న్యూఢిల్లీ: 10 కీలక దేశాలతో కూడిన ‘ఆసియాన్’ ఐక్యతకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆసియాన్ దేశాల మధ్య ఐక్యత తమకు చాలా ముఖ్యమని చెప్పారు. ఆయన గురువారం కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. ఈ ప్రతికూల సమయం భారత్– ఆసియాన్ స్నేహానికి ఒక పరీక్ష లాంటిదేనని అన్నారు.
పరస్పర సహకారం భవిష్యత్తులో మన సంబంధాలను బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, ఆసియాన్ మధ్య వేలాది సంవత్సరాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇందుకు చరిత్రనే సాక్షి అని గుర్తుచేశారు. పురాతన సంబంధ బాంధవ్యాలను మనం పంచుకుంటున్న విలువలు, సంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు, రచనలు, ఆహారం, నిర్మాణ శాస్త్రం వంటివి ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. భారత్– ఆసియాన్ భాగస్వామ్యానికి వచ్చే ఏడాది 30 ఏళ్లు నిండుతాయని మోదీ తెలిపారు. అలాగే స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తవుతాయన్నారు.
ఈ ముఖ్యమైన సందర్భాలను పురస్కరించుకొని 2022ను ‘భారత్– ఆసియాన్ ఫ్రెండ్‌షిప్ ఇయర్’గా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటామని అన్నారు. ఆసియాన్ కూటమితో బంధాలను బలోపేతం చేసుకొనేందుకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 2021లో ఆసియాన్‌కు విజయవంతంగా నాయకత్వం వహించిన బ్రూనై సుల్తాన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘ఆసియాన్’కూటమిలో బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్‌తో సహా అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఈ కూటమితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాయి.
నేటి నుంచి మోదీ ఇటలీ, యూకే పర్యటన
వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం
ఇటలీలోని రోమ్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లపై, యూకేలోని గ్లాస్గోలో వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల అధినేతలతో చర్చించబోతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇటలీ, యూకే పర్యటనకు ముందు ఆయన గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మోదీ ఈ నెల 29 నుంచి 31 దాకా రోమ్‌లో, నవంబర్ 1 నుంచి 2 వరకూ గ్లాస్గోలో పర్యటించనున్నారు.
రోమ్‌లో జి–20 శిఖరాగ్ర సదస్సులో, గ్లాస్గోలో కాప్–26 దేశాల అధినేతల సదస్సులో పాలుపంచుకుంటారు. ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు రోమ్‌తోపాటు వాటికన్ సిటీతో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమవుతానని మోదీ వెల్లడించారు. 16వ జి–20 సదస్సులో పాల్గొంటానని చెప్పారు. భాగస్వామ్య దేశాల అధినేతలతో సమావేశమై, భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తానని పేర్కొన్నారు. గ్లాస్గోలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్) సదస్సుకు 120 దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment