SPDCL
-
బాబు షాక్ ఖరీదు రూ.94 వేల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : విద్యుత్తు రంగంలో గత సర్కారు అడ్డగోలు ఒప్పందాలు, తప్పిదాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో ఇష్టారాజ్యంగా చేసుకున్న ఒప్పందాలు (పీపీఏ) గుదిబండలా పరిణమించాయి. సరిగ్గా చెప్పాలంటే అదే రేటుతో ఇప్పుడు ఒప్పందం చేసుకుంటే వినియోగదారులపై దాదాపు రూ.లక్ష కోట్ల భారం పడేది! సాధారణంగా సౌర, పవన విద్యుదుత్పత్తి వ్యయం తొలి పదేళ్లు స్థిరంగా కొనసాగి తరువాత నుంచి క్రమంగా తగ్గుతుంది. టీడీపీ సర్కారు మాత్రం వినియోగదారుల నడ్డి విరిచేలా పాతికేళ్ల పాటు అధిక ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం దారుణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ జరిగింది... టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు రూ.5.98 చొప్పున చెల్లించాలి. రెండో ఏడాది నుంచి ఏటా మూడు శాతం చొప్పున పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగుతుంది. పదో ఏడాది నాటికి ఒక్కో యూనిట్ కొనుగోలుకు రూ.7.8025 చొప్పున చెల్లించాలి. పదో ఏడాది చెల్లిస్తున్న ధరనే ఒప్పంద కాలం ముగిసే వరకు అంటే 25వ సంవత్సరం దాకా చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం తొలి ఏడాది యూనిట్ రూ.5.98 చొప్పున 464 మెగావాట్లకుగాను రూ.365.89 కోట్లు చెల్లించాలి. ఏటా 3 శాతం చొప్పున పెంచడం వల్ల పదో ఏడాది రూ.477.41 కోట్లు చెల్లించాలి. వెరసి 25 ఏళ్లకు గాను కేవలం 464 మెగావాట్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.10,978 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇలా ఆదా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గత నెలలో ఏపీ జెన్కో, ఎన్‌హెచ్‌పీసీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మొత్తం రూ.25,850 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,314 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 5,300 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్‌కు రూ.2.49 చొప్పున 25 ఏళ్ల పాటు చెల్లిస్తారు. 5,134 మెగావాట్లకు గాను పాతికేళ్లకు ప్రభుత్వం చెల్లించే మొత్తం కేవలం రూ.16,425 కోట్లు మాత్రమే. అంటే ఒక్కో యూనిట్ గత సర్కారు హయాంతో పోలిస్తే సగం కంటే తక్కువ ధరకే లభించడంతోపాటు రూ.వేల కోట్లు ఆదా అయ్యాయి. టీడీపీ పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం చెల్లిస్తే విద్యుత్తు వినియోగదారులపై అక్షరాలా రూ.94 వేల కోట్ల మేర అదనపు భారం పడేది. పాలకులు ముందుచూపుతో వ్యవహరిస్తే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలే రుజువు చేస్తున్నాయి! ఊరూ.. పేరూ ఒకటే! 464 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా నిమిత్తం ఎస్పీడీసీఎల్ 15 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఇందులో విచిత్రం ఏమిటంటే తొమ్మిది కంపెనీల రిజిస్టర్డ్ ఆఫీసు, కార్పొరేట్ ఆఫీసుల చిరునామా ఒకటే కావడం గమనార్హం. అంతేకాదు.. ఐదు కంపెనీలలో ముగ్గురు కామన్ డైరెక్టర్లుగా ఉండటం మరో విచిత్రం. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, కొందరు డైరెక్టర్లు కనీసం ఐటీ రిటర్నులు కూడా దాఖలు చేయకపోయినా రూ.కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చూపడం మరో విశేషం. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడికి చెందిన కంపెనీలు కూడా వీటిలో ఉండటం పరిశీలనాంశం. ఎల్లో మీడియా ఇవన్నీ దాచిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే యత్నం చేయటాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. -
ఆటోమెటిక్ స్టార్టర్లు తొలగించండి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వ్యవసాయ పంపు సెట్ల వద్ద రైతులు పెట్టుకున్న ఆటోమెటిక్ స్టార్టర్లను వెంటనే తొలగించాలని కింది స్థాయి అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు.. వెంటనే సంబంధిత జిల్లాల ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈలు ఆటోమెటిక్ స్టార్టర్లు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీడీసీఎల్ సీజీఎం (ఆపరేషన్స్) ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు (మెమో 3817/22–23) జారీ చేశారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోనూ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అధిక ధరతో కొన్న విద్యుత్తు వృ«థా అవుతోందనే.. వ్యవసాయ పంపు సెట్ల వద్ద ఆటోమెటిక్ స్టార్టర్లను ఉపయోగించడం వల్ల ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్ వృధా అవుతోందని, దాంతోపాటు సాగు నీరు కూడా వృథా అవుతోందని ట్రాన్స్‌కో అధికారులు భావిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకే ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
పరిశ్రమలకు వారానికో రోజు పవర్ హాలిడే
సాక్షి, తిరుపతి రూరల్: ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే అమలు చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ హరనాథ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పుత్తూరు డివిజన్‌ను మినహాయించి, మిగతా అన్ని డివిజన్లలో శుక్రవారం పవర్ హాలిడే అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు వారానికోరోజు వారాంతపు సెలవులను అమలు చేస్తున్నాయని, దీనికి అదనంగా ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేయాలని పారిశ్రామిక వినియోగదారులకు సూచించారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాలపాటు పవర్ హాలిడే అమలులో ఉంటుందన్నారు. ప్రస్తుతం కోవిడ్–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ వినియోగం అధికమైందన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన స్థాయిలో బొగ్గు లభ్యత లేకపోవడం, పవర్ ఎక్స్చేంజ్లలో డిస్కమ్‌లకు 14వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా కేవలం 2వేల మెగా వాట్ల విద్యుత్ మాత్రమే ఉన్నందున సమస్యకు కారణమవుతోందన్నారు. విద్యుత్ కోతల నివారణకు చర్యలు చేపడుతున్నామని.. విద్యుత్ సరఫరా తీరును ప్రతిరోజూ సమీక్షించి, మెరుగై నసరఫరాకు తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల) -
లిస్ట్‌లో పేరొచ్చినా.. పోస్ట్ రాలే
సాక్షి, సంగారెడ్డి టౌన్: గతేడాది జూలైలో ఐటీఐ ట్రేడ్ పరీక్ష రాసిన విద్యార్థులు అదే ఏడాది అక్టోబర్‌లో వచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూలైలో పాసైనట్లు సర్టిఫికెట్లు కలిగి ఉండటంతో ఆన్లైన్లో పేర్కొన్న అన్ని విషయాలను చదివి దరఖాస్తును పూర్తి చేశారు. డిసెంబర్ 15, 2019లో పరీక్ష రాశారు. ఫలితాలు రాగానే ర్యాంకుల ఆధారంగా కరెంట్ పోల్ పరీక్షలోనూ నెగ్గారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇలా మెరిట్ సాధించి మంచి ర్యాంకులు కలిసిన అభ్యర్థులు తమ ట్రేడ్ సర్టిఫికెట్లో డేట్ అని ఉన్నచోట నవంబర్ 6 అని ముద్రించడంతో అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మీ మెమోలు నోటిఫికేషన్ తేదీ తర్వాత ఇష్యూ అయ్యాయంటూ సదరు అభ్యర్థులను ఉద్యోగానికి అనర్హులుగా తేల్చేశారు. చదవండి: ఓఆర్ఆర్.. ఫుల్ జిగేల్! ఇతర పరీక్షలకు భిన్నంగా.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలన్నింటికీ.. వారు పేర్కొన్న అర్హత కోర్సు నోటిఫికేషన్ వచ్చే నాటికి పాసైతే సరిపోతుందని స్పష్టం చేస్తున్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు మాత్రం పరీక్షలో పాసైన నెలను వదిలిపెట్టి.. మెమో తయారు చేసిన తేదీని పరిగణలోకి తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూలైలో ట్రేడ్ కోర్సు పూర్తి చేసుకున్నట్లు సదరు ప్రభుత్వ సంస్థ గుర్తింపు ఇవ్వగా ధ్రువపత్రం తయారీ తేదీని మాత్రమే ఎలా పరిగణలోకి తీసుకుంటామని మండిపడుతున్నారు. న్యాయ పోరాటం చేస్తాం విద్యుత్ శాఖపై మమకాలంతో ఐటీఐ ట్రేడ్ కోర్సు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ గుర్తింపుతో 2019 జూలైలోనే పాసైన అభ్యర్థులు జేఎల్ఎం పరీక్షలో మెరిట్ ర్యాంక్‌లు సాధించినా ఉద్యోగాలివ్వకపోవడం దారుణం. పాసైనా నెల సరి్టఫికెట్లో స్పష్టంగా కనిపిస్తున్నా.. మెమో తయారైన తేదీని ఎలా పరిగణలోకి తీసుకుంటారు. మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చేవరకు న్యాయపోరాటం చేస్తాం. అభ్యర్థులకు మా పూర్తి మద్దతు అందిస్తున్నాం – ప్రభాకర్ గౌడ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐఎన్టీయూసీ 327 యూనియన్ జిల్లా అధ్యక్షుడు షాక్ అయ్యాను.. టీఎస్ఎస్పీడీసీఎల్ గతేడాది అక్టోబర్ నెలలో ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునే నాటికే మేము ఐటీఐ ట్రేడ్ పరీక్ష పాసయ్యాం. సంగారెడ్డి నుంచి నా జిల్లా ర్యాంక్ 468. ఇక్కడ 1000 ర్యాంకు వరకు ఉద్యోగాలొచ్చాయి. కేవలం మెమోపై తేదీ నవంబర్ 6 అని ఉండటం వల్లే ధ్రువపత్రాల పరిశీలన తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అందరిలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. ఉద్యోగం వస్తుందనుకున్నా.. ఫైనల్ రిజల్ట్‌లో నా పేరు, హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం చూసి షాకయ్యా.. – సురేష్ నాయక్, సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో మెరిట్ ర్యాంక్ వచ్చి పోస్ట్ కోల్పోయిన అభ్యర్థుల వివరాలు జిల్లా అభ్యర్థుల సంఖ్య సిద్దిపేట 12 సంగారెడ్డి 08 మెదక్ 05 మొత్తం 25 -
అక్రమాల ఇంద్రుడు
ఆ కాంట్రాక్టర్ టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడు.. విద్యుత్ శాఖలో పైరవీలతో వివిధ కాంట్రాక్టులు సొంతం చేసుకున్నాడు.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎన్నికల కోడ్ సమయంలో సబ్స్టేషన్ల నిర్వహణ పనులు దక్కించుకున్నాడు.. అంతటితో ఆగకుండా... వాటిల్లో ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగుల నుంచి అక్రమ వసూళ్లకు తెరదీశాడు. ఇలా దాదాపు ఇరవై మంది నుంచి అడ్వాన్స్ కింద రూ.70లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా బాధితులను విచారణకు రమ్మని ఆదేశించారు. సమాచారం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ వారిని విచారణకు వెళ్లకుండా నిర్బంధించాడు. దీంతో అధికారులు బాధితుల చిరునామా ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామనే పేరుతో ఓ కాంట్రాక్టర్ భారీగా వసూళ్లకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఉప కేంద్రాలను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ అక్రమాలకు తెరతీశాడు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని రామలింగాయపల్లె, పందికోన వద్ద కొత్తగా నిర్మించిన సబ్స్టేషన్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోపు పూర్తి చేశారు. అయితే వీటిని ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక గత ఎస్ఈ కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. రెండు సబ్స్టేషన్ల పరిధిలో పోస్టుల పేరుతో రూ.70లక్షల వసూలు చేశారనే సమాచారం మేరకు అధికారులు విచారణ జరిపారు. కేటాయింపులు ఇలా.. సాధారణ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. అదే రోజు నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మంజూరు, కేటాయింపులు, నోటిఫికేషన్లు జారీ చేయరాదు. అయితే గత అధికారి మాత్రం అందుకు విరుద్ధంగా పందికోన, రామలింగాయపల్లె సబ్స్టేషన్లను హడావిడిగా పూర్తి చేయించారు. వాటి నిర్వహణను టీడీపీకి చెందిన కాంట్రాక్టర్‌కు మార్చి 18న కేటాయిస్తూ సంతకాలు చేశారు. రూ.70లక్షల వసూలు.. రామలింగాయపల్లె, పందికోన సబ్స్టేషన్లు తనకే వచ్చాయని, వాటిలో ఆపరేటర్ పోస్టులు ఇస్తామని నిరుద్యోగుల నుంచి రూ.70లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్మెన్ ఉంటారు. ఆపరేటర్ పోస్టుకు రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు, వాచ్మెన్ ఉద్యోగానికి రూ.5లక్షల వరకు బేరం కుదుర్చుకొని దాదాపు ఇరవై మంది నుంచి అడ్వాన్స్ కింద రూ.70లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. మూడు సార్లు విచారణ.. కోడ్ అమల్లో ఉండగా సబ్స్టేషన్ల కేటాయింపులు జరిగాయని ఓ కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాయింట్ కలెక్టర్–2 మణిమాల తొలుత విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. రెండోసారి చీఫ్ జనరల్ మేనేజర్ లలిత జూన్ 18న క్షేత్రస్థాయికి వెళ్లి సబ్స్టేషన్లు తనిఖీ చేశారు. ఇందులో గతంలో పనిచేసిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత 26, 27వ తేదీల్లో ఎస్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (తిరుపతి) వెంకటరత్నం విచారణ జరిపారు. బాధితుల నిర్బంధం మోసపోయిన వారిని విచారించేందుకు గత నెల 26న చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ విచారణకు రావడంతో బాధితులను కాంట్రాక్టర్ అడ్డుకున్నారు. ‘మీకు ఉద్యోగాలు వస్తాయి, రాని పక్షంలో మీ డబ్బును తిరిగి ఇస్తాం.. విచారణకు వెళ్లొద్దని నమ్మబలికారు. అయినా వారు బస్సెక్కి వస్తుండగా అడ్డుకొని నిర్బంధించారు. విషయం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు బాధితుల అడ్రస్ ద్వారా క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. తాను టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడిగా చెప్పుకుంటూ అనేక పైరవీలు చేసుకుంటూ ఎదిగారని విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆదోనితో పాటు డోన్, కర్నూలు డివిజన్లలో అధికంగా 19 సబ్స్టేషన్లు పొందాడు. కొన్ని టెండర్ల ద్వారా, మరికొన్ని నామినేటెడ్ వర్క్ పేరుతో తీసుకోవడంతోపాటు స్పాట్ బిల్లింగ్ ప్రక్రియ కూడా దక్కించుకున్నాడు. -
బదిలీలకు దరఖాస్తులు నేటి నుంచే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఒకట్రెండు మినహా మిగతా శాఖలేవీ బదిలీల దరఖాస్తుల షెడ్యూలును కూడా ఖరారు చేయలేదు. పైగా సీనియారిటీ జాబితాలను కూడా సిద్ధం చేయలేకపోయాయి. సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తేశాక గురువారం దాకా పోలీసు శాఖ, ఎస్పీడీసీఎల్ మాత్రమే షెడ్యూలు జారీ చేశాయి. మిగతా శాఖలు ఇంకా సీనియారిటీ జాబితాల రూపకల్పన దశలోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని పలు మండలాలు ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి మారాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై గందరగోళం నెలకొంది. దరఖాస్తులకు షెడ్యూలు త్వరగా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం బదిలీలను ఉమ్మడి జిల్లాలవారీగా చేయాలని ప్రభుత్వం పేర్కొంది. కొన్ని మండలాల విషయంలో సమస్యలు వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ నుంచి వరంగల్ అర్బ న్ జిల్లాకు ఎల్కతుర్తి సహా 3 మండలాలు వచ్చాయి. బదిలీలను పాత జిల్లాల ప్రాతిపదికన చేయాలి గనుక ఆ 3 మండలాల ఉద్యోగులను వరంగల్ అర్బన్ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి తేవాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా ఆ మండలాల ఉద్యోగుల్లో బాగా పనిచేసే కొందరిని కలెక్టర్లు జిల్లా హెడ్‌క్వార్టర్ కు తీసుకెళ్లారు. సరిగా పని చేయని వారిని కొత్త జిల్లా ల్లోని మారుమూల ప్రాంతాలకు పంపారు. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న వివరాలు సేకరించి సీనియారిటీ జాబితా రూపొందించడంలో గందరగోళం నెలకొంది. పైగా ఈ అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నది జటిలంగా మారింది. రెండు ఉమ్మడి జిల్లాల మధ్య సమన్వయమూ కుదరక సీనియారిటీ జాబితాల రూపకల్పన ఆలస్యమవుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో బదిలీ లు చేయట్లేదు. విద్యా, ఎక్సైజ్, వైద్యారోగ్య, సంక్షేమ శాఖలు బదిలీల మార్గదర్శకాలే ఖరారు చేయలేదు. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయలేదు. ఖాళీల ను ప్రకటించలేదు. ఈ ప్రక్రియకు సమయం పట్టేలా ఉంది. పాఠశాల విద్యాశాఖలో మార్గదర్శకాలపై న్యాయ సంప్రదింపులు సాగుతున్నాయి. -
అమ్మో.. ఐఏఎస్ ఆఫీసర్!
♦ ఎస్పీడీసీఎల్ సీఎండీగా ఐఏఎస్ అధికారి నియామకం ♦ విద్యుత్ ఉద్యోగులు, అధికారుల్లో గుబులు మొదలు ♦ ఆటలు సాగవని గుసగుసలు ♦ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు ♦ సంస్థ బాగుపడుతుందని పలువురి అభిప్రాయం కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్‌శాఖ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎప ్పటిలా ఇక తమ ఆటలు సాగవని..విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని చర్చ జోరుగు జరుగుతోంది. ఏపీ ఎస్పీడీసీఎల్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా ఐఏఎస్ అధికారి అయిన ముదవతు ఎం. నాయక్ ఈనెల 1వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించడమే ఈ చర్చకు కారణమైంది. ఈయన ‘ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్నప్పుడు ఓ కార్మిక నేత చేసిన చిన్న తప్పును సైతం ఉపేక్షించలేదు. ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా ఆ నాయకుడికి పోస్టింగ్ ఇవ్వకుండా అతడి ఆటలను కట్టడి చేశారు. ఇది అప్పట్లో సంస్థలోనే హాట్ టాపిక్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీ ఎస్పీడీసీఎల్ డిస్కం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా వచ్చారు. ఇది వరకు సీఎండీగా పనిచేసిన హెచ్.వై. దొర కాల పరిమితి ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దొర ఇదే శాఖలోనే పనిచేసి ఉండటం మృధు స్వభావి కావడంతో కొందరు అధికారుల ఆటలు బాగా సాగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులను క్షణాలో చేసిపెట్టారు. సీనియర్ ఇంజినీరు కావడంతో మళ్లీ అయనే సీఎండీగా వచ్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా ఎందుకో ఫలించలేదు. చివరకు 2005 బ్యాచ్‌కు చెందిన నాయక్‌ను ఇక్కడి బాధ్యతలు అప్పగించారు. బదిలీల్లో విమర్శలు: సీఎండీగా ఉన్న దొర బదిలీల విషయంలో గత విద్యుత్ శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోరిన వ్యక్తికి కోరినట్లు ఆర్డర్లు ఇచ్చేశారు. అత్యవసరమున్న చోట్ల సిబ్బందిని కదిలించి పోస్టు లేని చోట్ల వారిని నియమించి సర్దుబాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఏకంగా కింది స్థాయి ఉద్యోగులు జూనియర్ లైన్మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు ఇలా ఎవరడిగినా ఆర్డర్స్ ఇచ్చేశారు. వాస్తవానికి వీరి బదిలీ చేయాల్సిన పవర్స్ డీఈల పరిధిలో ఉంటాయి కానీ సీఎండీ ఇష్టానుసారంగా ఇచ్చేయడం అనేక విమర్శలకు తావిచ్చింది. టీడీపీ నేతల కనుసన్నల్లో ఆయన కీలుబొమ్మలా పనిచేశారనే చర్చ జరిగింది. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు: అవినీతి, అక్రమ వసూళ్లలో విద్యుత్ శాఖ రెండో స్థానంలో ఉంది. పనుల కోసం వినియోగదారులను పీడించడం, ఇచ్చిన వాళ్లకు పనులు చేసి పెట్టడం వంటి ఆరోపణలను ఈ శాఖ ఎదుర్కొంటోంది. వీరి పట్ల పై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువే. దీంతో బాధిత వినియోగదారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఇంతకాలం ఆదే శాఖలో పనిచేసిన అధికారి సీఎండీ ఉండడంతో ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు ఐఏఎస్ అధికారి సీఎండీగా రావడంతో వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సంస్థ గాడిలో పడుతుంది: దారి తప్పిన వ్యవస్థను కొత్త సీఎండీ, ఐఏఎస్ అధికారి గాడిలో పెడతారని కొందరు ఉద్యోగులు, అధికారులు భావిస్తున్నారు. సమీక్షలు, సమావేశాల్లో పురోగతి, లక్ష్య సాధన, వినియోగదారుల ఫిర్యాదులు, అవినీతి, ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో వినియోగదారుల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉంటుంది. -
స్విచ్ వేస్తే మోతే
► బిల్లులు పెంచేందుకు సిద్ధమైన ఎస్పీడీసీఎల్ ► మూడు విధాలుగా నడ్డివిరిచే చర్యలు ► గృహ వినియోగ దారులపై భారం ఆదాయం పెంచుకునేందుకు ఎస్పీడీసీఎల్ కొత్త మార్గాన్ని అన్వేషించింది.వినియోగదారులను వీలైనంత మేర పిండి ఖజా నింపుకొనేందుకు రంగం సిద్ధం చేసింది. సాధారణంగా ఎప్పుడూ పరిశ్రమలు, ఉన్నత వర్గాల వారిపైనే దృష్టి సారించే విద్యుత్ శాఖ.. ఈ సారి మాత్రంసామాన్యులకు సైతం వాతలు పెట్టనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి చార్జీలను వడ్డించనుంది. అనంతపురం టౌన్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గృహ వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమవుతోంది. గ్రూపులుగా విభజించి విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గృహ విద్యుత్‌ను మూడు సమూహాలుగా విభజించి నడ్డి విరిచేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ విధానం వల్ల గృహ వినియోగదారులు ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. గ్రూపు మారితే గుండెగు‘బిల్లే’ కొత్త విద్యుత్ విధానం ప్రకారం గృహ వినియోగదారులు ఎంతో జాగ్రత్తగా విద్యుత్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక్క యూనిట్ అని అజాగ్రత్త వహిస్తే గ్రూపులు మారిపోయి జేబు చిల్లు పడే అవకాశం ఉంది. నెలకు 50 యూనిట్లు వంతున ఏడాదికి 600 యూనిట్లు వినియోగిస్తే వారికి తొలి 50 యూనిట్ల వరకు రూ.1.45 వసూలు చేస్తారు. ఇదే వినియోగదారుడు 600 యూనిట్ల కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే వారు బీ గ్రూపులోకి మారిపోతారు. ఫలితంగా మొదటి 50 యూనిట్లకు అప్పుడు యూనిట్‌కు రూ.1.45కి బదులు రూ.2.60 వంతున చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా గృహ యజమానిపై భారం, విద్యుత్ సంస్థకు ఆదాయం సమకూరుతుంది. జిల్లాలో 9,42,000 కనెక్షన్లు : ప్రస్తుతం జిల్లాలోని అనంతపురం, హిందూపురం, కళ్యాణదుర్గం, గుత్తి, కదిరి డివిజన్ల పరిధిలో మొత్తం 9,42,000 గృహావసరాల కనెక్షన్లు ఉన్నాయి. వీటి వల్ల నెలకు రూ. 13.50 కోట్ల ఆదాయం వస్తోంది. గ్రూపుల విధానం ప్రకారం జిల్లాలోని గృహ వినియోగదారుల నుంచి నెలకు అదనంగా 5 శాతం వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అద్దెకుంటున్న వారిపై అదనపు భారం కొత్త విద్యుత్ విధానం వల్ల అద్దె ఇళ్లలో ఉంటున్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత విధానం ప్రకారం విద్యుత్ వినియోగానికి సరిపడా బిల్లు చెల్లించేవారు. కొత్త విధానంలో ఏడాది మొత్తంలో అదనంగా ఏ మాత్రం యూనిట్లు ఎక్కువ వాడినా ఆ సర్వీసు బిల్లు అనుసరించి ఏబీసీ గ్రూపుల్లో చేరిపోయే అవకాశం ఉంది. ఇది కొత్తగా అద్దెకు దిగేవారికి తలకు మించిన భారం కాగా, యజమానులకు విద్యుత్ రీడింగ్ తలనొప్పిగా మారనుంది. ఈఆర్సీ ఆమోదిస్తే ఏప్రిల్ నుంచి అమలు : ఎస్పీడీసీఎల్ కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ గ్రూపులు 200 యూనిట్ల పైన, 300 యూనిట్లు పైన, 500 యూనిట్లుపైన చొప్పున ఉన్నాయి. ఏపీఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి) ఆమోదిస్తే కొత్త చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. 2016-17 సంవత్సరానికి గ్రూపులు, చార్జీలకు సంబంధించి టారిఫ్ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. -
ఏపీకి 6, తెలంగాణకు 5
* జాతీయ ఇంధన పొదుపు అవార్డులు అందజేసిన కేంద్రమంత్రి * డిస్కమ్స్, బిజినెస్ విభాగంలో ఏపీ ఎస్పీడీసీఎల్కు ప్రథమ బహుమతి సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన పొదుపులో తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్‌కు 6 జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఇంధన పొదుపులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సంస్థల ఉన్నతాధికారులు, ప్రతినిధులకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ అవార్డులను అందచేశారు. డెయిరీ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఉప్పల్(హైదరాబాద్) జనరల్ మేనేజర్ ఎల్.శ్రీనివాస్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో ద్వితీయ బహుమతి సాధించిన టాటా కాఫీ లిమిటెడ్, ఇన్స్టంట్కాఫీ డివిజన్, తూప్రాన్ యూనిట్(మెదక్) ప్రతినిధి సంజీవ్ సారన్, జనరల్ కేటగిరీలో ద్వితీయ బహుమతి సాధించిన దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్, కాజీపేట పంపింగ్ సెక్టర్(సికింద్రాబాద్) నుంచి సోలంగుప్త, మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ బీఈఈ స్టార్ లేబుల్డ్ అప్లియెన్స్(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సుఫార్మర్) విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) మెదక్ ప్రతినిధి ఉపాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, కార్యాలయ భవనం విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ సీ-టీఏఆర్ఏ బిల్డింగ్(సికింద్రాబాద్) ఎస్సీఆర్ జీఎం రవీంద్ర గుప్తాలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులు ప్రదానం చేశారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ షీప్మండి పంప్‌హౌజ్ (సికింద్రాబాద్), కాచీగూడ రైల్వే స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే సంచాలన్‌భవన్ (సికింద్రాబాద్), లాలాగుడ సెంట్రల్ ఆసుపత్రి, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (సికింద్రాబాద్) మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఆదిత్యాపార్క్ హోటల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సోహరబ్జి గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (రంగారెడ్డి జిల్లా)కు మెరిట్ సర్టిఫికెట్లు లభించాయి. ఏపీ నుంచి..: డెయిరీ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్(చిత్తూరు) అధ్యక్షుడు సాంబశివరావు, విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్స్) విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(చిత్తూరు) సీఎండీ హెచ్.వై.దొర, జనరల్ కేటగిరీలో ప్రథమ బహుమతి సాధించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(విశాఖ) కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీస్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఎస్ఈసీఎం), ఇంధన శాఖ విభాగం, ఐఎండీఐ, (ఏపీ ప్రభుత్వం) సీఈవో చంద్రశేఖరరెడ్డి, బిజినెస్ మోడల్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన ఎస్పీడీసీఎల్(తిరుపతి) సీఎండీ హెచ్.వై.దొర, ద్వితీయ బహుమతి సాధించిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌లకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అవార్డులను ప్రధానం చేశారు. -
విద్యుత్ టెండర్ల కోసం కంపెనీల క్యూ
* 1,000 మెగావాట్ల కొనుగోళ్లకు టెండర్లు * విద్యుదుత్పత్తిదారుల నుంచి 2,265 మెగావాట్లకు స్పందన సాక్షి, హైదరాబాద్: దక్షిణాది నుంచి ఎనిమిదేళ్ల పాటు 1,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కొనుగోళ్లు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లకు మంచి స్పందన లభించింది. మొత్తం 2,265 మెగావాట్ల విద్యుత్‌ను విక్రయించేందుకు 5 ప్రైవేటు విద్యుత్ కంపెనీలు ముందుకొచ్చి బిడ్లు దాఖలు చేశాయి. ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు భవిష్యత్తు అవసరాల కోసం 8 ఏళ్ల పాటు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుదుత్పత్తిదారుల నుంచి సాంకేతిక అర్హత (టెక్నికల్ క్వాలిఫికేషన్) కోరుతూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) గత నెల 15న టెండర్లను ఆహ్వానించింది. సోమవారం ఈ టెండర్లను ఎస్పీడీసీఎల్ అధికారులు తెరిచి పరిశీలించారు. సాంకేతిక బిడ్డింగ్‌లో అర్హత సాధించిన కంపెనీల నుంచి త్వరలో ఆర్థిక బిడ్లను ఆహ్వానించనున్నారు. నెల్లూరుకు చెందిన మూడు కంపెనీలు 1,200 మెగావాట్లకు బిడ్లు దాఖలు చేయగా, వీటి నుంచి 1,000 మెగావాట్ల కొనుగోళ్లకు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఉత్తరాదికి చెందిన రెండు కంపెనీలు సైతం 1,000 మెగావాట్లను విక్రయించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, వాటిని తిరస్కరించాలని ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. -
వేసవిలో విద్యుత్ కోతలు ఉండవు
ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌జే దొర సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వచ్చే వేసవిలో కూడా కరెంట్ కోతలు లేకుండా చూసేందుకు మూడువేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బయట నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌జె దొర తెలిపారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 24 గంటలు విద్యుత్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల పూర్తి స్థాయిలో విద్యుత్ ఇవ్వలేకపోతున్నామన్నారు. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ జూలైలో ప్రారంభించినా కొత్త ప్లాంట్ కావడంతో పూర్తిస్థాయిలో పనిచేయడానికి సమయం పడుతుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో సింహాద్రి ప్లాంట్‌లో వెయ్యి మెగావాట్ల సామర్ధ్యం ఉన్న రెండు యూనిట్లు మరమ్మతుల నిమిత్తం ఆపామన్నారు. హిందుజా ప్లాంట్ ఈ నెలలో అందుబాటులోకి రావాల్సి ఉండగా, హుద్‌హుద్ తుఫాను కారణంగా జాప్యం జరిగిందన్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హిందుజా పూర్తయితే వచ్చే 1040 మెగావాట్లను మన రాష్ట్రానికే కేటాయించాలని ప్రతిపాదించారన్నారు. కృష్ణపట్నం రెండో దశ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కేస్-1 బిడ్డింగ్‌లో రిలయన్స్ పవర్‌ప్లాంట్ నాలుగు వేల మెగావాట్లకి టెండర్లు ఆమోదించామని, అయితే న్యాయపరమైన కారణాల వల్ల ఇది ప్రారంభం కాలేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సౌర విద్యుత్ 620 మెగావాట్లకు టెండర్లు ఖరారు చేశామని చెప్పారు. మరో 1500 మెగావాట్లు ఎన్టీపీసీ, జెన్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌జె దొర తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచాలా వద్దా అన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కొత్తగా ఎప్పీడీసీఎల్ పరిధిలోకి అనంతపురం, కర్నూలు జిల్లాలు వచ్చి చేరడం వల్ల అసలు ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుంది, వినియోగం ఎంత, ఎంత ఆదాయం వస్తుందన్న అంచనాలు ఈ నెలాఖరుకి గానీ తయారు కావని చెప్పారు. అవి వచ్చిన తర్వాత టారిఫ్ ఎంత ఉండాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. -
విద్యుత్ ప్రమాదాల నివారణకు కదిలిన సర్కార్
ప్రత్యేక కార్యాచరణతో ముందుకు.. - పెలైట్ ప్రాజెక్ట్ కింద గజ్వేల్ ఎంపిక - వెల్లడించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి - ఎర్తింగ్ లోపాల నివారణకు మండలానికో రూ. లక్ష - సబ్స్టేషన్లను సందర్శించిన సీఎండీ గజ్వేల్: పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద సొంత మరమ్మతుల కారణంగా జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్న దుస్థితిపై సర్కారు ఎట్టకేలకు దృష్టిసారించింది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 15న జిల్లాలోని సమస్య తీవ్రతను ఎత్తిచూపుతూ ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో స్పందించిన ఎస్పీడీసీఎల్ (సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) సీఎండీ రఘుమారెడ్డి బుధవారం గజ్వేల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 33/11కేవీ, 133/33కేవీ సబ్‌స్టేషన ఆవరణలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పంటపొలాల్లో వేలాడుతున్న స్తంభాలు, వైర్లను సరిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. మరోవైపు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ లోపాల నివారణకు మండలానికో లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఏఈ కార్యాలయాల్లో ఫిర్యాదుల రిజిష్టర్‌ను నిర్వహిస్తామని తెలిపారు. రైతులు, ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదును నమోదు చేస్తే పరిశీలన జరిపి వారంరోజుల్లో నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులు సొంతంగా మరమ్మతులు చేసి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని కోరారు. సిబ్బంది కొరత వల్ల గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమేనని వెల్లడించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రాల్లో వేగంగా సేవలందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వచ్చిన వెంటనే రెండుగంటల్లోపు దానిని మరమ్మతు చేయించి ఇవ్వడం లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం చేస్తామన్నారు. మరమ్మతు కేంద్రాల్లో సేవలకు రైతులు ఒక్కరూపాయి కూడా ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. గజ్వేల్‌లో లోడింగ్, అన్లోడింగ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ రాములు, డీఈ యాదయ్య, గజ్వేల్ ఏడీఈ జగదీష్, ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
మనవారేనని వదిలేస్తారా..!
సాక్షి, సిటీబ్యూరో: వంద రూపాయలు బకాయి పడితే సామాన్యుడికి షాకిస్తున్న సీపీడీసీఎల్... పెద్దల బకాయిలపై నోరు మెదపడంలేదు. బడా వ్యక్తులు, ఉద్యోగ సంఘాల బకాయిలు లక్షల్లో పేరుకుపోయినా మిన్నకుడం గమనార్హం. సీపీడీసీఎల్‌కు చెందిన ఉద్యోగ సంఘాల్లో ఒక్కో సంఘం చెల్లించాల్సిన బకాయి లు రూ.లక్షకు పైగా ఉందంటే అతిశయోక్తి కాదు. వీరిని వదిలేసి అల్పాదాయ వర్గాలపై ప్రతాపం చూపుతున్న విద్యుత్‌శాఖ వైఖరి పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల పైనే ప్రతాపం ఎలక్ట్రిసిటీ రెవెన్యూ చట్టం ప్రకారం విద్యుత్‌ను వినియోగిస్తున్న వారెవరైనా సంస్థకు బిల్లు చెల్లించాల్సిందే. కానీ ఈ బిల్లు వసూళ్లలో అధికారులు మాత్రం స్థానిబట్టి వివక్ష చూపుతున్నారు. సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారుడి విద్యుత్ కనెక్షన్ తొలగించే అధికారం ఉన్నా, అధికారులు మాత్రం ఈ చట్టాన్ని నిరుపేదలకే వర్తింపజేసి కనెక్షన్లు తొలగించడంతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు, పార్టీ ఆఫీసులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు, ఏళ్లకు యేళ్లుగా కరెంట్ బిల్లు కట్టకపోయినా పట్టించుకోని డిస్కం నెలసరి బిల్లుల పేరుతో సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బడా బకాయిదారులందరికీ విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా..ఆయా వ్యక్తుల ఇళ్లల్లో మాత్రం వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాయి. ఇంటి దొంగలను పట్టించుకోని సీఎండీ బిల్లు కట్టలేదనే నెపంతో వారం రోజుల క్రితం గోల్కొండకోటకు విద్యుత్ సరఫరా నిలిపివేయగా, రెండు నెలలుగా బిల్లు చెల్లించడ ం లేదంటూ ఈనెల 26న బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయానికి సరఫరా నిలిపివేసింది. రెండు రోజుల క్రితం బిల్లు చెల్లించలేదని బేగంబజార్‌లోని ఓ వస్త్రవ్యాపారికి సంబంధించిన కనెక్షన్ కట్ చేయడంతో వ్యాపారులంతా ఆందోళనకు దిగిన విష యం విధితమే. తాజాగా శనివారం టోలీచౌకీ బల్దియా వార్డు కార్యాలయానికి విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సామాన్యులు, ప్రభుత్వ కార్యాలయాల క నెక్షన్లు కట్ చేస్తున్న సీపీడీసీఎల్ సీఎండీ తమ ఇంటి దొంగలను మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాభై రూపాయలు బకాయి పడినా కనెక్షన్ తొలగిస్తామని చెప్పే అధికారులు లక్షల్లో బకాయి పడినవాని ఏ విధంగా వదిలేస్తున్నారో వారికే తెలియాలి. -
రైతులకు సర్కారీ ఉచిత షాక్ !
వరంగల్, న్యూస్‌లైన్ : ఉచిత విద్యుత్‌ను రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే అతి భారంగా పరిగణిస్తోంది. వ్యవసాయానికి ఎక్కువ నిధులు వెచ్చిస్తున్నామని, విద్యుత్ సరఫరా కోసం అత్యధిక సబ్సిడీ ఇస్తున్నట్లు పలుమార్లు వాటికి ఆంక్షలు వేసే ప్రయత్నం చేసింది. ఒక దశలో నాలుగు నెలల క్రితం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తి వేసే నిర్ణయం కూడా తీసుకుంది. కానీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత విద్యుత్‌కు కళ్లెం వేస్తే... రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేక వస్తుందనే నివేదికలతో ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. కానీ... మళ్లీ ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం డిస్కంలు సర్కారుపై ఒత్తిడి తీసుకువస్తుండడంతో ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అత్యధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్ సర్కిల్లో ఈ దొంగచాటు ప్రయోగాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయ పంపు సెట్ల వద్ద రీడింగ్ మీటర్లను బిగిస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల వద్దే కొత్త మీటర్లను అమర్చి... వ్యవసాయానికి వినియోగించే ప్రతి కనెక్షన్‌నూ వాటికి లింక్ చేస్తోంది. ఈ మేరకు విద్యుత్ సిబ్బంది రీడింగ్ తీస్తున్నారు. ఈ మేరకు వినియోగమవుతున్న విద్యుత్‌ను అంచనా వేసి... బిల్లులు వసూలు చేసేందుకు మాయత్తమవుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫార్మర్‌కో మీటర్ జిల్లాలోని ఆయా సబ్ డివిజన్లలో ప్రతి ఐదు ట్రాన్స్ఫార్మర్లకు వ్యూహాత్మకంగా రీడింగ్ మీటర్లను ఏర్పాటు చేశారు. 100 కేవీ, 63 కేవీ, 25 కేవీ, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లకు ఈ మీటర్లను బిగించారు. ప్రస్తుతం 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 40 నుంచి 50, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 20 నుంచి 30, 25 కేవీ కింద 5 నుంచి 7, 16 కేవీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 3 నుంచి 5 వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన రీడింగ్ మీటర్లకు సంబంధిత ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇచ్చిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను లింక్ చేశారు. ప్రతి కనెక్షన్‌కూ రీడింగ్ మీటర్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా అనుసంధానం చేశారు. దీంతో ఒక్కో రైతు వ్యవసాయానికి రోజుకు ఎంత విద్యుత్‌ను వినియోగిస్తున్నాడు... ఎంత ఖర్చు పడుతోంది... కస్టమర్ చార్జీతో కలిపి ఎంత మేరకు బిల్లు వేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్ఫార్మర్లకు ఈ మీటర్లను ఏర్పాటు చేశారు. వాటి నుంచే రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు సుమారు 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో 75 నుంచి 100 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ను పరిమితం చేసే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. కాగా, పూర్తిస్థాయిలో విద్యుత్‌ను వినియోగించుకోని రైతులకు సగం మేర బిల్లు వేసే అవకాశాలున్నట్లు సమాచారం. -
24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: తిరుపతి ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాల్లో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. స్థానిక సరోవర్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 రోజులుగా ఎస్పీడీసీఎల్ పరిధిలో కురుస్తున్న వర్షాల వల్ల విద్యుదుత్పత్తి మెరుగైందని చెప్పారు. కొత్త విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడికి ఏడు రోజుల్లోపే కనెక్షన్ ఇస్తామన్నారు. ఇందిర జలప్రభ పథకం కింద చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంపెనీ పరిధిలో 33/11 కేవీ సబ్స్టేషన్లు 285 మంజూరయ్యాయని, వీటిలో 183 సబ్స్టేషన్లకు స్థలాల సేకరణ పూర్తిచేసి పనులు జరుగుతున్నాయని చెప్పారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ సంస్థ ద్వారా హెచ్‌వీడీఎస్ పనులకుగాను వెయ్యి కోట్లు మంజూరైనట్లు తెలిపారు. జిల్లాలో రెండు డివిజన్లలో హెచ్‌వీడీఎస్ పనులు జరుగుతున్నాయన్నారు. ఉద్యోగుల సమ్మె కారణంగా కంపెనీ పరిధిలో రెవెన్యూ కనెక్షన్లు తగ్గుతున్నాయని, వీటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 215 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక: 215 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు తయారు చేశామని.. కానీ ఇప్పటి వరకు ఎక్కడా పనులు మొదలుపెట్టలేదన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే పనులు మొదలుపెట్టి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో ప్రాజెక్టు డెరైక్టర్ రాంసింగ్, ఆపరేషన్ డెరైక్టర్ రాధాకృష్ణ, సీఈ రాజగోపాలయ్య, ఎస్ఈ జయభారతరావు, డీఈసీ మురళీకృష్ణ యాదవ్, ఒంగోలు డీఈ కట్టా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులతో సమావేశం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎండీ విద్యుత్ శాఖాధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చిన ఆయన జిల్లాలో జరుగుతున్న పనుల వివరాలను అధికారులనడిగి తెలుసుకున్నారు. సబ్స్టేషన్లు, రెవెన్యూ కనెక్షన్లు, సిబ్బంది వివరాలడిగారు. అభివృద్ధి పనులను, రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. సీఎండీని కలిసిన పలు సంఘాల నేతలు: సీఎండీగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి జిల్లాకు వచ్చిన హెచ్‌వై దొరను విద్యుత్ శాఖ యూనియన్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. వీరిలో ప్రధానంగా 327 యూనియన్ నాయకులు కలిసి కార్మికుల సమస్యలపై వివరించారు. కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.సాంబశివరావు, నాయకులు శ్రీరామమూర్తి, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, రవి, వెంకటేశ్వర్లు, వాసు, రామకృష్ణ, పూర్ణ తదితరులున్నారు. అలాగే 104 యూనియన్ నాయకులు ఎం. జయకర్, సంజీవరావులు, సీఎండీని కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
బ్రేక్డౌన్ల మరమ్మతుల్లో విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, తిరుపతి: 72 గంటల సమ్మె ప్రభావంతో ఎస్పీడీసీఎల్ పరిధిలోని చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో మరమ్మతులకు గురైన విద్యుత్ సబ్ స్టేషన్లు, ఫీడర్లను డిస్కం సిబ్బంది ఆగమేఘాలపై పునరుద్ధరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు మూడు రోజులు సమ్మె చేసిన విషయం విదితమే. ఈ రోజుల్లో ఆరు జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. వందలాది గ్రామాల్లో అంధకారం నెలకొంది. 33 కేవీ ఫీడర్లు కడప జిల్లాలో 2, ప్రకాశం 2, గుంటూరు 5, కృష్ణా 1, తిరుపతి 4, నెల్లూరు 2 మరమ్మతులకు గురయ్యాయి. సరఫరా నిలిచిపోయింది. 11 కేవీ ఫీడర్లు 50కి పైగా బ్రేక్ డౌన్ అయ్యాయి. ఆదివారం ఉదయం విధుల్లో చేరిన విద్యుత్ సిబ్బంది వీటన్నింటిని సోమవారం ఉదయానికల్లా పునరుద్ధరించారు. నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేసి, గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్ధరించారు. విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల పునరుద్ధరణ గాలీవానకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను కూడా పునరుద్ధరించారు. మూడు రోజుల సమ్మె ప్రభావంతో అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టారు. బిల్లింగ్ చెల్లింపులు సోమవారం మొదలయ్యాయి. సెప్టెంబరు నెల బిల్లింగ్ తయారీ పనులు కూడా ప్రారంభించారు. మరమ్మతులు పూర్తి : సీఎండీ హెచ్‌వై.దొర ఆరు జిల్లాల్లో విద్యుత్ ఫీడర్లు, సబ్ స్టేషన్ల బ్రేక్డౌన్లు ఆదివారం రాత్రికే పూర్తి చేశాం. డిస్కం పరిధిలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వర్షానికి దెబ్బతిన్న విద్యుత్ లైన్లను మంగళవారం పరిశీలించి నష్టంపై ఒక అంచనాకు రానున్నాం. విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి ఫిర్యాదులూ రావడం లేదు.