ఉద్యోగాన్వేషణకు... ఆగ్నేయాసియా
టాప్ స్టోరీ: ఫారిన్ ఎడ్యుకేషన్ అన్నా..విదేశాల్లో ఉద్యోగం అన్నా మన యువతలో ఎనలేని ఆసక్తి. డిగ్రీ పట్టా చేతికి అందగానే విద్య, ఉద్యోగం అంటూ విదేశాల వైపు చూసేవారెందరో ఉన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికా, ఐరోపా దేశాల్లో అనిశ్చితి నెలకొన్న సమయంలో కూడా.. అవకాశాల కల్పనలో ఆ దేశాలకు దీటుగా నిలిచాయి ఆసియాన్ దేశాలు. స్వేచ్ఛా వ్యాపారం, ప్రపంచీకరణ ఫలితంగా ఆసియాన్ దేశాల స్వరూపమే మారిపోయింది. పెరుగుతున్న వాణిజ్యం, ఊపందుకున్న వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. అవకాశాలు ఎక్కడ ఉన్నా ఇట్టే పసిగట్టే భాగ్యనగర యువత.. తమ కెరీర్‌కు గమ్యంగా ఆగ్నేయాసియా దేశాలను ఎంచుకుంటున్నారు. ఆయా దేశాల్లో వాలిపోతున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియాన్ దేశాలకు వెళ్లేవారు తమ కెరీర్‌ను విజయవంతం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు..
అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్‌కు సంక్షిప్త రూపం..ఆసియాన్ (అఉఊ). సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, వియత్నాంలను ఆసియాన్ దేశాలుగా వ్యవహరిస్తారు. ఈ ఆగ్నేయాసియా దేశాల్లో కెరీర్‌ను ప్రారంభించాలంటే.. డిగ్రీలు, ప్రతిభను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. ఎందుకంటే మనతో పోల్చితే పూర్తి భిన్నమైన వాతావరణం, వివిధ దేశాల ప్రజలతో గ్లోబల్ విలేజ్‌ను తలపించే నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే అక్కడి సమాజం వంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. అక్కడి పరిస్థితులపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పలు కీలక అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
హైరింగ్ ట్రెండ్:
సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, వియత్నాం వంటి ఆసియాన్ దేశాల్లో గ్లోబలై జేషన్ ఫలితంగా అక్కడి వ్యాపార ముఖచిత్రమే మారిపో యింది. ప్రపంచంలో ఎనిమిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆసియాన్ అవతరించింది. ఈ దేశాల జీడీపీ వృద్ధి 2.3 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది. అదే క్రమంలో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి.
డిమాండ్ వీటికే:
ఆగ్నేయాసియా దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సర్వీస్ సెక్టార్ వంటి రంగాల్లో జోరుగా హైరింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఉదాహరణకు సింగపూర్‌ను తీసుకుంటే.. అక్కడి మ్యాన్‌పవర్ మినిస్ట్రీ అంచనా మేరకు పది ఉద్యోగాల్లో ఆరు విదేశీయులకే దక్కాయి. మలేషియాలో ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలు ముందంజలో ఉంటున్నాయి.
కారణాలు:
ప్రపంచంలో అధిక శాతం కంపెనీలు ఆగ్నేయాసియా బాట పట్టాయి. దీనికి కారణం అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్న ఆకర్షణీయమైన రాయితీలే. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసు కుంటున్నాయి. ఫలితంగా సంబంధిత వ్యవహారాల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది.
రెట్టింపు సిబ్బంది కావాలి:
పర్యాటక, హోటళ్ల రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హోటల్ వ్యవస్థ ఉంది. అక్కడి ప్రముఖ హోటళ్లు త్వరలో 47 కొత్త హోటళ్లను ప్రారంభించాలని ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. అంటే ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది కంటే రెట్టింపు సిబ్బంది కావల్సి ఉంటుంది.
సంస్కృతికి పెద్ద పీట:
ఆగ్నేయాసియా దేశాలకు ఉపాధి కోసం వెళ్లే విద్యార్థులు మొట్టమొదటగా అవగాహన పెంచుకోవాల్సిన కీలక అంశం.. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు. ఎందుకంటే అక్కడి ప్రజలు వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి ప్రయాణానికి ముందే అక్కడి సంస్కృతి సంప్రదాయాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. వాటిని గౌరవించడం నేర్చుకోవాలి. దాంతో కంపెనీలో పని చేసే సహచరులతో స్నేహసంబంధాలు ఏర్పడతాయి. వివిధ మాధ్యమాలు, ఇంటర్నెట్, పుస్తకాల ద్వారా ఆయా దేశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. వీలైతే అక్కడ స్థిరపడిన భారతీయుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
పదజాలం:
మరో కీలకాంశం.. భాష. ఆయా దేశాల్లో స్థానికంగా మాట్లాడే భాషపై అవగాహన కలిగి ఉండటం. అక్కడి ప్రజలు తమ సంభాషణలో భాగంగా తరుచుగా ఉపయోగించే కొన్ని పదాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు మలేషియాలో ప్రజలు ఏ విషయాలకు నేరుగా కాదు లేదా నో (ూౌ) అని చెప్పరు. అటువంటి సందర్భం ఎదురైతే సున్నితంగా ‘ఐ విల్ ట్రై (ఐ ఠీజీ ్టటడ )’ అంటారు. కాబట్టి అలాంటి పదాలపై అవగాహన పెంచుకోవాలి.
సమయ పాలన:
ఆగ్నేయాసియా ప్రజలు అత్యంత ప్రాముఖ్యాన్నిచ్చే అంశాల్లో సమయ పాలన ఒకటి. దీన్నిబట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ప్రజలు సంబంధ బాంధవ్యాలకు కూడా ఎక్కువ విలువనిస్తారు. ఒకరితో ఒకరు స్నేహం పెంచుకోవడానికి తరుచుగా కలుసుకోవడం కీలకమని భావిస్తుంటారు. ఇతరులతో వ్యవహారాలను నిర్వహిం చేటప్పుడు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి.
ఆహార అలవాట్లు:
మరో అంశం.. ఆహార అలవాట్లు. పూర్తిగా మన దేశానికి భిన్నమైన వంటకాలు అక్కడ కనిపిస్తాయి. ఆయా దేశాల్లో ఎక్కువగా ఉపయోగించే ఆహారం, సంబంధిత అలవాట్లను క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. అక్కడ ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా చాప్ స్టిక్స్ వినియోగిస్తారు. కాబట్టి వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
కార్యాలయాల్లో..
కార్యాలయాల్లో హుందాగా ప్రవర్తించాలి. సందర్భానుసారంగా హావభావాల ప్రకటన ఉండాలి. చొరవగా కలివిడిగా అందరితో మంచి సంబంధాలను కలిగి ఉండడం కెరీర్లో రాణించడానికి దోహదం చేస్తుంది.
అక్కడికి చేరుకున్నాక
ఫ్రెండ్స్, కుటుంబ, సహచరుల, సంబంధిత అసోసియేషన్ల ఫోన్ నెంబర్లు, చిరునామా, ఈ-మెయిల్ తదితర వివరాలను దగ్గర ఉంచుకోవాలి. మీ చదువు, నైపుణ్యం, పరిజ్ఞానానికి అనువైన ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కోసారి మనం ప్రాముఖ్యం ఇవ్వని చిన్న ఉద్యోగం కూడా లభించవచ్చు. అటువంటి వాటిని తిరస్కరించకుండా అనుభవం పెంచుకునే దిశగా
వాటిని ఉపయోగించుకోవాలి.
కమ్యూనికేషన్ కీలకం:
భావ ప్రసరణలో కీలకం కమ్యూనికేషన్. ఇద్దరు వ్యక్తులు లేదా సమూహాల మధ్య జరిగే వ్యవహారాలను ప్రభావవంతంగా నిర్వహించేందుకు కమ్యూనికేషన్ దోహద పడుతుంది. ఈ విషయంలో మన దేశానికి, అక్కడి దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించాలి. మరీ చిన్నగా లేదా బిగ్గరగా, అరుస్తూ మాట్లాడడాన్ని కూడా సింగపూర్ వాసులు హర్షించరు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సంభాషించడం అలవాటు చేసుకోవాలి. మిగతా దేశాల ప్రజలు మాట్లాడే తీరుపైనా అవగాహన పెంచుకోవాలి.
ఇంటర్వ్యూలో వ్యక్తిగతం
మన దేశంతో పోల్చితే ఇంటర్వ్యూ చేసే విధానం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయా దేశాల్లోని చాలా మంది రిక్రూటర్లు ఇంటర్వ్యూలో భాగంగా వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎక్కడ నివసిస్తున్నారు? ఎంత అద్దె చెల్లిస్తున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఎంత వరకు చదువుకున్నారు? వంటి వ్యక్తిగత అంశాలను లోతుగా తెలుసుకునే ప్రశ్నలను వేస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలకు, ఉద్యోగానికి సంబంధం ఉండకపోవచ్చు, అయితే, కొత్త వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, స్నేహాన్ని పెంచుకోవడానికి, సుహృద్భావ వాతావరణం సృష్టించడానికి, చక్కటి సంబంధాలను నెలకొల్పే క్రమంలో మాత్రమే వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తుంటారు.
అవకాశాలు వీరికే:
ఆసియాన్ దేశాల్లో అందుబాటులోకి వస్తున్న అవకాశాలను అందుకోవాలంటే ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్, హోటల్ మేనేజ్మెంట్, కామర్స్, జర్నలిజం, డిజిటల్ మీడియా, ఫైనాన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
వేతనాలు అధికమే:
హోదా, అనుభవాన్ని బట్టి వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌లలో భారత్‌లో లభించే వేతనాల కంటే 25 నుంచి 30 శాతం అధికంగా వేతనాలను చెల్లిస్తున్నారు.
సమాచారం ఎలా?
జాబ్ పోర్టల్స్, వివిధ సంస్థలు నిర్వహించే కెరీర్-నెట్ వర్కింగ్ ఈవెంట్ల ద్వారా ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చు.
గుర్తుంచుకోండి
సమయ పాలన, వృత్తిపరమైన అంశాల్లో నిబద్ధతతో వ్యవహరించాలి. కంపెనీల నియమాలు/ ఉద్యోగ ఒప్పందాన్ని అతిక్రమించరాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. నేరుగా సంప్రదింపులు (డెరైక్ట్ కమ్యూనికేషన్) ప్రశంసనీయం కాదు.
విభిన్న అవకాశాలకు.. ఆగ్నేయాసియా దేశాలు
ఆగ్నేయాసియా దేశాలు చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, పరిశ్రమల విస్తరణ వంటి చర్యల కారణంగా ఇప్పుడు ఆ దేశాలు విదేశీ ఉద్యోగార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో హాస్పిటాలిటీ, టూరిజం, హెల్త్‌కేర్, బీపీఓ విభాగాల్లో పలు ఉద్యోగాలు ఉన్నాయి. ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో టీచింగ్ విభాగంలో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆయా దేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులు సరైన ప్రణాళికతో వ్యవహరించాలి. తాము చేరదలచుకున్న సంస్థ, రంగాలకు సంబంధించి ఆయా దేశాల్లో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తుపై సంపూర్ణ అవగాహనతో ఉండాలి. ఇలా అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.
- ఎం. సింధు, క్లయింట్ రిలేషన్ మేనేజర్,
మాన్స్టర్ ఇండియా డాట్ కామ్
జాబ్ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా అవగాహన
ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా దేశాలు ఉద్యోగాల రీత్యా మన అభ్యర్థులకు చక్కటి గమ్యాలుగా నిలుస్తున్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్, కన్సల్టెన్సీల ద్వారా ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించొచ్చు. తమ అర్హతలకు తగిన ఉద్యోగాలపై అవగాహన పొంది దరఖాస్తు చేసుకోవచ్చు. పారిశ్రామిక సంస్థల్లో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు డిప్లొమా నుంచి.. మిడిల్ లెవల్ మేనేజ్మెంట్ పోస్ట్‌ల కోసం మాస్టర్స్ డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికీ అనువైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా అవకాశాలపై కన్సల్టెన్సీలను సంప్రదించే ముందు సదరు కన్సల్టెన్సీ విశ్వసనీయత గురించి తెలుసుకున్నాకే ముందుకు సాగాలి.
- టి.ఎస్. విశ్వనాథ్, విసు గ్లోబల్ కన్సల్టింగ్స్