బాధ్యతగా మెలగాలి | narendra modi attends asean summit | Sakshi
Sakshi News home page

బాధ్యతగా మెలగాలి

Published Wed, Nov 25 2015 1:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

బాధ్యతగా మెలగాలి - Sakshi

బాధ్యతగా మెలగాలి

మలేసియాలో ముగిసిన ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) శిఖరాగ్ర సదస్సులోనూ, ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్‌లో చేసిన ప్రసంగంలోనూ దక్షిణ చైనా సముద్రం సైనికీకరణ అంశం ప్రముఖంగా ప్రస్తావనకొచ్చింది. మరోపక్క ఈ ప్రాంతంపై తమకున్న యాజమాన్య హక్కుల్ని గుర్తించాలనీ...ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చైనాను అదుపు చేయాలనీ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో మంగళవారం ఫిర్యాదు చేసింది. రానున్న కాలంలో ఇది ఎంత వివాదాస్పదం కాబోతున్నదో ఈ ప్రస్తావనలూ, పరిణామాలే చెబుతున్నాయి.

చైనా భూభాగానికి దక్షిణంగా, వియత్నాం, కంబోడియాలకు తూర్పుగా... ఫిలిప్పీన్స్‌కు పశ్చిమంగా ఉన్న దక్షిణ చైనా సముద్ర ప్రాంతం అత్యంత కీలకమైనది. అంతర్జాతీయ సరుకు రవాణాలో మూడో వంతు ఈ మార్గం గుండానే జరుగుతుంది. అంతేకాదు...ఇక్కడి సముద్ర గర్భంలో అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటే ఈ నిక్షేపాలన్నీ సొంతం కావడంతోపాటు రక్షణపరంగా పైచేయి సాధించడం కూడా సాధ్యమవుతుందన్నది చైనా వ్యూహం.
 
 అందువల్లే ఆ ప్రాంతంలో 700 వరకూ ఉన్న చిన్న చిన్న దీవులనూ, పగడాల దిబ్బలనూ స్వాధీనపరుచుకొని ఇటుగా ఎవరొచ్చినా తాను విధించే నిబంధనలకు లోబడాలని చెబుతున్నది. సరుకు రవాణాకు ఆటంకం కలిగించబోమంటూనే ఆ ప్రాంతంలో ఓడలను నిలిపినా, లంగరేసినా అంగీకరించబోమని అంటున్నది. ఈ ప్రాంతంలోని దీవులు తమవేనంటూ అటు వియత్నాం...ఇటు ఫిలిప్పీన్స్ కూడా ఇప్పటికే ప్రకటించుకుంటున్నాయి. కానీ చైనాతో పోలిస్తే అవి పిపీలకాలు గనుక అమెరికాను తోడు తెచ్చుకుంటున్నాయి. తమ తరఫున అమెరికా పోరాడాలని భావిస్తున్నాయి.
 
 ప్రపంచంలో ఇప్పటికే 800 చోట్ల చిన్నా పెద్దా సైనిక స్థావరాలున్న అమెరికా... దక్షిణ చైనా సముద్రంలో సైతం తన ఉనికిని చాటుకోవాలని ఉబలాటపడుతున్నది. అలా చేయగలిగితే అటు చమురు, సహజ వాయు నిక్షేపాలు దక్కడంతోపాటు చైనాను సైనికంగా కట్టడి చేయడం సాధ్యమవుతుందని అది భావిస్తున్నది. కానీ అచ్చం చైనా అంటున్నట్టే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై తమకెలాంటి ఆకాంక్షలూ లేవని అమెరికా చెబుతోంది. ఆ ప్రాంతంలో తిరుగులేని చట్టబద్ధ హక్కులు ఎవరికీ లేవని, అలాంటి సందర్బాల్లో ఏ ఒక్కరినో సమర్థించడం తమ విధానం కాదని అంటున్నది. ఈ ఇద్దరూ పైకి ఏం చెబుతున్నా వారి ఆంతర్యాలు వేరే ఉండొచ్చునని సులభంగానే అర్ధమవుతుంది.
 
 ఇలాంటి పరిస్థితుల్లో ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో చైనా డిప్యూటీ విదేశాంగమంత్రి లియూ జెన్‌మిన్ తాము దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని సైనికీకరించదల్చుకోలేదని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది కాలంగా చైనా ఆ ప్రాంతంలోని దీవుల ఎత్తు పెంచడం, వాటిపై కొన్ని నిర్మాణాలు చేపట్టడం బహిరంగ రహస్యం. ఆ నిర్మాణాల్లో హెలిపాడ్‌లు, నిఘా రాడార్లు ఉన్నాయి. విమానాలు దిగే ఏర్పాట్లున్నాయి. అంతరిక్షంలో తిరుగాడే ఉపగ్రహాల ద్వారా ప్రపంచంలో ఏమూల ఎలాంటి  కార్యకలాపాలు జరుగుతున్నాయో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ ప్రాంతంపైనే నిరంతర నిఘా ఉంచిన అమెరికాకు అది చిటికెలో పని. మరి అక్కడి కార్యకలాపాల గురించి చైనా చెబుతున్నదేమిటి? జెన్‌మిన్ అవన్నీ ‘ప్రజా ప్రయోజన సేవల’కు ఉద్దేశించినవేనంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, మానవతా సాయం అందించాల్సివచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికే ఈ నిర్మాణాలకు పూనుకున్నామని వివరిస్తున్నారు.
 
 వాస్తవానికి మొన్న సెప్టెంబర్‌లో అమెరికా పర్యటించినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఒబామా సమక్షంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పెంగ్ సైతం ఈ సంగతినే చెప్పారు. కానీ ఆ తర్వాత దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి ‘ఫ్రీడం ఆఫ్ నావిగేషన్’ పేరిట అమెరికా రెండు నౌకలనూ, వీటికి తోడుగా ఒక నిఘా విమానాన్ని పంపింది. చైనా తనదేనని చెప్పుకుంటున్న దీవికి 12 నాటికల్ మైళ్ల దూరంలో ఇవి ప్రయాణించాయి. ఈ పరిణామంతో ఆగ్రహించిన చైనా అమెరికాను తీవ్ర పదజాలంతో హెచ్చరించింది. ఈ ప్రాంతంపై తమకు తిరుగులేని సార్వభౌమాధికారం ఉన్నదని, దానికి భంగం కలిగిస్తే మౌనంగా ఉండజాలమని తెలిపింది. అక్కడ తమకు సైనిక స్థావరం లేదనిగానీ, దాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం లేదనిగానీ అప్పట్లో చెప్పలేదు. అలా చూస్తే లియూ జెన్‌మిన్ ఓ మెట్టు దిగొచ్చినట్టే లెక్క. నిజానిజాల మాటెలా ఉన్నా దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని సైనికీకరించే ఉద్దేశం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ ప్రకటన చేసే సమయానికి ఒబామా ఆ వేదికపైనే ఉన్నారు.  
 
మహా సముద్రాలు, అంతరిక్షం, సైబర్ ప్రపంచం బల ప్రదర్శన వేదికలుగా మారరాదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన నిజానికి దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో రాజుకుంటున్న వివాదాన్ని ఉద్దేశించి మాత్రమే కాదు...హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా దూకుడును దృష్టిలో ఉంచుకుని కూడా మోదీ ఆ మాటలన్నారని భావించాలి. హిందూ మహా సముద్రంలోని డీగోగార్షియా దీవిని అమెరికా తన స్థావరంగా మార్చుకున్నప్పుడు మన దేశం అన్ని ప్రపంచ వేదికలపైనా ఎంతగానో పోరాడింది. ఇలాంటి ధోరణులు సరికావని హెచ్చరించింది. అయితే మన అభ్యంతరాలు ఆగిపోయాయిగానీ అమెరికా మాత్రం అక్కడినుంచి వైదొలగలేదు. ఇటు చైనా హిందూ మహా సముద్ర ప్రాంతంలో పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకలను మచ్చిక చేసుకుని భారత్‌ను దిగ్బంధించాలని చూస్తున్నది. ఇలాంటి ధోరణులు ప్రపంచ శాంతికి చేటు కలిగిస్తాయి. అస్థిరతకు చోటిస్తాయి. ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఘర్షణలు చాలనీ...అగ్రరాజ్యాల కొత్త వివాదాలకు ఆసియా వేదిక కారాదని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. ఈ సంగతిని అన్ని పక్షాలూ గ్రహించి మెలగాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement