బ్రేక్‌డౌన్ల మరమ్మతుల్లో విద్యుత్ ఉద్యోగులు
Published Tue, Sep 17 2013 4:42 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
సాక్షి, తిరుపతి: 72 గంటల సమ్మె ప్రభావంతో ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో మరమ్మతులకు గురైన విద్యుత్ సబ్ స్టేషన్లు, ఫీడర్లను డిస్కం సిబ్బంది ఆగమేఘాలపై పునరుద్ధరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మూడు రోజులు సమ్మె చేసిన విషయం విదితమే. ఈ రోజుల్లో ఆరు జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. 33 కేవీ ఫీడర్లు కడప జిల్లాలో 2, ప్రకాశం 2, గుంటూరు 5, కృష్ణా 1, తిరుపతి 4, నెల్లూరు 2 మరమ్మతులకు గురయ్యాయి. సరఫరా నిలిచిపోయింది. 11 కేవీ ఫీడర్లు 50కి పైగా బ్రేక్ డౌన్ అయ్యాయి. ఆదివారం ఉదయం విధుల్లో చేరిన విద్యుత్ సిబ్బంది వీటన్నింటిని సోమవారం ఉదయానికల్లా పునరుద్ధరించారు. నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేసి, గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్ధరించారు.
విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల పునరుద్ధరణ
గాలీవానకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను కూడా పునరుద్ధరించారు. మూడు రోజుల సమ్మె ప్రభావంతో అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టారు. బిల్లింగ్ చెల్లింపులు సోమవారం మొదలయ్యాయి. సెప్టెంబరు నెల బిల్లింగ్ తయారీ పనులు కూడా ప్రారంభించారు.
మరమ్మతులు పూర్తి : సీఎండీ హెచ్‌వై.దొర
ఆరు జిల్లాల్లో విద్యుత్ ఫీడర్లు, సబ్ స్టేషన్ల బ్రేక్‌డౌన్లు ఆదివారం రాత్రికే పూర్తి చేశాం. డిస్కం పరిధిలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వర్షానికి దెబ్బతిన్న విద్యుత్ లైన్లను మంగళవారం పరిశీలించి నష్టంపై ఒక అంచనాకు రానున్నాం. విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి ఫిర్యాదులూ రావడం లేదు.
Advertisement