Asean Summit
-
India-ASEAN Cooperation: మరింత సహకారానికి 12 సూత్రాలు
జకార్తా: 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమి, భారత్ మధ్య మరింత సహకారానికి 12 సూత్రాల ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ తెరమీదకు తెచ్చారు. కనెక్టివిటీ మొదలు వర్తకం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దాకా పలు అంశాల్లో పరస్పర సహకారం పెంపునకు ఎంతగానో అవకాశాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. కరోనా అనంతరం మరింత క్రమశిక్షణతో కూడిన ప్రపంచం కోసం పాటుపడదామని పిలుపునిచ్చారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం ఆసియాన్ –భారత్ వార్షిక శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఆగ్నేయాసియా, పశి్చమాసియా, యూరప్‌లతో భారత్‌ను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్ తదితరాలను ప్రస్తావించారు. శాంతి, ప్రగతి, పరస్పర వృద్ధే లక్ష్యంగా ఆసియాన్ –భారత్ భాగస్వామ్య కార్యాచరణను పటిష్టంగా ప్రణాళిక అమలు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. సముద్ర వర్తకంలో పరస్పర సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని పేర్కొన్నాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిరంతర కనెక్టివిటీ, బ్లూ ఎకానమీ, ఆహార భద్రత మొదలుకుని అంతరిక్షం దాకా అన్ని రంగాల్లోనూ భారత కృషికి, ప్రయత్నాలకు ఆసియాన్ పూర్తి మద్దతుంటుందని ప్రకటన పేర్కొంది. అలాగే పరస్పర వర్తకం, పెట్టుబడుల ద్వారా ఆహార భద్రత, పౌష్టికాహారం తదితర రంగాల్లో సహకారాన్ని మరింతగా పటిష్టపరచుకోవాలని మరో సంయుక్త ప్రకటనలో నిర్ణయించాయి. ఉగ్రవాదం, దానికి నిధులు తదితరాల మీద ఉమ్మడి పోరు జరపాలని నిర్ణయించారు. మరింత స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ దిశగా ప్రగతి సాధనలో కలిసి రావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. సదస్సుకు సహాధ్యక్ష హోదాలో ఆయన మాట్లాడారు. ‘21వ శతాబ్దం ఆసియాకు సొంతం. ఇది మన శతాబ్దం’’ అని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనల్లో కొన్ని... ► కనెక్టివిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, వర్తకం, ఆహార భద్రత నుంచి బ్లూ ఎకానమీ దాకా వంటి పలు రంగాల్లో మరింత సహకారం ► ఉగ్రవాదం, దాని ఆర్థిక మూలాల మీద ఉమ్మడి పోరు ► దక్షిణాది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్జాతీయ వేదికల మీద లేవనెత్తడం ► ఆసియాన్–భారత్ డిజిటల్ ఫ్యూచర్ నిధి ► ఆసియాన్, ఈస్ట్ ఏషియా ఆర్థిక, పరిశోధన సంస్థ ( ఉఖఐఅ) పునరుద్ధరణ, దానికి మరింత మద్దతు ► భారత్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌లో భాగం కావాలంటూ ఆహా్వనం ► విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పన యత్నాల్లో భాగస్వామ్యం ► జన్ ఔషధీ కేంద్రాల ద్వారా పేదలకు అందుబాటు ధరల్లో మందులు అందించడంలో భారత అనుభవాన్ని అందిపుచ్చుకోవడం ► ఆసియాన్–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలును నిరీ్ణత కాలావధిలో సమీక్షించుకోవడం 30 ఏళ్ల బంధం ► వ్యూహాత్మక భాగస్వామ్య కూటమి ఏర్పాటు దిశగా ఆసియాన్– భారత్ చర్చలు 1992 నుంచే మొదలయ్యాయి. ► 1995 కల్లా పూర్తిస్థాయి రూపు సంతరించుకున్నాయి. ► 2002 నాటికి శిఖరాగ్ర సదస్సు స్థాయి భాగస్వామ్యంగా రూపుదాల్చాయి. ► ఆసియాన్ సభ్య దేశాలతో కొన్నేళ్లుగా భారత సంబంధాలు ఊపు మీదున్నాయి. రక్షణ, భద్రత, పెట్టుబడులు, వర్తకం తదితర రంగాల్లో సహకారం పెరుగుతూ వస్తోంది. ఆ పది దేశాలు... ► ఆసియాన్ కూటమి పది దేశాల సమాహారం. అంతర్జాతీయంగా శక్తిమంతమైన కూటముల్లో ఇదొకటి. దాని సభ్య దేశాలు... ► ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా. ► ఆసియాన్ కూటమిలో చర్చా భాగస్వాములుగా భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆ్రస్టేలియా వంటి దేశాలున్నాయి. -
‘ఆసియాన్’ ఐక్యత మాకు ముఖ్యం
న్యూఢిల్లీ: 10 కీలక దేశాలతో కూడిన ‘ఆసియాన్’ ఐక్యతకు భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆసియాన్ దేశాల మధ్య ఐక్యత తమకు చాలా ముఖ్యమని చెప్పారు. ఆయన గురువారం కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. ఈ ప్రతికూల సమయం భారత్– ఆసియాన్ స్నేహానికి ఒక పరీక్ష లాంటిదేనని అన్నారు. పరస్పర సహకారం భవిష్యత్తులో మన సంబంధాలను బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, ఆసియాన్ మధ్య వేలాది సంవత్సరాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇందుకు చరిత్రనే సాక్షి అని గుర్తుచేశారు. పురాతన సంబంధ బాంధవ్యాలను మనం పంచుకుంటున్న విలువలు, సంప్రదాయాలు, సంస్కృతులు, భాషలు, రచనలు, ఆహారం, నిర్మాణ శాస్త్రం వంటివి ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. భారత్– ఆసియాన్ భాగస్వామ్యానికి వచ్చే ఏడాది 30 ఏళ్లు నిండుతాయని మోదీ తెలిపారు. అలాగే స్వతంత్ర భారతదేశానికి 75 ఏళ్లు పూర్తవుతాయన్నారు. ఈ ముఖ్యమైన సందర్భాలను పురస్కరించుకొని 2022ను ‘భారత్– ఆసియాన్ ఫ్రెండ్షిప్ ఇయర్’గా పరిగణిస్తూ వేడుకలు జరుపుకుంటామని అన్నారు. ఆసియాన్ కూటమితో బంధాలను బలోపేతం చేసుకొనేందుకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 2021లో ఆసియాన్‌కు విజయవంతంగా నాయకత్వం వహించిన బ్రూనై సుల్తాన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘ఆసియాన్’కూటమిలో బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్‌తో సహా అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఈ కూటమితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాయి. నేటి నుంచి మోదీ ఇటలీ, యూకే పర్యటన వాటికన్లో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం ఇటలీలోని రోమ్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లపై, యూకేలోని గ్లాస్గోలో వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల అధినేతలతో చర్చించబోతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇటలీ, యూకే పర్యటనకు ముందు ఆయన గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మోదీ ఈ నెల 29 నుంచి 31 దాకా రోమ్‌లో, నవంబర్ 1 నుంచి 2 వరకూ గ్లాస్గోలో పర్యటించనున్నారు. రోమ్‌లో జి–20 శిఖరాగ్ర సదస్సులో, గ్లాస్గోలో కాప్–26 దేశాల అధినేతల సదస్సులో పాలుపంచుకుంటారు. ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ఆహ్వానం మేరకు రోమ్‌తోపాటు వాటికన్ సిటీతో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమవుతానని మోదీ వెల్లడించారు. 16వ జి–20 సదస్సులో పాల్గొంటానని చెప్పారు. భాగస్వామ్య దేశాల అధినేతలతో సమావేశమై, భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తానని పేర్కొన్నారు. గ్లాస్గోలో రెండు రోజులపాటు జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్) సదస్సుకు 120 దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు హాజరవుతారన్నారు. -
‘ఆర్సెప్’లో చేరడం లేదు!
బ్యాంకాక్: కీలకమైన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ–ఆర్సెప్)’ ఒప్పందంలో భారత్ చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసింది. ఆర్సెప్కు సంబంధించి భారత్ ఆకాంక్షలకు, ఆందోళనలకు చర్చల్లో సరైన సమాధానం లభించలేదని తేల్చి చెప్పింది. పలు ప్రపంచ దేశాల అధినేతలు హాజరైన ఆర్సీఈపీ సదస్సులో ప్రసంగిస్తూ భారత ప్రధాని మోదీ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆర్సీఈపీ చర్చల ప్రారంభంలో అంగీకరించిన మౌలిక స్ఫూర్తి ప్రస్తుత ఒప్పందంలో పూర్తిగా ప్రతిఫలించడం లేదు. భారత్ లేవనెత్తిన వివాదాస్పద అంశాలు, ఆందోళనలకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్సెప్ ఒప్పందంలో భాగస్వామిగా చేరడం భారత్‌కు సాధ్యం కాదు’ అని ప్రకటించారు. ‘భారతీయులకు అందే ప్రయోజనాల దృష్టికోణం నుంచి ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తే నాకు సానుకూల సమాధానం లభించడం లేదు’ అని అన్నారు. ఈ ఒప్పందం భారతీయుల జీవితాలు, జీవనాధారాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. చైనా ఒత్తిడి అర్‌సీఈపీ ఒప్పందం సభ్య దేశాల ఆమోదం పొందాలని చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సదస్సులోనే అది జరగాలని సభ్యదేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. అమెరికాతో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం విపరిణామాలను సమతౌల్యం చేసుకోవడం, ఈ ప్రాంత ఆర్థిక సామర్థ్యాన్ని అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు చూపడం చైనా లక్ష్యాలుగా పెట్టుకుంది. ఈ ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఆ లక్ష్యాలను సాధించాలని చూస్తోంది. మరోవైపు, దేశీయ మార్కెట్‌ను సంరక్షించుకోవడం కోసం కొన్ని నిబంధనలు అవసరమని భారత్ వాదిస్తోంది. ముఖ్యంగా చవకైన చైనా వ్యావసాయిక ఉత్పత్తులు, పారిశ్రామిక ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదముందనే భయాల నేపథ్యంలో.. దేశీయ ఉత్పత్తుల మార్కెట్‌కు సముచిత రక్షణ కల్పించాలన్నది భారత్ వాదనగా ఉంది. ఒకవేళ ఈ ఆర్సెప్ ఆమోదం పొందితే .. ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత ఒప్పందంగా నిలిచేది. దాదాపు ప్రపంచ జనాభాలో సగం మందితో పాటు, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40%, ప్రపంచ జీడీపీలో 35% ఈ ఒప్పంద పరిధిలో ఉండేవి. 15 దేశాలు సిద్ధం ఈ ఒప్పందాన్ని భారత్ మినహా మిగతా 15 దేశాలు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఒప్పందంలో చేరబోవడం లేదని భారత్ స్పష్టం చేసిన అనంతరం.. వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా 15 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. తరువాతైనా, ఈ ఒప్పందంలో భారత్ చేరే అవకాశముందా? అన్న ప్రశ్నకు ‘ఈ ఒప్పందంలో భాగం కాకూడదని భారత్ నిర్ణయించుకుంది’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ పేర్కొన్నారు. భారత్ పేర్కొన్న ఏకాభిప్రాయం వ్యక్తం కాని అంశాలపై శనివారం 16 దేశాల వాణిజ్య మంత్రులు జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదు. ‘గత ప్రభుత్వాల హయాంలో అంతర్జాతీయ ఒత్తిడులకు తలొగ్గి ప్రయోజనకరం కాకపోయినా.. పలు వాణిజ్య ఒప్పందాలకు భారత్ అమోదం తెలిపింది. ఇప్పుడలా లేదు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది. సొంత ప్రయోజనాల విషయంలో స్పష్టంగా ఉంటోంది’ అని వాణిజ్య శాఖ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘ఇండో పసిఫిక్’ అభివృద్ధే లక్ష్యం ఇండో పసిఫిక్ ప్రాంత దేశాల ఉమ్మడి లక్ష్యాలైన శాంతి, సమృద్ధి, అభివృద్ధిల కోసం కలసి కట్టుగా కృషి చేయాలని భారత్, జపాన్ దేశాలు నిర్ణయించాయి. ఈస్ట్ ఆసియా సదస్సు సందర్భంగా రెండు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, షింజొ అబె సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిలటరీపరంగా, వాణిజ్యపరంగా చైనా విస్తరణవాద దూకుడుతో పాటు ఈ ప్రాంత భద్రత, వాణిజ్యం తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు సమీక్ష నిర్వహించారు. 2012 నుంచి.. ఆర్సెప్ చర్చలు 21వ ఆసియాన్ సదస్సు సందర్భంగా నవంబర్, 2012లో ప్రారంభమయ్యాయి. 10 ఆసియాన్ సభ్య దేశాలు(ఇండోనేసియా, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, మయన్మార్, లావోస్) 6 భాగస్వామ్య దేశాలు(భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) ఈ చర్చల్లో పాలు పంచుకున్నాయి. ‘ఆధునిక, సమగ్ర, అత్యున్నత ప్రమాణాలతో కూడిన, పరస్పర ప్రయోజనకర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద రూపకల్పన’ లక్ష్యంగా ఆర్సీఈపీ చర్చలు ప్రారంభమయ్యాయి. -
థాయ్‌లాండ్‌లో మోదీ.. కీలక ప్రసంగం
బ్యాంకాక్: ఆసియాన్ దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బ్యాంకాక్‌లో జరిగిన 16వ ఆసియాన్-భారత్ సదస్సుకు హాజరయ్యారు. తీరప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్, డిజిటల్ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పలు అంశాల్లో ఆసియాన్ కూటమిలోని సభ్యదేశాలతో కలిసి సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు మోదీ. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించాలన్న భారత్ కల త్వరలోనే సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోదీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. బ్యూరోక్రటిక్ తరహా పాలనకు స్వస్తి పలికి.. నవభారతం దిశగా దేశం అడుగులు వేస్తోందని తెలిపారు. థాయ్ ప్రధానితో భేటీ థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్ ఓ చాన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీతోనూ సమావేశమయ్యారు. సాయంత్రం జరిగే విందులో పాల్గొంటారు. -
‘శిఖరాగ్ర’ సందడి!
వ్యూహాత్మక అంశాల్లో అంతర్జాతీయంగా ఒక రకమైన అనిశ్చితి అలుముకున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌లో ఆదివారం నుంచి మూడురోజుల విస్తృత పర్యటన జరిపారు. ఈసారి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వరస శిఖరాగ్ర సదస్సులతో సందడిగా మారింది. ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు (ఆసి యాన్), తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) దేశాల సదస్సుల్లో మోదీ పాల్గొనడంతోపాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తోసహా పలు దేశాల అధినేతలను కలిశారు. ఈ సందర్భంగానే ఆసియా–పసిఫిక్ ప్రాంత భద్రత, సుస్థిరతలపై చర్చించేందుకు మన దేశంతోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దౌత్యవేత్తలు విడిగా సమావేశమయ్యారు. దీనికి కొనసాగింపుగా మోదీ జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్క్బుల్తో చర్చించారు. ఈ దేశాలతో చతుర్భుజ కూటమిని ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఆలోచన. ఈ సదస్సులకు ముందు వియత్నాంలో ఆసియా–పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ(ఎపెక్) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ప్రపంచం ఇంతకు ముందున్నట్టులేదు. కొన్ని దశాబ్దాలనుంచి ఆర్ధిక సంస్కరణ లనూ, ప్రపంచీకరణనూ ప్రవచిస్తూ వాటి అమలుకు నాయకత్వంవహించిన అమెరికా... డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చాక స్వరం మార్చింది. దాదాపు ఏడాది కాలంనుంచి ‘అమెరికా ఫస్ట్’ అంటూ ‘స్వీయ రక్షణ’ చర్యలు మొదలెట్టింది. భూతా పోన్నతిని, దాని వెన్నంటి వచ్చే పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించడానికి రెండేళ్లక్రితం పారిస్‌లో కుదిరిన వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకోదల్చుకు న్నట్టు మొన్న జూన్‌లో ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఖాళీ చేస్తున్న ప్రాంతాల్లో పాగా వేసేందుకు, ఆ రకంగా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకూ చైనా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే అది తూర్పు, పడమరలను ఏకంచేసే బృహత్తరమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టును నెత్తికెత్తుకుంది. ప్రపంచ పర్యావరణ రక్షణకు తాను చొరవ తీసుకుంటానంటోంది. తూర్పు చైనా సము ద్రంలోనూ, దక్షిణ చైనా సముద్రంలోనూ చైనాతో వివాదాలున్న జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఇవన్నీ మింగుడు పడటం లేదు. మరో పక్క హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా క్రమేపీ తన పలుకుబడిని విస్తరిం చుకుంటూ పోవడంతోపాటు మనకు సమస్యగా మారిన పాకిస్తాన్‌తో చేతులు కలపడం మన దేశానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇన్ని పరిణామాల మధ్య మనీలా వేదికగా జరిగిన ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సులకు సహజంగానే అమిత ప్రాధాన్యత ఉంటుంది. స్వీయ మార్కెట్ల పరిరక్షణ, దేశ పౌరులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చూడటం అన్న రెండు అంశాలపైనే కేంద్రీకరించి అందుకు అవసరమైతే చైనాతో చేతులు కలిపేందుకు కూడా సిద్ధపడుతున్న అమెరికా...అదే సమయంలో ఈ ప్రాంతంలోని తన చిరకాల మిత్రుల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి పెట్టింది. ఇందులో మన దేశం ముఖ్యపాత్ర వహించాలన్నది దాని ఉద్దేశం. ‘ట్రంప్ ఎక్కడి కెళ్లినా, ఏమాత్రం అవకాశం దొరికినా భారత్ గురించే గొప్పగా చెబుతున్నార’ని ఆయనతో సమావేశమయ్యాక సోమవారం మోదీ అన్నారు. ఇందులో నిజముంది. ట్రంప్ వచ్చాక ‘ఆసియా–పసిఫిక్’ అనే మాటనే మార్చేసి ‘ఇండో–పసిఫిక్’ అనడం మొదలుపెట్టారు. ఆసియా–పసిఫిక్ ప్రాంత భద్రతలో భారత్ కీలకపాత్ర పోషించాలన్నది ట్రంప్ ఉద్దేశం. అయితే ఇదే సమయంలో ఇతర దేశాల తీరు తెన్నుల్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమాల్లో జరిగిన జాప్యం వల్ల తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ పాలు పంచుకోలేదు. అంత కన్నా ముఖ్యమేమంటే 2007లో తొలిసారి జరిగిన చతుర్భుజ కూటమి దేశాల దౌత్యవేత్తల సమావేశానికి హాజరైన సింగపూర్ ఈసారి మాత్రం మొహం చాటేయడం. నాలుగు ప్రధాన దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లతో పాటు సింగపూర్ కూడా అప్పట్లో సమావేశంలో పాలుపంచుకుంది. కానీ మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అది పునరాలోచనలో పడినట్టు కని పిస్తోంది. ముఖ్యంగా చైనా బీఆర్ఐ ప్రాజెక్టు ఆర్ధికంగా, వాణిజ్యపరంగా తమ కెంతో మేలు చేస్తుందన్న విశ్వాసం దానికుంది. అమెరికాకు అది మిత్ర దేశమే అయినా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న దాని వైఖరి సింగపూర్‌కు మింగుడుపడటం లేదు. అందుకే తన దోవ తాను చూసుకోదల్చుకున్నట్టు కన బడుతోంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతం సుస్థిరంగా, భద్రంగా ఉండాలంటే మోదీ చెప్పి నట్టు ‘నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం’ అవసరమే కావొచ్చు. ఆ ప్రాంతంలో చైనా దూకుడు వల్ల జపాన్, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు సమస్యలెదుర్కొంటున్న మాట కూడా వాస్తవమే. అయితే మాట నిలకడలేని ట్రంప్‌ను నమ్ముకుని 2007 నాటి చతుర్భుజ కూటమి ఆలోచనకు మళ్లీ ప్రాణప్రతిష్ట చేయడం, అందులో మన దేశం చురుగ్గా పాలు పంచుకోవడం ఎంతవరకూ అవసరమో ఆలోచించక తప్పదు. ఈ కూటమికి తనను ఆహ్వా నించకపోవడంపైనా, దాని ఉద్దేశాలపైనా చైనాకు సంశయాలున్నాయి. మరోపక్క చతుర్భుజ కూటమి గురించి, ఇండో–పసిఫిక్ ప్రాంతం గురించి మాట్లాడుతున్న ట్రంప్ చైనాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఆ దేశంతో తమకున్న వాణిజ్య లోటు భర్తీకి తహతహలాడుతున్నారు. అందువల్ల మనం కూడా చైనాతో ఉన్న ద్వైపాక్షిక సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే ఆ దేశంతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆసియాన్ దేశా లతో చైనా వాణిజ్యం నిరుడు 35,000 కోట్ల డాలర్లుంటే మనది 6,000 కోట్ల డాలర్లు మాత్రమే. అలాగే ఆసియాన్ దేశాల్లో మన పెట్టుబడులు వంద కోట్ల డాలర్లు దాటలేదు. వీటిని మరింత పెంచుకోవడం, పరస్పర సహకారంతో సమష్టిగా ముందుకెళ్లడం ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అత్యవసరం. ఏ ప్రాంతీయ కూటమైనా అందుకు దోహదపడాలని ఆశించాలి. -
పలువురు ప్రధానులతో మోదీ వరుస భేటీలు
మనీలా : ఏషియన్ సదస్సులో భాగంగా ఫిలిప్ఫైన్స్ మూడురోజుల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుసగా వివిధ దేశాల ప్రధానులతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదంయ ఆస్టేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్, వియత్నం ప్రధాని గుయోన్ యువాన్ హుసి, ఆపై జపాన్ ప్రధాని షింబో అబేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయా దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అనంతరం బ్రునై సుల్తాన్ హస్సనల్ బోల్కై తో కూడా సమావేశమై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. నిన్న ఫిలిప్ఫైన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె తో ఏకాంతంగా గడిపి పలు కీలక ఒప్పందాలపై చర్చించిన విషయం తెలిసిందే. కాగా, నేడు అక్కడ నిర్వహించబోయే 12వ ఈస్ట్-ఏషియా సదస్సుతోపాటు, 15వ ఇండియా-ఏషియన్ సదస్సులో మోదీ పాల్గొననున్నారు. -
‘తయారీ హబ్‌గా భారత్’
మనీలా: భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మనీలాలో ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ దేశాన్ని తయారీ హబ్‌గా మలవడంతో పాటు తమ యువతను ఉపాథిని సృష్టించేవారిగా రూపొందిస్తామని అన్నారు.దేశంలో దాదాపు అన్ని రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామన్నారు. భారత్‌లో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితి నుంచి జన్‌థన్ యోజన ద్వారా వారందరికీ కొద్దినెలల్లోనే బ్యాంకు ఖాతాలు లభించాయని చెప్పారు. ప్రజలకు సాంకేతికతను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో దాదాపు 1200 కాలం చెల్లిన చట్టాలను మార్చివేశామన్నారు. కంపెనీల స్ధాపనకు అవసరమైన అనుమతులను సరళీకరించామని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసియాన్ దేశాలకు మోదీ పిలుపు ఇచ్చారు. పారదర్శక ప్రభుత్వం కోసం తాము రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని అన్నారు. -
ట్రంప్‌తో మోదీ భేటీ
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న 31వ ఆసియన్ (ఈశాన్య ఆసియా దేశాల అసోసియేషన్) సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వీరి భేటీ జరగనున్నట్లు చెప్పుకున్నప్పటికీ కాస్త ఆలస్యమయ్యింది. వీరి భేటీలో ప్రధానంగా ఇరుదేశాల దౌత్య సంబంధాలు, రక్షణ, ఉగ్రవాదం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘‘మోదీ మాకు మంచి మిత్రుడు. ఆయన పాలన భేషుగ్గా ఉంది. సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయి. మున్ముందు కూడా భారత్‌తో మా మైత్రి ఇలాగే కొనసాగుతుంది’’ అని ట్రంప్ తెలిపారు. ఇక అమెరికాతో సంబంధాలు ఆర్థికపరమైనవే కావని.. అంతకు మించే ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా-భారత్ మైత్రి ఆసియా అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడుతుందని మోదీ చెప్పారు. మనీలా జరుగుతున్న ఆసియన్ సదస్సు ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతోపాటు పలువురు దేశాధినేతలు పాల్గొన్నారు. అంతకుముందు లాస్ బోనోస్‌లోని రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రధాని మోదీ సందర్శించి.. అక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. మహావీర్ ఫిలీప్పీన్స్ ఫౌండేషన్‌ను కూడా ఆయన సందర్శించనున్నారు. Prime Minister Narendra Modi visits International Rice Research Institute in Los Banos, Philippines; inaugurates Resilient Rice Field Laboratory. pic.twitter.com/zMCSAtECwp — ANI (@ANI) 13 November 2017 చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యం! వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు చెక్ పెట్టేలా భద్రతా సహకారంపై చర్చించేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆ స్ట్రేలియా అధికారులు తొలిసారి మనీలాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా మార్చే అంశంపై ఈ నాలుగు దేశాలు చర్చించాయి. పరస్పర ప్రయోజనమున్న అంశాలపై కూడా చర్చలు కొనసాగాయి. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తూ‘ ఇండో–పసిఫిక్‌పై మరిన్ని చర్చలు కొనసాగించాలని, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు అమలయ్యేలా సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించాం’ అని పేర్కొన్నాయి. కలిసికట్టుగా పనిచేసేలా, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సామరస్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా చర్చలు సాగాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉమ్మడి సవాలుగా మారిన ఉగ్రవాదం, ఉగ్రవ్యాప్తిపై కూడా సమావేశంలో చర్చించారని తెలిపింది. -
బాధ్యతగా మెలగాలి
మలేసియాలో ముగిసిన ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) శిఖరాగ్ర సదస్సులోనూ, ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్‌లో చేసిన ప్రసంగంలోనూ దక్షిణ చైనా సముద్రం సైనికీకరణ అంశం ప్రముఖంగా ప్రస్తావనకొచ్చింది. మరోపక్క ఈ ప్రాంతంపై తమకున్న యాజమాన్య హక్కుల్ని గుర్తించాలనీ...ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చైనాను అదుపు చేయాలనీ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో మంగళవారం ఫిర్యాదు చేసింది. రానున్న కాలంలో ఇది ఎంత వివాదాస్పదం కాబోతున్నదో ఈ ప్రస్తావనలూ, పరిణామాలే చెబుతున్నాయి. చైనా భూభాగానికి దక్షిణంగా, వియత్నాం, కంబోడియాలకు తూర్పుగా... ఫిలిప్పీన్స్‌కు పశ్చిమంగా ఉన్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతం అత్యంత కీలకమైనది. అంతర్జాతీయ సరుకు రవాణాలో మూడో వంతు ఈ మార్గం గుండానే జరుగుతుంది. అంతేకాదు...ఇక్కడి సముద్ర గర్భంలో అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటే ఈ నిక్షేపాలన్నీ సొంతం కావడంతోపాటు రక్షణపరంగా పైచేయి సాధించడం కూడా సాధ్యమవుతుందన్నది చైనా వ్యూహం. అందువల్లే ఆ ప్రాంతంలో 700 వరకూ ఉన్న చిన్న చిన్న దీవులనూ, పగడాల దిబ్బలనూ స్వాధీనపరుచుకొని ఇటుగా ఎవరొచ్చినా తాను విధించే నిబంధనలకు లోబడాలని చెబుతున్నది. సరుకు రవాణాకు ఆటంకం కలిగించబోమంటూనే ఆ ప్రాంతంలో ఓడలను నిలిపినా, లంగరేసినా అంగీకరించబోమని అంటున్నది. ఈ ప్రాంతంలోని దీవులు తమవేనంటూ అటు వియత్నాం...ఇటు ఫిలిప్పీన్స్ కూడా ఇప్పటికే ప్రకటించుకుంటున్నాయి. కానీ చైనాతో పోలిస్తే అవి పిపీలకాలు గనుక అమెరికాను తోడు తెచ్చుకుంటున్నాయి. తమ తరఫున అమెరికా పోరాడాలని భావిస్తున్నాయి. ప్రపంచంలో ఇప్పటికే 800 చోట్ల చిన్నా పెద్దా సైనిక స్థావరాలున్న అమెరికా... దక్షిణ చైనా సముద్రంలో సైతం తన ఉనికిని చాటుకోవాలని ఉబలాటపడుతున్నది. అలా చేయగలిగితే అటు చమురు, సహజ వాయు నిక్షేపాలు దక్కడంతోపాటు చైనాను సైనికంగా కట్టడి చేయడం సాధ్యమవుతుందని అది భావిస్తున్నది. కానీ అచ్చం చైనా అంటున్నట్టే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై తమకెలాంటి ఆకాంక్షలూ లేవని అమెరికా చెబుతోంది. ఆ ప్రాంతంలో తిరుగులేని చట్టబద్ధ హక్కులు ఎవరికీ లేవని, అలాంటి సందర్బాల్లో ఏ ఒక్కరినో సమర్థించడం తమ విధానం కాదని అంటున్నది. ఈ ఇద్దరూ పైకి ఏం చెబుతున్నా వారి ఆంతర్యాలు వేరే ఉండొచ్చునని సులభంగానే అర్ధమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో చైనా డిప్యూటీ విదేశాంగమంత్రి లియూ జెన్మిన్ తాము దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని సైనికీకరించదల్చుకోలేదని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది కాలంగా చైనా ఆ ప్రాంతంలోని దీవుల ఎత్తు పెంచడం, వాటిపై కొన్ని నిర్మాణాలు చేపట్టడం బహిరంగ రహస్యం. ఆ నిర్మాణాల్లో హెలిపాడ్లు, నిఘా రాడార్లు ఉన్నాయి. విమానాలు దిగే ఏర్పాట్లున్నాయి. అంతరిక్షంలో తిరుగాడే ఉపగ్రహాల ద్వారా ప్రపంచంలో ఏమూల ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ ప్రాంతంపైనే నిరంతర నిఘా ఉంచిన అమెరికాకు అది చిటికెలో పని. మరి అక్కడి కార్యకలాపాల గురించి చైనా చెబుతున్నదేమిటి? జెన్మిన్ అవన్నీ ‘ప్రజా ప్రయోజన సేవల’కు ఉద్దేశించినవేనంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, మానవతా సాయం అందించాల్సివచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికే ఈ నిర్మాణాలకు పూనుకున్నామని వివరిస్తున్నారు. వాస్తవానికి మొన్న సెప్టెంబర్‌లో అమెరికా పర్యటించినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఒబామా సమక్షంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పెంగ్ సైతం ఈ సంగతినే చెప్పారు. కానీ ఆ తర్వాత దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి ‘ఫ్రీడం ఆఫ్ నావిగేషన్’ పేరిట అమెరికా రెండు నౌకలనూ, వీటికి తోడుగా ఒక నిఘా విమానాన్ని పంపింది. చైనా తనదేనని చెప్పుకుంటున్న దీవికి 12 నాటికల్ మైళ్ల దూరంలో ఇవి ప్రయాణించాయి. ఈ పరిణామంతో ఆగ్రహించిన చైనా అమెరికాను తీవ్ర పదజాలంతో హెచ్చరించింది. ఈ ప్రాంతంపై తమకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉన్నదని, దానికి భంగం కలిగిస్తే మౌనంగా ఉండజాలమని తెలిపింది. అక్కడ తమకు సైనిక స్థావరం లేదనిగానీ, దాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదనిగానీ అప్పట్లో చెప్పలేదు. అలా చూస్తే లియూ జెన్మిన్ ఓ మెట్టు దిగొచ్చినట్టే లెక్క. నిజానిజాల మాటెలా ఉన్నా దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని సైనికీకరించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ ప్రకటన చేసే సమయానికి ఒబామా ఆ వేదికపైనే ఉన్నారు. మహా సముద్రాలు, అంతరిక్షం, సైబర్ ప్రపంచం బల ప్రదర్శన వేదికలుగా మారరాదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన నిజానికి దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో రాజుకుంటున్న వివాదాన్ని ఉద్దేశించి మాత్రమే కాదు...హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా దూకుడును దృష్టిలో ఉంచుకుని కూడా మోదీ ఆ మాటలన్నారని భావించాలి. హిందూ మహా సముద్రంలోని డీగోగార్షియా దీవిని అమెరికా తన స్థావరంగా మార్చుకున్నప్పుడు మన దేశం అన్ని ప్రపంచ వేదికలపైనా ఎంతగానో పోరాడింది. ఇలాంటి ధోరణులు సరికావని హెచ్చరించింది. అయితే మన అభ్యంతరాలు ఆగిపోయాయిగానీ అమెరికా మాత్రం అక్కడినుంచి వైదొలగలేదు. ఇటు చైనా హిందూ మహా సముద్ర ప్రాంతంలో పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకలను మచ్చిక చేసుకుని భారత్‌ను దిగ్బంధించాలని చూస్తున్నది. ఇలాంటి ధోరణులు ప్రపంచ శాంతికి చేటు కలిగిస్తాయి. అస్థిరతకు చోటిస్తాయి. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఘర్షణలు చాలనీ...అగ్రరాజ్యాల కొత్త వివాదాలకు ఆసియా వేదిక కారాదని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. ఈ సంగతిని అన్ని పక్షాలూ గ్రహించి మెలగాలి -
'మేము రష్యాలాగ కాదు.. ఊడ్చిపారేస్తాం'
కౌలాలంపూర్: ఉగ్రవాద అంశాన్ని తాము తీవ్రంగా తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ను తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మరో అగ్ర రాజ్యం రష్యాను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఇటీవల రష్యా కూడా సిరియాలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగిందని, అయితే, అవి నేరుగా ఇస్లామిక్ స్టేట్ అంతమొందించే లక్ష్యంతో దాడులు చేసినట్లుగా కాకుండా కేవలం తన ప్రత్యర్థిపై దాడులు చేసినట్లుగా ఉందన్నారు. కానీ, అమెరికా మాత్రం ఉగ్రవాదాన్ని ఊడ్చిపారేసే చర్యలు తీసుకుంటుందని, ప్రపంచశాంతి ముఖ్యం అని అన్నారు. ఇస్లామిక్ స్టేట్‌ను ఎదుర్కోవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని.. ఆ దిశగా ముందుకు వెళతామని చెప్పారు. యుద్ధరంగంలో ఇస్లామిక్ స్టేట్ తమను ఎదుర్కోలేదని, ఆ భయంతోనే తమకు ఉగ్రవాద రంగు పులిమే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. 'మేం ఇస్లామిక్ స్టేట్ ను ధ్వంసం చేస్తాం. అందుకోసం దానికి ఎక్కడి నుంచి నిధులు అందకుండా అడ్డుకట్ట వేస్తాం. మాకు ప్రపంచ ప్రజల ప్రాణాలు ముఖ్యం. మతపరంగా మాకు ఎలాంటి వివక్ష లేదు' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!
-
లీ, అబేలతో మోదీ భేటీ
కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా, జపాన్, మలేసియా సహా పలు దేశాధినేతలతో వరుస భేటీలు జరిపారు. ఆర్థిక పురోగతిలో మందగమనం, వాతావరణ మార్పులు, తీవ్రవాదంపై పోరాటం వంటి కీలక అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రధాని లీ కిక్వింగ్ తో చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ దానిని అధిగమించగలిగిందని లీ కిక్వింగ్ అన్నారు. త్వరలో పారిస్ లో జరగనున్న కాప్ దేశాల సదస్సుపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. సౌరశక్తి వంటి సాంప్రదాయేతల ఇంధన వనరులపై భారత్ దృష్టిసారించిన దరిమిలా ఆమేరకు చైనా కూడా తోడ్పాటును అందించాలని మోదీ కోరగా, అందుకు లీ అంగీకరించారు. భారత్ లో పెట్టుపడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని లీ తెలిపారు. మరికొన్ని ద్వైపాక్షిక అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక జపాన్ ప్రధాని షింజో అబే.. భారత ప్రధాని మోదీకి విందు ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం వీరిద్దరూ కలిసి లంచ్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరుదేశాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమంటూ షింజో గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన మోదీ.. ఇండియాలో పర్యటించాల్సిందిగా షింజోను ఆహ్వానించారు. -
మోదీ భేటీలో త్రివర్ణ పతాకం తిరగబడింది!
కౌలాలంపూర్: కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్‌కు ఇబ్బందికర పరిణామం ఎదురైంది. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షిన్జో అబె ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలకు ముందు ఫొటోల కోసం మీడియాకు ఇచ్చిన సమావేశంలో భారత జాతీయ పతాకం తిరగేసి ఎగురవేయడం కనిపించింది. చర్చలకు ముందు లాంఛనంగా మోదీ-అబె కరచాలనం చేస్తుండగా.. వారి వెనుక రెండు దేశాలు జెండాలు ఎగరేసి ఉన్నాయి. భారత జాతీయ త్రివర్ణ పతాకంలో మొదట కాషాయ వర్ణం, మధ్యలో తెలుపు రంగు, చివరన ఆకుపచ్చ వర్ణం ఉంటాయి. తిరగేసి ఎగురవేయడంతో మొదట ఆకుపచ్చ రంగుతో జాతీయ జెండా కనబడింది. అధికార వర్గాలు ఆదరాబాదరాగా ఏర్పాట్లు చేయడంతో ఏమారపాటు వల్లో, ఆ జాగ్రత్త వల్లో ఇలా జరిగిందని, ఇది దురదృష్టకరమని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. కౌలాలంపూర్‌లో జరుగుతున్న 13వ ఆసియన్-భారత్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ- జపాన్ ప్రధాని అబెతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.