అమ్మో.. ఐఏఎస్ ఆఫీసర్!
♦ ఎస్‌పీడీసీఎల్ సీఎండీగా ఐఏఎస్ అధికారి నియామకం
♦ విద్యుత్ ఉద్యోగులు, అధికారుల్లో గుబులు మొదలు
♦ ఆటలు సాగవని గుసగుసలు
♦ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు
♦ సంస్థ బాగుపడుతుందని పలువురి అభిప్రాయం
కర్నూలు (రాజ్‌విహార్):
విద్యుత్‌శాఖ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఎప ్పటిలా ఇక తమ ఆటలు సాగవని..విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని చర్చ జోరుగు జరుగుతోంది. ఏపీ ఎస్‌పీడీసీఎల్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా ఐఏఎస్ అధికారి అయిన ముదవతు ఎం. నాయక్ ఈనెల 1వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించడమే ఈ చర్చకు కారణమైంది. ఈయన ‘ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్నప్పుడు ఓ కార్మిక నేత చేసిన చిన్న తప్పును సైతం ఉపేక్షించలేదు. ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా ఆ నాయకుడికి పోస్టింగ్ ఇవ్వకుండా అతడి ఆటలను కట్టడి చేశారు. ఇది అప్పట్లో సంస్థలోనే హాట్ టాపిక్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏపీ ఎస్‌పీడీసీఎల్ డిస్కం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా వచ్చారు.
ఇది వరకు సీఎండీగా పనిచేసిన హెచ్.వై. దొర కాల పరిమితి ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దొర ఇదే శాఖలోనే పనిచేసి ఉండటం మృధు స్వభావి కావడంతో కొందరు అధికారుల ఆటలు బాగా సాగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులను క్షణాలో చేసిపెట్టారు. సీనియర్ ఇంజినీరు కావడంతో మళ్లీ అయనే సీఎండీగా వచ్చేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా ఎందుకో ఫలించలేదు. చివరకు 2005 బ్యాచ్‌కు చెందిన నాయక్‌ను ఇక్కడి బాధ్యతలు అప్పగించారు.
బదిలీల్లో విమర్శలు:
సీఎండీగా ఉన్న దొర బదిలీల విషయంలో గత విద్యుత్ శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోరిన వ్యక్తికి కోరినట్లు ఆర్డర్లు ఇచ్చేశారు. అత్యవసరమున్న చోట్ల సిబ్బందిని కదిలించి పోస్టు లేని చోట్ల వారిని నియమించి సర్దుబాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఏకంగా కింది స్థాయి ఉద్యోగులు జూనియర్ లైన్‌మెన్లు, జూనియర్ అసిస్టెంట్లు ఇలా ఎవరడిగినా ఆర్డర్స్ ఇచ్చేశారు. వాస్తవానికి వీరి బదిలీ చేయాల్సిన పవర్స్ డీఈల పరిధిలో ఉంటాయి కానీ సీఎండీ ఇష్టానుసారంగా ఇచ్చేయడం అనేక విమర్శలకు తావిచ్చింది. టీడీపీ నేతల కనుసన్నల్లో ఆయన కీలుబొమ్మలా పనిచేశారనే చర్చ జరిగింది.
అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు:
అవినీతి, అక్రమ వసూళ్లలో విద్యుత్ శాఖ రెండో స్థానంలో ఉంది. పనుల కోసం వినియోగదారులను పీడించడం, ఇచ్చిన వాళ్లకు పనులు చేసి పెట్టడం వంటి ఆరోపణలను ఈ శాఖ ఎదుర్కొంటోంది. వీరి పట్ల పై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా తక్కువే. దీంతో బాధిత వినియోగదారులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో కేసులు నమోదై ఉన్నాయి. అయితే ఇంతకాలం ఆదే శాఖలో పనిచేసిన అధికారి సీఎండీ ఉండడంతో ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు ఐఏఎస్ అధికారి సీఎండీగా రావడంతో వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
సంస్థ గాడిలో పడుతుంది:
దారి తప్పిన వ్యవస్థను కొత్త సీఎండీ, ఐఏఎస్ అధికారి గాడిలో పెడతారని కొందరు ఉద్యోగులు, అధికారులు భావిస్తున్నారు. సమీక్షలు, సమావేశాల్లో పురోగతి, లక్ష్య సాధన, వినియోగదారుల ఫిర్యాదులు, అవినీతి, ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో వినియోగదారుల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేందుకు అవకాశం ఉంటుంది.