వ్యూహాత్మక అంశాల్లో అంతర్జాతీయంగా ఒక రకమైన అనిశ్చితి అలుముకున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్‌లో ఆదివారం నుంచి మూడురోజుల విస్తృత పర్యటన జరిపారు. ఈసారి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వరస శిఖరాగ్ర సదస్సులతో సందడిగా మారింది. ఆగ్నేయాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు (ఆసి యాన్), తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు, ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) దేశాల సదస్సుల్లో మోదీ పాల్గొనడంతోపాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తోసహా పలు దేశాల అధినేతలను కలిశారు. ఈ సందర్భంగానే ఆసియా–పసిఫిక్ ప్రాంత భద్రత, సుస్థిరతలపై చర్చించేందుకు మన దేశంతోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దౌత్యవేత్తలు విడిగా సమావేశమయ్యారు. దీనికి కొనసాగింపుగా మోదీ జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్క్‌బుల్‌తో చర్చించారు. ఈ దేశాలతో చతుర్భుజ కూటమిని ఏర్పాటు చేయాలన్నది అమెరికా ఆలోచన. ఈ సదస్సులకు ముందు వియత్నాంలో ఆసియా–పసిఫిక్ ఆర్ధిక సహకార సంస్థ(ఎపెక్) శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ప్రపంచం ఇంతకు ముందున్నట్టులేదు. కొన్ని దశాబ్దాలనుంచి ఆర్ధిక సంస్కరణ లనూ, ప్రపంచీకరణనూ ప్రవచిస్తూ వాటి అమలుకు నాయకత్వంవహించిన అమెరికా... డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చాక స్వరం మార్చింది. దాదాపు ఏడాది కాలంనుంచి ‘అమెరికా ఫస్ట్’ అంటూ ‘స్వీయ రక్షణ’ చర్యలు మొదలెట్టింది. భూతా పోన్నతిని, దాని వెన్నంటి వచ్చే పర్యావరణ విధ్వంసాన్ని నియంత్రించడానికి రెండేళ్లక్రితం పారిస్‌లో కుదిరిన వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకోదల్చుకు న్నట్టు మొన్న జూన్‌లో ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఖాళీ చేస్తున్న ప్రాంతాల్లో పాగా వేసేందుకు, ఆ రకంగా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకూ చైనా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే అది తూర్పు, పడమరలను ఏకంచేసే బృహత్తరమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్‌ఐ) ప్రాజెక్టును నెత్తికెత్తుకుంది. ప్రపంచ పర్యావరణ రక్షణకు తాను చొరవ తీసుకుంటానంటోంది. తూర్పు చైనా సము ద్రంలోనూ, దక్షిణ చైనా సముద్రంలోనూ చైనాతో వివాదాలున్న జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఇవన్నీ మింగుడు పడటం లేదు. మరో పక్క హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా క్రమేపీ తన పలుకుబడిని విస్తరిం చుకుంటూ పోవడంతోపాటు మనకు సమస్యగా మారిన పాకిస్తాన్‌తో చేతులు కలపడం మన దేశానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఇన్ని పరిణామాల మధ్య మనీలా వేదికగా జరిగిన ప్రాంతీయ శిఖరాగ్ర సదస్సులకు సహజంగానే అమిత ప్రాధాన్యత ఉంటుంది.
స్వీయ మార్కెట్ల పరిరక్షణ, దేశ పౌరులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చూడటం అన్న రెండు అంశాలపైనే కేంద్రీకరించి అందుకు అవసరమైతే చైనాతో చేతులు కలిపేందుకు కూడా సిద్ధపడుతున్న అమెరికా...అదే సమయంలో ఈ ప్రాంతంలోని తన చిరకాల మిత్రుల ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి పెట్టింది. ఇందులో మన దేశం ముఖ్యపాత్ర వహించాలన్నది దాని ఉద్దేశం. ‘ట్రంప్ ఎక్కడి కెళ్లినా, ఏమాత్రం అవకాశం దొరికినా భారత్ గురించే గొప్పగా చెబుతున్నార’ని ఆయనతో సమావేశమయ్యాక సోమవారం మోదీ అన్నారు. ఇందులో నిజముంది. ట్రంప్ వచ్చాక ‘ఆసియా–పసిఫిక్’ అనే మాటనే మార్చేసి ‘ఇండో–పసిఫిక్’ అనడం మొదలుపెట్టారు. ఆసియా–పసిఫిక్ ప్రాంత భద్రతలో భారత్ కీలకపాత్ర పోషించాలన్నది ట్రంప్ ఉద్దేశం. అయితే ఇదే సమయంలో ఇతర దేశాల తీరు తెన్నుల్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమాల్లో జరిగిన జాప్యం వల్ల తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో ట్రంప్ పాలు పంచుకోలేదు. అంత కన్నా ముఖ్యమేమంటే 2007లో తొలిసారి జరిగిన చతుర్భుజ కూటమి దేశాల దౌత్యవేత్తల సమావేశానికి హాజరైన సింగపూర్ ఈసారి మాత్రం మొహం చాటేయడం. నాలుగు ప్రధాన దేశాలు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లతో పాటు సింగపూర్ కూడా అప్పట్లో సమావేశంలో పాలుపంచుకుంది. కానీ మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అది పునరాలోచనలో పడినట్టు కని పిస్తోంది. ముఖ్యంగా చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టు ఆర్ధికంగా, వాణిజ్యపరంగా తమ కెంతో మేలు చేస్తుందన్న విశ్వాసం దానికుంది. అమెరికాకు అది మిత్ర దేశమే అయినా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న దాని వైఖరి సింగపూర్‌కు మింగుడుపడటం లేదు. అందుకే తన దోవ తాను చూసుకోదల్చుకున్నట్టు కన బడుతోంది.
ఆసియా–పసిఫిక్ ప్రాంతం సుస్థిరంగా, భద్రంగా ఉండాలంటే మోదీ చెప్పి నట్టు ‘నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం’ అవసరమే కావొచ్చు. ఆ ప్రాంతంలో చైనా దూకుడు వల్ల జపాన్, వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలు సమస్యలెదుర్కొంటున్న మాట కూడా వాస్తవమే. అయితే మాట నిలకడలేని ట్రంప్‌ను నమ్ముకుని 2007 నాటి చతుర్భుజ కూటమి ఆలోచనకు మళ్లీ ప్రాణప్రతిష్ట చేయడం, అందులో మన దేశం చురుగ్గా పాలు పంచుకోవడం ఎంతవరకూ అవసరమో ఆలోచించక తప్పదు. ఈ కూటమికి తనను ఆహ్వా నించకపోవడంపైనా, దాని ఉద్దేశాలపైనా చైనాకు సంశయాలున్నాయి. మరోపక్క చతుర్భుజ కూటమి గురించి, ఇండో–పసిఫిక్ ప్రాంతం గురించి మాట్లాడుతున్న ట్రంప్ చైనాతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఆ దేశంతో తమకున్న వాణిజ్య లోటు భర్తీకి తహతహలాడుతున్నారు. అందువల్ల మనం కూడా చైనాతో ఉన్న ద్వైపాక్షిక సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే ఆ దేశంతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆసియాన్ దేశా లతో చైనా వాణిజ్యం నిరుడు 35,000 కోట్ల డాలర్లుంటే మనది 6,000 కోట్ల డాలర్లు మాత్రమే. అలాగే ఆసియాన్ దేశాల్లో మన పెట్టుబడులు వంద కోట్ల డాలర్లు దాటలేదు. వీటిని మరింత పెంచుకోవడం, పరస్పర సహకారంతో సమష్టిగా ముందుకెళ్లడం ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అత్యవసరం. ఏ ప్రాంతీయ కూటమైనా అందుకు దోహదపడాలని ఆశించాలి.
‘శిఖరాగ్ర’ సందడి!
Published Wed, Nov 15 2017 12:13 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment