బ్యాంకాక్: ఆసియాన్ దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బ్యాంకాక్‌లో జరిగిన 16వ ఆసియాన్-భారత్ సదస్సుకు హాజరయ్యారు. తీరప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్, డిజిటల్ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. పలు అంశాల్లో ఆసియాన్ కూటమిలోని సభ్యదేశాలతో కలిసి సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు మోదీ.
5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించాలన్న భారత్ కల త్వరలోనే సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోదీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. బ్యూరోక్రటిక్ తరహా పాలనకు స్వస్తి పలికి.. నవభారతం దిశగా దేశం అడుగులు వేస్తోందని తెలిపారు.
థాయ్ ప్రధానితో భేటీ
థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్ ఓ చాన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీతోనూ సమావేశమయ్యారు. సాయంత్రం జరిగే విందులో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment