సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుంచే ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఒకట్రెండు మినహా మిగతా శాఖలేవీ బదిలీల దరఖాస్తుల షెడ్యూలును కూడా ఖరారు చేయలేదు. పైగా సీనియారిటీ జాబితాలను కూడా సిద్ధం చేయలేకపోయాయి. సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తేశాక గురువారం దాకా పోలీసు శాఖ, ఎస్‌పీడీసీఎల్ మాత్రమే షెడ్యూలు జారీ చేశాయి. మిగతా శాఖలు ఇంకా సీనియారిటీ జాబితాల రూపకల్పన దశలోనే ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాల్లోని పలు మండలాలు ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి మారాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై గందరగోళం నెలకొంది. దరఖాస్తులకు షెడ్యూలు త్వరగా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం బదిలీలను ఉమ్మడి జిల్లాలవారీగా చేయాలని ప్రభుత్వం పేర్కొంది. కొన్ని మండలాల విషయంలో సమస్యలు వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ నుంచి వరంగల్ అర్బ న్ జిల్లాకు ఎల్కతుర్తి సహా 3 మండలాలు వచ్చాయి.
బదిలీలను పాత జిల్లాల ప్రాతిపదికన చేయాలి గనుక ఆ 3 మండలాల ఉద్యోగులను వరంగల్ అర్బన్ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి తేవాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా ఆ మండలాల ఉద్యోగుల్లో బాగా పనిచేసే కొందరిని కలెక్టర్లు జిల్లా హెడ్‌క్వార్టర్ కు తీసుకెళ్లారు. సరిగా పని చేయని వారిని కొత్త జిల్లా ల్లోని మారుమూల ప్రాంతాలకు పంపారు. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న వివరాలు సేకరించి సీనియారిటీ జాబితా రూపొందించడంలో గందరగోళం నెలకొంది.
పైగా ఈ అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నది జటిలంగా మారింది. రెండు ఉమ్మడి జిల్లాల మధ్య సమన్వయమూ కుదరక సీనియారిటీ జాబితాల రూపకల్పన ఆలస్యమవుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో బదిలీ లు చేయట్లేదు. విద్యా, ఎక్సైజ్, వైద్యారోగ్య, సంక్షేమ శాఖలు బదిలీల మార్గదర్శకాలే ఖరారు చేయలేదు. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేయలేదు. ఖాళీల ను ప్రకటించలేదు. ఈ ప్రక్రియకు సమయం పట్టేలా ఉంది. పాఠశాల విద్యాశాఖలో మార్గదర్శకాలపై న్యాయ సంప్రదింపులు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment