులో అక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. భారతీయులు లక్ష్యంగా కెనడాలో జరుగుతున్న దాడులపై ఆ దేశంతో చర్చించినట్లు కేంద్రం పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటివరకు జరిగిన నేరాల్లో ఒక్క బాధ్యుడ్ని కూడా శిక్షించలేదని గుర్తుచేసింది. సిక్కులకు ప్రత్యేక దేశం కోరతూ ఖలిస్థాన్ అనుకూల శక్తులు కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారీ తీసిన సమయంలోనే కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉగ్రవాద, రాడికల్ శక్తుల హాస్యాస్పద చర్యగా అభివర్ణించారు. భారత్‌తో మంచి సంబంధాలున్న దేశం దీన్ని అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడాలో 16 లక్షల మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. ఈ సంఖ్య ఆ దేశ జనాభాలో మూడు శాతం. అయితే ఇటీవల కాలంలో అక్కడ జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయి. భారతీయులు లక్ష్యంగా దుండగులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక సూచనలు చేసింది. చదవండి: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి -
అమెరికాను మళ్లీ కలవరపెడుతోన్న హింస!
శ్వేతజాతీయవాదుల హింస అమెరికాను మళ్లీ కలవరపెడుతోంది. కిందటి శనివారం వర్జీనియా రాష్ట్రంలోని షార్లట్స్విల్ నగరంలో తెల్లజాతి అమెరికన్ల దాడుల్లో ప్రాణనష్టం జరగడంతోపాటు వారి నిరసన ప్రదర్శనలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో అన్ని రంగుల జాతుల ప్రజలకు ‘అవకాశాల స్వర్గధామం’గా పరిగణించే దేశంలో జాతుల సహజీవనం ప్రమాదంలో పడిందనే అభిప్రాయం నెలకొంది. షార్లట్స్విల్ హింసలో ముగ్గురు మరణించారు. 34 మంది గాయపడ్డారు. శ్వేతజాత్యహంకారుల దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించకుండా హింసకు అన్ని వర్గాలదీ బాధ్యత అన్నట్టు మాట్లాడడం కూడా అమెరికా ఉదారవాదాన్ని నమ్మే ప్రజాస్వామ్యవాదులకు మింగుడుపడడంలేదు. 2008 నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతికి చెందిన బరాక్ ఒబామా విజయంతో దేశంలో జాతివివక్ష అంతమైందనే వాదనను తెల్లజాతి మేధావులు ముందుకు తెచ్చారు. వాస్తవానికి రంగు, జాతి వంటి అంశాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు అందించే ప్రక్రియ ముందుకుసాగడం వారికి ఇష్టంలేదు. అనేక రంగాల్లో శ్వేతజాతేతరులు రాణించడం, పరిమిత సంఖ్యలోనైనా కీలక పదవులు చేపట్టడం, ఆసియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలోకి వలసలు పెరగడం-వీటన్నిటికి తోడు ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో తమ దేశంలో తమకే అన్యాయం జరుగుతోందన్న భావన తెల్లజాతి అమెరికన్లలో బలపడింది. ఒబామా గెలుపుతో పెరిగిన హింస! 2009 జనవరిలో తొలి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షునిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ నల్లజాతివారిపై దాడులు పెరిగాయి. అన్నిటికన్నా పెద్ద హత్యాకాండ 2015 జూన్‌లో సౌత్కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్లో జరిగింది. ఇక్కడ ఆఫ్రికన్ అమెరికన్లు అధికంగా ఉండే చర్చిపై డిలన్ స్టామ్ రూఫ్ అనే యువకుడు విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 9 మంది నల్లజాతివారు మరణించారు. ఏడాదిన్నర విచారణ తర్వాత శ్వేతజాత్యహంకార గ్రూపునకు చెందిన తీవ్రవాదిగా భావిస్తున్న రూఫ్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. 2044 నాటికి అమెరికాలో తెల్లజాతి అల్పసంఖ్యాకవర్గంగా (జనాభాలో ఇప్పుడున్న69 శాతం నుంచి 50 శాతం దిగువకు) మారిపోతుందనే అంచనాలతోపాటు, 21వ శతాబ్దంలో పెరిగిన శ్వేతజాతేతర ప్రజల వలసలు తెల్లజాతి అమెరికన్లను 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు పలికేలా చేశాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినాగాని తెల్లజాతివారంతా కలిసి లేరనే భావనతో వారందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో శ్వేతజాతీయవాదులు షార్లట్స్విల్ వేదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు. 19వ శతాబ్దంలో జరిగిన అమెరికా అంతర్యుద్ధంలో బానిస వ్యవస్థ రద్దును వ్యతిరేకించిన కాన్ఫడరేట్ శక్తుల నేతలే... ఇప్పటి క్లూక్లక్స్ క్లాన్, నయా నాజీలు వంటి శ్వేతజాత్యాంహకార గ్రూపులకు ఆరాధ్య దైవాలుగా మరారు. సమానత్వానికి, మానవత్వానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులైన ఈ కాన్ఫెడరేట్ సేనల నేతల విగ్రహాలు, స్మారకచిహ్నాలు తొలగించడాన్ని ఈ శ్వేతజాత్యాంహకారులు పెద్ద పాపంగా పరిగణించి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే షార్లట్స్విల్ ఘటన జరిగింది. శ్వేతజాత్యహంకారవాదులు ఎంత మంది? అమెరికా తెల్లజాతివారిదనే వాదనకు శతాబ్దాల చరిత్ర ఉన్నా ఈ సిద్ధాంతాన్ని బలపరిచే గ్రూపుల సంఖ్యను ఖచ్చితంగా అంచనావేయడం కష్టం. దేశంలో ఇలాంటి అతివాద, జాత్యాహంకార సంస్థలు 1600 వరకు ఉన్నాయని అమెరికా పౌరహక్కుల సంస్థ సదరన్ పోవర్టీ లా సెంటర్ అంచనావేసింది. 1865 అంతర్యుద్ధంలో బానిసత్వం రద్దుకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల కాన్ఫెడరేట్ సైన్యంలో పనిచేసిన శ్వేతజాతి మాజీ సైనికాధికారులు క్లూక్లక్స్‌క్లాన్(కేకేకే) పేరుతో తొలి రహస్య సంస్థను స్థాపించారు. తర్వాత ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. దీని నుంచే అనేక శ్వేతజాత్యహంకార గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఈ గ్రూపుల్లో మొత్తం సభ్యులు ఐదు వేల నుంచి 8 వేల మధ్య ఉంటారని అంచనా. కాన్ఫెడరేట్ వైట్ నైట్స్, ట్రెడిషనలిస్ట్ అమెరికన్ నైట్స్, నేషనల్ సోషలిస్ట్ మూవ్మెంట్, అమెరికన్ఫ్రీడం పార్టీ -ఇలా అనేక పేర్లతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఆర్థిక జాతీయవాదం, స్థానిక అమెరికన్ల ప్రయోజనాలకు మద్దతుగా మాట్లాడే ట్రంప్ విజయం సాధించాక తమ సంస్థలో సభ్యులుగా చేరేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని కేకేకే 2016లో ప్రకటించింది. షార్లట్స్విల్లో కాన్ఫెడరేట్ సేనాని రాబర్ట్ లీ విగ్రహం తొలగింపునకు నిరసనగా శ్వేతజాతివారందరినీ ఏకం చేయడానికి ఈ నెల 12న జరిగిన ర్యాలీ, దానికి పోటీగా జరిపిన ప్రదర్శన (విగ్రహం తొలగింపును సమర్థిస్తూ)తో హింస చెలరేగింది. ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించటం కలవరపాటుకు గురిచేస్తోంది. విద్వేషపూరిత దాడులు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. తెల్లజాతివారి ఆధిపత్యానికి చిహ్నంగా భావించే కాన్ఫెడరేట్ శక్తులకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల, సంస్థల విగ్రహాలు, స్మారకచిహ్నాలు బహిరంగ ప్రదేశాల్లో దేశవ్యాప్తంగా 1500కు పైగా ఉన్నాయి. వీటి తొలగింపునకు లిబరల్స్ పట్టుబడుతుంటే శ్వేతజాతీయవాదులు వారిని ప్రతిఘటిస్తున్నారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అమెరికాలో పెరిగిన విద్వేష నేరాలు
న్యూయార్క్: అమెరికాలో విద్వేష గ్రూపుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. 2015 సంవత్సరంలో అమెరికాలో 892 విద్వేశ గ్రూపులు ఉండగా, వాటి సంఖ్య 2016 నాటికి 917కు చేరుకుందని సదరన్ పావర్టీ లా సెంటర్ (ఎస్‌పీఎల్‌సీ) పర్యవేక్షక సంస్థ వెల్లడించింది. ఇక 1999 సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ విద్వేష గ్రూపుల సంఖ్య దాదాపు రెట్టింపు పెరిగాయి. ఈ గ్రుపుల్లో ఎక్కువగా ముస్లిం వ్యతిరేక, విదేశాల నుంచి వలసల వ్యతిరేక, ఎల్జీబీటీ వ్యతిరేక, శ్వేత జాతీయవాద, నయా నాజిజం, నయా కానిఫడరేట్, నల్లజాతీయుల వేర్పాటువాద గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. గతంతో పోలిస్తే కూ, క్లక్స్, క్లా (క్లాన్), ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, వివిధ రాజకీయ గ్రూపుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ముస్లిం వ్యతిరేక గ్రూపుల సంఖ్య మునుపెన్ననడు లేనివిధంగా పెరిగింది. గతంతో 37 ముస్లిం వ్యతిరేక గ్రూపులు ఉండగా, వాటి సంఖ్య 101కి చేరుకుంది. ఒక్క ఏడాది కాలంలోనే వీటి సంఖ్య 197 శాతం పెరగడం గమనార్హం. 2014 సంవత్సరంతో పోలిస్తే 2015 సంవత్సరంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడుల సంఖ్య ఏకంగా 67 శాతం పెరిగిందని ఎఫ్‌బీఐ లెక్కలు తెలియజేస్తున్నాయి. ముస్లింలలో సంయమనం చాలా తక్కువని, హింస ఎక్కువని, హేతువాదులు కాదని, పిల్లల పట్ల లైంగిక వాంఛ ఎక్కువని, స్వలింగ సంపర్కులనే అభిప్రాయాలు ఎక్కువగా ఉండడం వల్లనే వారిని ద్వేషించే గ్రూపులు పెరుగుతున్నాయని ఎస్‌పీఎల్‌సీ పేర్కొంది. మన్హట్టన్లో ఇస్లామిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, 2010లో ముస్లింలకు వ్యతిరేకమైన చట్టం తీసుకరావడం కూడా ఈ గ్రూపులు పెరగడానికి కారణమైంది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక అమెరికాలో విద్వేష నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే 1372 విద్వేష నేరాలు జరిగాయి. వాటిలో 25 శాతం విదేశీయుల వలసలకు వ్యతిరేకంగానే జరిగాయి. వాటిలో ఆఫ్రికన్ అమెరికన్లకు వ్యతిరేకంగా తొమ్మిది శాతం, ఎల్జీబీటీకి వ్యతిరేకంగా పది శాతం, ముస్లింలు లక్ష్యంగా తొమ్మిది శాతం దాడులు జరిగాయి. -
అమెరికాలో మరో విద్వేష దాడి
-
అమెరికాలో ఎన్నారై సూపర్ మార్కెట్‌కు నిప్పు!
ప్లోరిడా: అగ్రరాజ్యంలో జాత్యంహకార దాడులు ఆగడం లేదు. కూఛిబొట్ల, పటేల్ ఘటనలను మరవకముందు తాజాగా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. దానిని కాల్చివేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, ఆ స్టోర్ భారత సంతతి పౌరులదని తనకు తెలియదని, అరబ్ ముస్లింలది అని అనుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలను అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి తొలుత దాడులు భారతీయులపైనే ఎక్కువవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. రిచర్డ్ లాయిడ్ అనే 64 ఏళ్ల వ్యక్తి దర్జాగా దుకాణానికి నిప్పుపెట్టి చేతులు వెనక్కి పెట్టుకొని అది తగులబడుతుంటే నవ్వుతూ నిల్చున్నాడు. తమ దేశంలో అరబ్ దేశాలకు చెందిన ముస్లిలు అస్సలు ఉండొద్దనేది తన కోరిక అని, అందుకే దుకాణాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించానని చెప్పాడు. తనను అరెస్టు చేసుకోవచ్చంటూ పోలీసులకు స్వయంగా చెప్పాడు. ఇతడి వ్యాఖ్యలపై స్థానిక అధికారులు విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. భారతీయ సంతతి ప్రాసిక్యూటర్ తొలగింపు అత్యున్నతస్థాయి ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఒకరిని ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. భారతీయ సంతతికి చెందిన ప్రీత్ బరార్ను బలవంతంగా తొలగించింది. ‘నేను రాజీనామా చేయడానికి తిరస్కరించాను. ట్రంప్ వర్గం నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నాకు ఎటువంటి సమాచారం అందజేయకుండానే పదవి నుంచి తొలగించారు. అమెరికా అటార్నీగా పనిచేయడాన్ని నేను గౌరవంగా భావిస్తాను. తాను పోస్టులో కొనసాగుతానని ఎన్నికల తర్వాత ట్రంప్‌ను కలిసి చెప్పారు. అప్పట్లో ఆయన దీనికి అంగీకరించారు’ అని ఆయన ట్వీట్ చేశారు. బరాక్ ఒబామా నియమించిన ప్రాసిక్యూటర్లను శుక్రవారం ట్రంప్ సర్కారు తొలగించింది. మూకుమ్మడిగా ప్రాసిక్యూటర్లను తొలగించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అలీ కుమారుడికి మళ్లీ అవమానం విఖ్యాత బాక్సర్ మహ్మద్ అలీ కుమారుడు అలీ జూనియర్‌ను అధికారులు మరోసారి ఎయిర్‌పోర్టులో అడ్డుకొని చాలాపుపు ప్రశ్నించారు. అలీ బుధవారం వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు రాగా అధికారులు దాదాపు 20 నిమిషాలపాటు ప్రశ్నించారు. అలీ తన పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు చూపాకే ఫోర్ట్ ఫ్లోరిడా విమానం ఎక్కడానికి అనుమతించారు. గత నెల ఏడున కూడా అలీ తన తల్లి ఖలీలా కమాచో అలీతోపాటు జమైకా నుంచి ఫోర్ట్ లాడెర్డేల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, తనిఖీల పేరుతో అధికారులు వారిని నిర్బంధించారు. అయితే అలీ ధరించిన ఆభరణాల గురించి స్కానర్ల నుంచి అలారం రావడంతో ఆయనను ఆపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తాము ముస్లింలు కావడంతో వల్లే అధికారులు ప్రశ్నించారని అలీ, ఆయన తల్లి గతంలో ఆరోపించారు. ట్రావెల్ బ్యాన్‌ను వ్యతిరేకించిన నిపుణులు వాషింగ్టన్: సవరించిన ప్రయాణ నిషేధ ఉత్తర్వులపై విదేశాంగ నిపుణులు మండిపడుతున్నారు. అసలైన ఉత్తర్వులు కంటే ఈ తాజా ఉత్తర్వులు అమెరికా జాతీయ భద్రతను, ప్రయోజనాలను దెబ్బతీస్తాయని 130 మందికి పైగా విదేశాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఐసిస్ బాధితులు, ఆ ఉగ్రవాద సంస్థతో తలపడుతున్న ముస్లింలకు ఈ ఉత్తర్వులు తప్పుడు సంకేతాలిస్తాయని, ఇస్లాంతో అమెరికా యుద్ధం చేస్తోందనే తప్పుడు ప్రచారానికి ఊతమిస్తుందని చెప్పారు. ముస్లిం శరణార్థులను, ప్రయాణికులను అనుమతించడంద్వారా ఉగ్రవాదులు చేసే అబద్ధపు ప్రచారానికి కళ్లెం వేయొవచ్చని ఆ విదేశాంగ నిపుణులందరకూ కలసి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్, అటార్నీ జనరల్, జాతీయ భద్రత చీఫ్‌లకు పంపారు. ఈ లేఖ రాసిన వారిలో గతంలో డెమోక్రటిక్, రిపబ్లికన్ ప్రభుత్వాల హయాంలో పనిచేసిన అధికారులు ఉన్నారు.