విద్యుత్ బోర్డుల ఆమోదం
ప్రతిపాదనలు సీఎంకు..నేడు ఉత్తర్వులు!
20,903 మంది ఔట్‌సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులు ఇక రెగ్యులర్
హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 20,903 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే ప్రతిపాదనలను విద్యుత్ సంస్థల బోర్డులు ఆమోదించాయి. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్)ల బోర్డులు శుక్రవారం విద్యుత్‌సౌధలో సమావేశమయ్యాయి. ట్రాన్స్‌కోలో 4,197 మంది, జెన్‌కోలో 2,914 మంది, టీఎస్‌ఎస్పీ డీసీఎల్‌లో 9,459 మంది, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో4,333 మందిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నాయి.
ఆ వెంటనే ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించాయి. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం లభించిన మరుక్షణమే విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలర్ ఉద్యోగులుగా విలీనం చేసుకుంటూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. మొత్తం 23,667 మంది విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా, అందులో 20,903 మంది అర్హులని దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలు నిర్ధారించాయి. తెలంగాణ స్థానికత కాకపోవడం, వయో పరిమితి మీరిపోవడం, ఉద్యోగాన్ని మధ్యలో మానేయడం, సరైన సమాచారం లేకుండా దరఖాస్తు చేసుకోవడం తదితర కారణాలతో మిగిలిన వారి దరఖాస్తులను తిరస్కరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 20,903 మంది ఉద్యోగుల్లో నైపుణ్యం లేని ఉద్యోగులు 3,199 మంది, స్వల్ప నైపుణ్యం గల ఉద్యోగులు 2,476 మంది, నైపుణ్యం గల ఉద్యోగులు 13,864 మంది, ఉన్నత నైపుణ్యం గల ఉద్యోగులు 1,364 మంది ఉన్నారు.
క్రమబద్ధీకరణకు ఓకే..
Published Sat, Jul 29 2017 1:15 AM | Last Updated on Wed, Sep 5 2018 4:10 PM
Advertisement
Advertisement