ఈదురు గాలుల బీభత్సం
- ఎక్కడికక్కడ రోడ్లపై విరిగిపడిన చెట్లు
- విద్యుత్ సరఫరాకు అంతరాయం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
యలమంచిలి/యలమంచిలి రూరల్, న్యూస్‌లైన్: ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో పెద్దఎత్తున గాలులు వీచా యి. పలుచోట్ల చెట్లు విరిగి తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భవనంపై ఏర్పా టు చేసిన ప్లెక్సీ గాలికి ఎగిరి 33/11కేవీ విద్యుత్ వైర్లపై పడడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శేషుగెడ్డ వద్ద రెండువిద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాం తాలు జలమయమయ్యాయి. ఎల్‌ఐసీ కార్యాలయం రోడ్డు, మండల కార్యాలయం రోడ్డు, ధర్మవరం రోడ్లు వర్షం నీటితో నిండిపోయాయి. గురువారం వారపు సంత కావడంతో వ్యాపారులు, వినియోగదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మామిడికాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు.
పాడేరులో భారీ వర్షం
పాడేరు : ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంతటా చల్లబడింది. పాడేరుఘాట్‌లో సుమారు 2 గంటలపాటు భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. తాటిపర్తి వద్ద భారీ వృక్షం కూలడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కొయ్యూరు: మండలంలో ఈదురుగాలులకు చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంపదారిలో ఒక చెట్టు, కాకరపాడు మెయిన్‌రోడ్డులో మరో చెట్టుపడిపోయాయి. ఈ కారణంగా కాకరపాడు నుంచి కొయ్యూరు రావలసిన వాహనాలకు అంతరాయం ఏర్పడింది.
రాంబిల్లి: మండలంలో సుమారు 40 నిమిషాల పాటు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు నేలకొరిగా యి. సుమారు గంటన్నరపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దిమిలి, నారాయణపురం, కట్టుబోలు ప్రాంతాల్లో భారీగా, రాంబిల్లి పరిసర గ్రామాల్లో తేలికపాటి వర్షం పడింది. ఎండలతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. రబీ వరి నూర్పిళ్లకు ఆటంకం ఏర్పడింది.