=దిగొచ్చిన యాజమాన్యం
=ఉదయం విఫలమైన చర్చలు
=సాయంత్రం సమ్మెలోకి ఉద్యోగులు
=ఎట్టకేలకు బదిలీల నిలుపుదల
=కారుణ్య ఉద్యోగుల డిస్మిషన్ వెనక్కి
=విద్యుత్ భవన్‌లో ఉత్కంఠ
వరంగల్, న్యూస్‌లైన్ : బదిలీలు, కారుణ్య ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వుల వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. శనివారం ఉదయం సాగిన చర్చల్లో హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్, ఉన్నతాధికారులు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో నిర్లక్ష్యంగా మాట్లాడడంతో జేఏసీ ఆధ్వర్యంలో మెరుపు సమ్మెకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో డిప్లొమా ఇంజనీర్ అసోసియేషన్, తెలంగాణ ఇంజనీర్‌స అసోసియేషన్, 327 అసోషియేషన్, బీసీ ఉద్యోగుల సంఘం, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు హాజరయ్యారు.
ముందుగా మూడు ప్రధాన అంశాలను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఇటీవల కంప్యూటర్ విద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేదనే కారణంగా కారుణ్య నియామకం కింద ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం, సాధారణ బదిలీల నిషేధ సమయంలో ఏఈల బదిలీలు, ఎల్‌టీసీ బిల్లుల అంశంలో అర్హులను కూడా బాధ్యులుగా చర్యలు తీసుకున్న విషయంపై హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ జాన్ ప్రకాష్‌రావుతో చర్చలకు దిగారు. తొలగింపు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, బదిలీలు నిలిపివేయాలని, ఎల్‌టీసీ బిల్లులో అర్హుల పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.
కానీ.. వీటిపై హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ సమాధానమివ్వలేదు. అంతేగాక జేఏసీ నేతలతో నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ మధ్యాహ్నం జేఏసీ కన్వీనర్ ఎండీ యూనస్ మెరుపు సమ్మె నోటీసు ఇచ్చారు. సీఎండీ లేకపోవడంతో ఆయన ఛాంబర్‌లో నోటీసు అందజేశారు. సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్‌తో సమావేశం కాగా చర్చలు విఫలం కావడంతో సాయంత్రం ఐదు గంటల నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి మెరుపు సమ్మెకు దిగారు. సుమారు మూడు గంటల పాటు ఆందోళన కొనసాగింది. దీంతో పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
దిగొచ్చిన అధికారులు..
కార్పొరేట్ కార్యాలయంలో నినాదాలు హోరెత్తడంతో వివాదం పెద్దగా మారుతున్న సమయంలో అధికారులు దిగొచ్చారు. హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్‌తోపాటు పలువురు డెరైక్టర్లు సీఎండీని సంప్రదించారు. అనంతరం జేఏసీ కన్వీనర్ ఎండీ యూనస్‌తో హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్, సీనియర్ అధికారులు చర్చించారు. ముందుగా ఏఈల బదిలీలను నిలిపివేస్తున్నామని, కారుణ్య ఉద్యోగుల తొలగింపు ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. లేఖ పూర్వకంగా ఇవ్వాలని పట్టుబడటంతో అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక ఎల్‌టీసీలో అర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించే అంశంతోపాటు కారుణ్య ఉద్యోగులపై తీసుకునే చర్యలపై ఈనెల 31న సీఎండీ కార్తికేయ మిశ్రాతో చర్చలుంటాయని హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలు, సభ్యులు, యూనియన్ల నేతలు, సభ్యులు ఆందోళనను విరమించారు. ధర్నాకు జేఏసీలో భాగస్వాములుగా ఉన్న ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్, 1104 ఉద్యోగుల సంఘం దూరంగా ఉన్నాయి. ఆందోళనలో ఈ యూనియన్లు పాల్గొనలేదు.
ఆందోళనలో డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకుడు నార్ల సుబ్రమణేశ్వర్‌రావు, తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, జేఏసీ సభ్యులు, పలు యూనియన్ల నేతలు రవీందర్, రాజేందర్, ఆనందం, శ్రీరాం నాయక్, శ్రీధర్, వాలూ నాయక్, ఇంద్రసేనా, మధుసూదన్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
Published Sun, Dec 29 2013 2:56 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement